paramedical course
-
‘రీయింబర్స్మెంట్’ ఎగ్గొట్టేందుకు అడ్మిషన్లనే ఆపేశారు
సాక్షి, అమరావతి:రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు కనీసం కోర్సుల్లో చేరేందుకు కూడా అవకాశం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న వైనమిది. ఒకవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ కోర్సులు అభ్యసి స్తున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి వస్తుందని ఏకంగా పారామెడికల్ కోర్సులకు అడ్మిషన్లనే ఆపేసింది. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఎగ్గొట్టేందుకోసం ఇలా చేయడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి పారామె డికల్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ నోటిఫి కేషన్ ఇవ్వకుండా ఆపేయడం వల్ల రాష్ట్రంలో 50 వేల మందికిపైగా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా అడ్మిషన్లు జరపకుండా నిలిపేసిన ఘటన లేనే లేదు.కానీ ఏపీలోని ప్రభుత్వానికే ఇది సాధ్యమైంది. పేద విద్యార్థుల కల చెదిరింది.. రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులకు సంబంధించి ప్రభుత్వ కళాశాలల్లో 861 సీట్లు ఉండగా.. ప్రైవేటు కళాశాలల్లో 49,572 సీట్లు ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల్లో చేరేవారిలో అత్యధికులు పేద కుటుంబాలకు చెందినవారే. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందినవారు, ఇతర బీసీ వర్గాల విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. వైద్య ఆరోగ్యశాఖలో వృత్తి నైపుణ్య కోర్సులుగా పేరున్న ఈ కోర్సుల్లో చేరినట్లయితే.. కనీసం ప్రైవేటు రంగంలోనైనా త్వరగా ఉద్యోగాలొ స్తాయన్నది వారి ఆశ. అయితే వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2018–19 విద్యా సంవత్సరానికి కనీసం అడ్మిషన్లు జరపకుండా వారి జీవితాలతో ఆడుకుంది. పారామెడికల్ బోర్డుకు సెక్రటరీ లేరని, కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుగా ఉన్నాయంటూ పైకి రకరకాల కారణాలు చెబుతున్నా.. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే అడ్మిషన్లను ఆపేసినట్టు సంబంధిత అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. అడ్మిషన్లు జరగకపోవడంతో వేలాదిమంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు జరగనందున ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరింత నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అడ్మిషన్లు లేకపోవడంతో వేలాదిమంది తెలంగాణకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర విద్యార్థులకు అక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించనందున వారు మొత్తం ఫీజులు చెల్లించి చదవాల్సిన పరిస్థితి నెలకొంది. పారామెడికల్ కోర్సులకు సంబంధించి సంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్ కింద సగటున రూ.50 కోట్లు చొప్పున రెండేళ్లకు కలపి సుమారు రూ.100 కోట్లు వరకు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ ఫీజు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఏకంగా ఈ ఏడాదికి అడ్మిషన్లను ఆపేసినట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వకుండా తమ జీవితాలతో ప్రభుత్వం ఆడుకుందని వాపోతున్నారు. ప్రైవేటులోనైనా వస్తాయనుకుంటే.. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న పారామెడికల్ ఉద్యోగాలను పూర్తిగా కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోయాయి. డిప్లొమా ఇన్ అనస్థీషియా, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ వంటి 17 రకాల కోర్సులు చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలన్నిటినీ ఔట్సోర్సింగ్ పేరిట పలు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడంతో వాళ్లే అనర్హులతో పనిచేయించుకుంటున్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క పారామెడికల్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కనీసం కోర్సులు పూర్తిచేస్తే ప్రైవేటులో అయినా ఉద్యోగాలొస్తాయనుకుంటే అడ్మిషన్లు జరపరు. అంతేకాదు ప్రైవేటు కళాశాలల్లో ఎలాంటి తనిఖీలు చేయకుండా బాగాలేవని 200 కళాశాలల్లో సీట్లు ఆపేశారు. ఇది కూడా కేవలం ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆపేశారు. ఆయా కళాశాలలు కోర్టుకెళితే సర్కారు తీరును కోర్టు తీవ్రంగా మందలించింది. అయినా ఇంతవరకూ సర్కారు నుంచి స్పందన లేదు. అడ్మిషన్ కోసం ఎదురుచూసినా.. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటికీ అడ్మిషన్ రాలేదు. బయటికెళ్దామంటే ఇతర రాష్ట్రాల్లో రూ.50 వేల వరకూ ఖర్చవుతుంది. ఏం చేయాలో దిక్కుతెలియడం లేదు. –వి.రాజేష్, కృష్ణా జిల్లా డీఎంఎల్టీ కోర్సు చేద్దామని డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్‌టెక్నాలజీ కోర్సు చేద్దామనుకుంటున్నా. కానీ నోటిఫికేషన్ రాలేదు. ఇతర రాష్ట్రానికెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు తెలంగాణలో అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. –యశోద, గుంటూరు తెలంగాణలో చేరాల్సి వచ్చింది మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో చేరదామని ఎదురు చూశాను. ఇక్కడ ఐదు నెలలు దాటినా నోటిఫికేషనే రాలేదు. చేసేది లేక చివరకు డబ్బులు చెల్లించి తెలంగాణలో చేరాల్సి వచ్చింది. –సాయిప్రసాద్, ప్రొద్దుటూరు నోటిఫికేషన్ రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్ రాకపోవడంతో తెలంగాణలో రూ.50 వేలు చెల్లించి డీఎంఎల్టీలో చేరా. అదే ఇక్కడైతే మైనార్టీ కోటాలో ఫీజురీయింబర్స్‌మెంట్ వచ్చేది. కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. –షాకీర్‌బాషా, సోమయాజులపల్లి, అనంతపురం జిల్లా కళాశాలలు.. సీట్ల వివరాలు ఇలా ప్రభుత్వ కళాశాలలు 08 ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 861 ప్రైవేటు కళాశాలలు 433 ప్రైవేటు కళాశాలల్లో సీట్లు 49,572 కళాశాలల్లో కోర్సులు 17 -
త్రిశంకు స్వర్గంలో ‘పారా’ విద్యార్థులు
ఇంటర్ పారామెడికల్ కోర్సులకు అనుమతి నిరాకరణ 30 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయం కాలేజీ యాజమాన్యాల వైఖరితో ఓ ఏడాది కోల్పోయే పరిస్థితి ఇకపై ఇంటర్ తర్వాతే పారా మెడికల్ కోర్సులకు అనుమతి సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో భాగంగా పారామెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్మీడియెట్ బోర్డు, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల వైఖరి కారణంగా దాదాపు 30 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమయం అయ్యింది. వీరంతా ఇప్పుడు ఓ విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి కనీస విద్యార్హతగా ఇంటర్మీడియెట్‌ను పారామెడికల్ బోర్డు నిర్ణయించడంతో ఆ మేరకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో 65ను గత వేసవిలో విడుదల చేసింది. పారామెడికల్ కోర్సుల్లో నాణ్యత పేరుతో విద్యార్థులు కనీస విద్యార్హతగా ఇంటర్ బైపీసీ చదవాలని, బైపీసీ అభ్యర్థులు లేనిపక్షంలో ఎంపీసీ అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించాలని, వారూ లేనిపక్షంలో ఇతర గ్రూపుల్లో చదివిన వారిని ఎంపిక చేయాలని పారామెడికల్ బోర్డు నిర్ణయించింది. దీంతో పదో తరగతి అర్హతతో ఉన్న ఇంటర్‌లోని పారామెడికల్ కోర్సులు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ), మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ), ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఫిజియోథెరఫీ, డెంటల్ హైజెనీస్ట్ తదితర ఆరు వొకేషనల్ కోర్సులు రద్దు చేస్తున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఈ ఏడాది మే 22న ఒక ప్రకటన జారీ చేశారు. ఏటా 70 వేల మంది చదివే ఇంటర్ పారామెడికల్ కోర్సులు తక్షణం ఉపాధి కల్పించేవిగా నిరుపేద విద్యార్థుల ఆదరణకు నోచుకున్నాయి. కానీ వైద్య, ఆరోగ్య శాఖ ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా ఇంటర్ బోర్డు ఈ కోర్సులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు వొకేషనల్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం హైకోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది జూన్ 26న పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకోవద్దంటూ ఇంటర్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో ప్రైవేటు వొకేషనల్ జూనియ ర్ కళాశాలలు దాదాపు 30 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాయి. ఇంటర్ బోర్డు కూడా వీరందరికీ రోల్ నంబర్స్ కేటాయించింది. కానీ, ఈ కేసులో హైకోర్టు ఈ నెల 26న తుది తీర్పు వెలువరించింది. పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని సమర్థించిన న్యాయస్థానం వొకేషనల్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో ఈ కోర్సులు, ఇప్పటివరకు చేపట్టిన ప్రవేశాలు చెల్లకుండా పోనున్నాయి. అంటే ఈ ఏడాది ప్రవేశాలు పొందిన 30 వేల మంది విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇన్నేళ్లుగా ఇంటర్లో ఎంఎల్టీ తదితర పారామెడికల్ కోర్సులు చదివిన వారు ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ చేసి పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని నేరుగా ఆస్పత్రుల్లో ఉద్యోగాలు సంపాదించేవారు. విస్తృతంగా ఉన్న డయాగ్నసిస్ కేంద్రాలు, డెంటల్ ఆస్పత్రులు, కంటి ఆస్పత్రుల్లో సహాయకులుగా చిరుద్యోగాల్లో చేరేవారు. వీరికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు వేతనాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఈ కోర్సులు రద్దయితే ఇలా ఉపాధి పొందాలనుకునేవారు అటు ఇంటర్ పూర్తి చేయాలి. మళ్లీ రెండేళ్ల పాటూ ఈ పారామెడికల్ కోర్సులు చదవాలి. అతి తక్కువ ఖర్చుతో చిరుద్యోగాలు క ల్పించే ఈ కోర్సులకు ఇకపై అదనంగా వెచ్చించాల్సి రావడం పేద విద్యార్థులకు భారమే. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ తర్వాత పారా మెడికల్ కోర్సులు అందించే కళాశాలలు 304 ఉన్నాయి. ఈ కళాశాలల్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ఉన్న సీట్లు 13,137 మాత్రమే. వేలాది మంది విద్యార్థులు ఈ కోర్సులు చదివి ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో.. ఈ అరకొర సీట్లు ఏమూలకూ సరిపోవు.