సాక్షి, అమరావతి:రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ మాట దేవుడెరుగు కనీసం కోర్సుల్లో చేరేందుకు కూడా అవకాశం కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం వేలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న వైనమిది. ఒకవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సహా వివిధ కోర్సులు అభ్యసి స్తున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయని ప్రభుత్వం మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాల్సి వస్తుందని ఏకంగా పారామెడికల్ కోర్సులకు అడ్మిషన్లనే ఆపేసింది. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ఎగ్గొట్టేందుకోసం ఇలా చేయడం గమనార్హం. 2018–19 సంవత్సరానికి పారామె డికల్ కోర్సులకు సంబంధించి అడ్మిషన్ నోటిఫి కేషన్ ఇవ్వకుండా ఆపేయడం వల్ల రాష్ట్రంలో 50 వేల మందికిపైగా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ఏ రాష్ట్రంలోనూ ఇలా అడ్మిషన్లు జరపకుండా నిలిపేసిన ఘటన లేనే లేదు.కానీ ఏపీలోని ప్రభుత్వానికే ఇది సాధ్యమైంది.
పేద విద్యార్థుల కల చెదిరింది..
రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులకు సంబంధించి ప్రభుత్వ కళాశాలల్లో 861 సీట్లు ఉండగా.. ప్రైవేటు కళాశాలల్లో 49,572 సీట్లు ఉన్నాయి. సాధారణంగా ఈ కోర్సుల్లో చేరేవారిలో అత్యధికులు పేద కుటుంబాలకు చెందినవారే. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు చెందినవారు, ఇతర బీసీ వర్గాల విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. వైద్య ఆరోగ్యశాఖలో వృత్తి నైపుణ్య కోర్సులుగా పేరున్న ఈ కోర్సుల్లో చేరినట్లయితే.. కనీసం ప్రైవేటు రంగంలోనైనా త్వరగా ఉద్యోగాలొ స్తాయన్నది వారి ఆశ. అయితే వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. 2018–19 విద్యా సంవత్సరానికి కనీసం అడ్మిషన్లు జరపకుండా వారి జీవితాలతో ఆడుకుంది. పారామెడికల్ బోర్డుకు సెక్రటరీ లేరని, కొన్ని సాంకేతిక కారణాలు అడ్డుగా ఉన్నాయంటూ పైకి రకరకాల కారణాలు చెబుతున్నా.. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే అడ్మిషన్లను ఆపేసినట్టు సంబంధిత అధికార వర్గాలు చెబుతుండడం గమనార్హం. అడ్మిషన్లు జరగకపోవడంతో వేలాదిమంది అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు జరగనందున ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మరింత నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో అడ్మిషన్లు లేకపోవడంతో వేలాదిమంది తెలంగాణకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్ర విద్యార్థులకు అక్కడ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించనందున వారు మొత్తం ఫీజులు చెల్లించి చదవాల్సిన పరిస్థితి నెలకొంది. పారామెడికల్ కోర్సులకు సంబంధించి సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సగటున రూ.50 కోట్లు చొప్పున రెండేళ్లకు కలపి సుమారు రూ.100 కోట్లు వరకు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ ఫీజు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఏకంగా ఈ ఏడాదికి అడ్మిషన్లను ఆపేసినట్టు అధికార వర్గాలే చెబుతున్నాయి. దీనిపై విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇవ్వకుండా తమ జీవితాలతో ప్రభుత్వం ఆడుకుందని వాపోతున్నారు.
ప్రైవేటులోనైనా వస్తాయనుకుంటే..
ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న పారామెడికల్ ఉద్యోగాలను పూర్తిగా కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోయాయి. డిప్లొమా ఇన్ అనస్థీషియా, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ వంటి 17 రకాల కోర్సులు చేసిన అభ్యర్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలన్నిటినీ ఔట్‌సోర్సింగ్ పేరిట పలు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడంతో వాళ్లే అనర్హులతో పనిచేయించుకుంటున్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క పారామెడికల్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కనీసం కోర్సులు పూర్తిచేస్తే ప్రైవేటులో అయినా ఉద్యోగాలొస్తాయనుకుంటే అడ్మిషన్లు జరపరు. అంతేకాదు ప్రైవేటు కళాశాలల్లో ఎలాంటి తనిఖీలు చేయకుండా బాగాలేవని 200 కళాశాలల్లో సీట్లు ఆపేశారు. ఇది కూడా కేవలం ఫీజు రీయింబర్స్‌మెంటు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆపేశారు. ఆయా కళాశాలలు కోర్టుకెళితే సర్కారు తీరును కోర్టు తీవ్రంగా మందలించింది. అయినా ఇంతవరకూ సర్కారు నుంచి స్పందన లేదు.
అడ్మిషన్ కోసం ఎదురుచూసినా..
డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు ఎదురుచూస్తున్నా. ఇప్పటికీ అడ్మిషన్ రాలేదు. బయటికెళ్దామంటే ఇతర రాష్ట్రాల్లో రూ.50 వేల వరకూ ఖర్చవుతుంది. ఏం చేయాలో దిక్కుతెలియడం లేదు.
–వి.రాజేష్, కృష్ణా జిల్లా
డీఎంఎల్‌టీ కోర్సు చేద్దామని
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్‌టెక్నాలజీ కోర్సు చేద్దామనుకుంటున్నా. కానీ నోటిఫికేషన్ రాలేదు. ఇతర రాష్ట్రానికెళ్లే పరిస్థితి లేదు. మరోవైపు తెలంగాణలో అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
–యశోద, గుంటూరు
తెలంగాణలో చేరాల్సి వచ్చింది
మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో చేరదామని ఎదురు చూశాను. ఇక్కడ ఐదు నెలలు దాటినా నోటిఫికేషనే రాలేదు. చేసేది లేక చివరకు డబ్బులు చెల్లించి తెలంగాణలో చేరాల్సి వచ్చింది.
–సాయిప్రసాద్, ప్రొద్దుటూరు
నోటిఫికేషన్ రాకపోవడంతో
ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్ రాకపోవడంతో తెలంగాణలో రూ.50 వేలు చెల్లించి డీఎంఎల్‌టీలో చేరా. అదే ఇక్కడైతే మైనార్టీ కోటాలో ఫీజురీయింబర్స్‌మెంట్ వచ్చేది. కానీ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
–షాకీర్‌బాషా, సోమయాజులపల్లి, అనంతపురం జిల్లా
కళాశాలలు.. సీట్ల వివరాలు ఇలా
ప్రభుత్వ కళాశాలలు 08
ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు 861
ప్రైవేటు కళాశాలలు 433
ప్రైవేటు కళాశాలల్లో సీట్లు 49,572
కళాశాలల్లో కోర్సులు 17
Comments
Please login to add a commentAdd a comment