సంక్రాంతికే రిలీజ్!
సినిమా ప్రారంభించిన నాడే విడుదల తేదీని ప్రకటించడం పూరీ జగన్నాథ్ స్టయిల్. ఎన్టీఆర్ హీరోగా, తాజాగా ఆయన రూపొందిస్తున్న చిత్రానికి కూడా అదే చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తామని ప్రకటించారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఇటీవలే పూరీ ముచ్చటగా కట్టించుకున్న నూతన కార్యాలయం ‘కేవ్’లో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఉదయం 7.44 నిమిషాలకు దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పూరీ జగన్నాథ్ కెమెరా స్విచాన్ చేయగా, ఎన్టీఆర్ క్లాప్ ఇచ్చారు.
ఈ సందర్భంగా బండ్ల గణేశ్ మాట్లాడుతూ - ‘‘ఎన్టీఆర్‌తో ‘బాద్షా’ తర్వాత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. అలాగే, మా సంస్థలో పూరీకి కూడా ఇది రెండో సినిమా. ఓ విభిన్న తరహాలో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్. ఇప్పట్నుంచీ నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం. ఎన్టీఆర్, పూరి, మా సంస్థకు ప్రతిష్టాత్మకంగా నిలిచే చిత్రం అవుతుంది’’ అని చెప్పారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని, రమాప్రభ, కోవై సరళ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సమర్పణ: శివబాబు బండ్ల.