పరేల్ స్టేషన్లో పరేషాన్‌లెన్నో..
సాక్షి, ముంబై: నగరంలో మెట్రో, మోనో రైళ్ల లాంటి సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ సెంట్రల్ రైల్వే మార్గంలోని పరేల్ స్టేషన్లో రద్దీ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ స్టేషన్లో రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ ప్రయాణికులకు తలనొప్పిగా మారుతోంది. ఇరుకైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ), రెండు రైళ్లు ఒకేసారి వస్తే ఎటూ సరిపోని ప్లాట్‌ఫారంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరం, శివారు ప్రాంతాల్లో సెంట్రల్, పశ్చిమ రైల్వే మార్గాలు కేవలం దాదర్, పరేల్, ఎల్ఫిన్‌స్టన్‌రోడ్ స్టేషన్లోనే కలుస్తాయి.
వర్సోవా-అంధేరీ- ఘాట్కోపర్‌ల మధ్య మెట్రో రైలు సేవలు ప్రారంభం కావడంతో దాదర్ స్టేషన్‌పై సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ప్రయాణికుల భారం తగ్గిపోయింది. కాని పరేల్-పశ్చిమ మార్గంలోని ఎల్ఫిన్స్టన్ రోడ్ స్టేషన్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. పరేల్ స్టేషన్ పరిసరాల్లో కళాశాలలు, కేం, వాడియా, టాటా క్యాన్సర్, గాంధీ తదితర ఆస్పత్రులున్నాయి. అదేవిధంగా ఎల్ఫిన్స్టన్ రోడ్ స్టేషన్ పరిసరాల్లో అనేక వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు, బిగ్ బజార్, షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. దీంతో ఈ రెండు స్టేషన్లు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆస్పత్రులకు వెళ్లే రోగుల బంధువులు, పనులకు వెళ్లే ఉద్యోగుల రాకపోకలతో కిటకిటలాడుతుంటాయి. అయితే పరేల్‌లో ఇరుకైన ఎఫ్ఓబీతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రెండు రైళ్లు ఒకేసారి వస్తే ప్లాట్‌ఫారంపై ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు. స్టేషన్ బయటకు వెళ్లడానికి భారీ కసరత్తు చేయాల్సిందే. తోపులాటల్లో స్త్రీలు, పురుషులనే తేడా లేకుండా పోతోంది. ఇరుకైన ఎఫ్ఓబీ కారణంగా బయటకు రావాలంటే కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. రద్దీని నియంత్రించేందుకు అక్కడ ప్రత్యేకంగా పోలీసులను నియమించారు. పరేల్ స్టేషన్లో కేవలం రెండు ఎఫ్‌ఓబీలు ఉన్నాయి. అందులో ఒకటి (దాదర్ దిశలో ఉన్నది) సౌకర్యవంతంగా లేకపోవడంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఇటీవల నిర్మించినప్పటికీ అది నిరుపయోగంగా మారింది.
దీంతో పరేల్-ఎల్ఫిన్స్టన్ స్టేషన్లను కలిపే ఎఫ్‌ఓబీపైనే మొత్తం భారం పడుతోంది. ఈ బెడద నుంచి తప్పుకునేందుకు కొందరు దాదర్‌లోనే రైలు మారుతున్నారు.పరేల్‌లో ప్లాట్ఫారం మధ్యలో ఓ ఎఫ్ఓబీ నిర్మించి దీన్ని పరేల్- ఎల్ఫిన్‌స్టన్‌లను కలిపే పాత వంతెనతో కలిపితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. కాని రైల్వే పరిపాలన విభాగం దీన్ని పట్టించుకోవడం లేదు. మెట్రో, మోనో లాంటి ఆధునిక సేవలు ఎన్ని వచ్చినా పరేల్ స్టేషన్లో ప్రయాణికులకు తలనొప్పులు మాత్రం తప్పవని తెలుస్తోంది.