టీచర్లతో మాట్లాడేందుకూ ఓ యాప్!
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మధ్య తక్షణ సమాచారం అందుబాటులో ఉండేందుకు ఓ కొత్త యాప్‌ను కనుగొన్నారు. విద్యావిధానంలో సమాచార వ్యవస్థను సులభం చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ ఐఐటీలో చదివిన రితేష్ సింగ్, అక్షత్ గోయల్.. ఓ మొబైల్ యాప్‌ను రూపొందించారు. బీహార్‌లోని పలు పాఠశాలల్లో దీన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. 2015 జూన్‌లో లాంచ్ చేసిన 'ఎకోవేషన్ యాప్' రెండు నెలల్లోనే సుమారు 30 వేల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమాచార మార్గాన్ని సుగమం చేసింది.
'ఎకోవేషన్ యాప్' ను తయారు చేసేందుకు రూ. 7 లక్షలు ఖర్చుచేసిన వీరిద్దరూ.. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు పేరెంట్ - టీచర్ మీటింగ్స్‌లో మాత్రమే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి తెలుసుకోగలిగేవారు. స్కూలుకు దూరంగా ఉండేవాళ్లకు ఇలాంటి అవకాశం దాదాపు ఉండేదికాదు. ఇలాంటి ఇబ్బందిని తొలగించేందుకు రితేష్, అక్షయ్ రూపొందించిన యాప్ బాగా ఉపయోగపడింది.
చదువురాని తల్లిదండ్రులకు కూడా ఈ యాప్ ఉపయోగకరంగా ఉంది. వచ్చిన మెసేజ్‌ను చదవడం రాకపోయినా ఆడియో, వీడియో ద్వారా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అలాగే పాఠశాలలో విద్యార్థుల కార్యాచరణపై ఎప్పటికప్పుడు టీచర్లు ఆడియో, వీడియో ద్వారా సమాచారం అందించే అవకాశాన్ని ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉన్న ఈ 'ఎకోవేషన్' యాప్‌ను ప్రస్తుతం బీహార్‌లోని వివిధ పాఠశాలల్లో వినియోగిస్తున్నారు. ఈ యాప్‌ను ముందుగా రెండు పాఠశాలల్లో ప్రారంభించారు. తర్వాత ఇది విస్తృతంగా బీహార్ రాష్ట్రమంతా వ్యాపించింది. పూర్తి ఉచితంగా ఉపయోగించగలిగే ఈ యాప్‌ను ఎక్కడైనా సరే వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.