వైద్య అక్రమ బదిలీలపై విచారణ
కమిషనర్‌ను ఆదేశించిన ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా
సాక్షి, హైదరాబాద్: వైద్య, పారామెడికల్ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నా సరెండర్ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడంపై వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా విచారణకు ఆదేశించారు. ‘వైద్యశాఖలో అక్రమ బదిలీలు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు.
దీనిపై విచారణ చేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోతిబుద్ధప్రకాశ్‌ను ఆదేశించినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. ఈ జోన్ పరిధిలో దాదాపు 150 మందిని సరెండర్ చేయించి, వారి నుంచి డబ్బులు తీసుకొని ఇష్టమైన చోటుకు బదిలీలు చేశారు. అలాగే నల్లగొండ జిల్లాలో 50 మందిని అక్రమంగా డిప్యుటేషన్‌పై పంపారు. ఈ విషయంలో లక్షల రూపాయలు చేతులు మారాయి.