Children's Day 2021 Special: పరమానందయ్య కాళ్లు నరకబోయిన శిష్యులు.. కథ!
పరమానందపురంలో పరమానందయ్య అనే గురువు ఉండేవాడు. ఆయన భార్య సుందరమ్మ. వాళ్లకు పిల్లల్లేరు. ఆయన దగ్గర దద్దమ్మల్లాంటి శిష్యులు ఉండేవారు. పిల్లల్లేకపోవడంతో వాళ్లెంత దద్దమ్మలైనా పరమానందయ్య దంపతులు వాళ్లను సొంత పిల్లల్లాగానే చూసుకునేవాళ్లు. వాళ్ల చేష్టలు పరమానందయ్యకు తరచు చిక్కులు తెచ్చిపెడుతుండేవి.
ఒకసారి పరమానందయ్య భార్యతోను, శిష్యులతోను కలసి పొరుగూరుకు బయలుదేరాడు. దారి మధ్యలో ఏరు దాటాల్సి వచ్చింది. చాలా దూరం కాలినడకన ప్రయాణం సాగించడమే కాకుండా, ఏరు కూడా దాటి ఊరికి చేరుకోవలసి రావడంతో పరమానందయ్య బాగా అలసిపోయాడు. ఆయన భార్య పరిస్థితీ అలాగే ఉంది. విపరీతమైన ప్రయాణ బడలిక వల్ల ఒళ్లునొప్పులతో బాధపడసాగాడు. శిష్యులను పిలిచి, ‘నాయనలారా! ప్రయాణ బడలిక వల్ల ఒళ్లంతా నొప్పులుగా ఉంది. కాస్త ఒళ్లు పట్టండి’ అని చెప్పాడు.
గురువుగారు ఆజ్ఞాపించడమే తడవుగా, ఆయన ఒళ్లు పట్టడానికి నలుగురు శిష్యులు ముందుకొచ్చారు. ఒక్కొక్క అవయవాన్నీ వంతులు వేసుకున్నారు. ఒకడు కుడిచెయ్యి, ఇంకొకడు ఎడమచెయ్యి, ఒకడు కుడికాలు, మరొకడు ఎడమకాలు పట్టనారంభించారు. శిష్యులు శ్రద్ధగా ఒళ్లుపడుతుండటంతో పరమానందయ్యకు కొంత బడలిక తీరి నిద్ర ముంచుకొచ్చింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు.
ఇంతలో కాళ్లు పట్టే శిష్యుల మధ్య గొడవ మొదలైంది. నా కాలు మంచిదంటే, నా కాలే మంచిదంటూ వాదనకు దిగారు. ఒకడు పట్టే కాలిని మరొకడు కొట్టుకునే వరకు వచ్చింది వ్యవహారం. అప్పటికీ గొడవ చల్లారలేదు. ‘నీ కాలిని నరికేస్తా’ అన్నాడొకడు. ‘నేనూరుకుంటానా! నేనూ నీ కాలిని నరికేస్తా!’ బదులిచ్చాడు ఇంకొకడు. ఇల్లంతా గాలించి, ఇద్దరూ చెరో గొడ్డలీ తీసుకొచ్చి, గురువుగారి కాళ్లను నరికి పారేసేందుకు సిద్ధపడ్డారు. వాళ్ల వాలకం చూసి మిగిలిన శిష్యులు హాహాకారాలు ప్రారంభించారు. ఈ గలాటాకు గురువుగారికి తెలివి వచ్చింది.
చేతుల్లో గొడ్డళ్లతో శిష్యులిద్దరు కనిపించగానే, ఆయన నిద్ర దెబ్బకు వదిలిపోయింది. మూర్ఖులు పట్టుదలకు పోయి, నిజంగానే తన కాళ్లను ఎక్కడ నరికి పారేస్తారోనని భయం పట్టుకుంది.
‘ఒరే! వెధవల్లారా! మీరూ మీరూ తగవుపడి నా కాళ్లు నరుకుతారేమిట్రా? మీకేం పోయేకాలమొచ్చింది?’ అంటూ లేవబోయాడు.
చేతులు పడుతున్న శిష్యులిద్దరూ, గురువుగారిని లేవనివ్వకుండా గట్టిగా నొక్కిపట్టి, ‘గురువుగారూ! ఈ వెధవలిద్దరూ ఎప్పుడూ ఇలాగే గొడవపడుతుంటారు. మీరేమీ వాళ్ల గొడవ పట్టించుకోకండి. మేం మీ చేతులు పడుతున్నాం కదా!’ అని సర్దిచెప్పసాగారు.
ఈలోగా కాళ్లు పట్టే శిష్యులిద్దరూ, గొడ్డళ్లు పట్టుకుని ఆవేశంగా గురువుగారి కాళ్లు నరకడానికి సిద్ధమయ్యారు. వారి వాలకం చూసి ఆయనకు గుండె గుభేలుమంది. వెంటనే, ‘సుందరీ! ఒకసారి ఇలారా!’ అంటూ లోపల ఉన్న భార్యను కేకవేసి పిలిచాడు.
భర్త పొలికేక విన్న సుందరమ్మ హుటాహుటిన బయటకు వచ్చింది. గొడ్డళ్లు పట్టుకుని భర్త కాళ్లను నరికేందుకు శిష్యుల వాలకం చూసి, ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ‘మూర్ఖపు వెధవల్లారా! మీరు గొడవపడి, గురువుగారి కాళ్లు నరికేస్తార్రా! ఉండండి మీ పని చెబుతాను’ అంటూ అందుబాటులో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని, వాళ్లను చావబాది, ఇంట్లోంచి తరిమేసింది. ఆ రోజంతా వాళ్లకు తిండిపెట్టలేదు.
మర్నాడు ఉదయం కూడా వాళ్లకు తిండిపెట్టలేదు.
మర్నాడు మధ్యాహ్నం ఇంటి బయట చెట్టుకింద కూర్చుని, ఆకలికి అలమటిస్తూ దుఃఖిస్తున్న శిష్యులను చూసి, పరమానందయ్యకు వాళ్ల మీద జాలి పొంగుకొచ్చింది.
భార్య మనసు కరిగితే గాని, వాళ్లకు ఆ పూట కూడా తిండిపుట్టదని ఆయనకు తెలుసు. అందుకే, వెంటనే ఇంట్లోకి వచ్చి, భార్యకు నచ్చచెప్పడం ప్రారంభించాడు.
‘వాళ్లు ఉత్త అమాయకపు వెధవలు. మనల్నే నమ్ముకుని మన ఇంట్లో పడి ఉంటున్నారు. ఏ పని చెప్పినా, కాదనకుండా చేస్తున్నారు. అప్పుడప్పుడు తెలివితక్కువతనంతో పిచ్చిపనులు చేస్తుండవచ్చనుకో! అంతమాత్రాన వాళ్లకు తిండిపెట్టకుండా మాడ్చిచంపడం సరైన పనికాదు. మనం కాకపోతే ఈ ప్రపంచంలో వాళ్లను పట్టించుకునే దిక్కేది? మనకే పిల్లలు ఉండి, వాళ్లే ఇలాంటి పిచ్చిపనులు చేస్తే వాళ్లను వదిలేసుకుంటామా? పాపం ఆకలితో మాడుతున్నారు. వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చెయ్యి’ అన్నాడు.
భర్త మాటలతో సుందరమ్మ కూడా ఆ పిచ్చి శిష్యులపై జాలిపడింది. నాలుగు కేకలేస్తే సరిపోయేదానికి, అనవసరంగా దుడ్డుకర్రతో బాదిపారేశానే అని బాధపడింది. వెంటనే వంటకు ఉపక్రమించింది. భోజనానికి పిలుపు రావడంతో శిష్యులు మెల్లగా లోపలకు చేరుకుని, సుందరమ్మ వడ్డించిన వంటకాలను ఆవురావురుమంటూ భోంచేశారు.
చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..