బాల మగధీర మృతి.. రామ్చరణ్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: అతి పిన్న వయసులోనే అదిరిపోయే డైలాగ్లు చెప్పడమే కాకుండా చక్కటి హావభావాలతో ఆశ్చర్యపరిచి తనను అమితంగా ఆకర్షించిన తన బాల అభిమాని పరశురామ్ మృతిపట్ల ప్రముఖ హీరో రామ్చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరశురాం లేని లోటును ఎలా చెప్పాలో కూడా తనకు మాటలు రావడం లేదన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో ఆ కుటుంబానికి పూర్తి ప్రేమ అందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోదరుడు పరుశురామ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఫేస్బుక్లో తన సంతాపాన్ని తెలియజేశారు.
మహబూబ్ నగర్లోని అయిజ మండలానికి చెందిన పరశురామ్ చిన్న వయసులోనే గొప్ప కళాకారుడిగా కనిపించాడు. ‘మగధీర’ సినిమాలోని డైలాగ్లను అలవోకగా చెబుతూ ఆశ్చర్యపరిచేశాడు. అతడు చెప్పిన డైలాగ్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి భారీ పాపులారిటీని సంపాధించుకున్నాయి. అతడికి ముచ్చటపడి రామ్చరణ్ స్వయంగా తన ఇంటికి పిలిపించుకుని సరదాగా కాసేపు ముచ్చటించారు. అతడికి కానుకలు కూడా ఇచ్చారు. అంతేకాకుండా పరశురాం విద్యాబాధ్యతలు కూడా తానే చూసుకుంటానని తెలిపారు. అయితే, ఇటీవల కామెర్ల వ్యాధికి గురైన పరశురామ్ అనూహ్యంగా కన్నుమూశాడు. దీంతో అతడి కుటుంబం దుఃఖసాగరంలో మునిగింది.