నారాయణ..నారాయణ.!
♦ నారాయణ కళాశాలలో
♦ విద్యార్థులను చితకబాదిన వైనం
♦ విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన
చింతకొమ్మదిన్నె :
నారాయణ విద్యా సంస్థల్లో రోజురోజుకు విద్యార్థుల పట్ల దండన తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. వారి దండన ఫైబర్ లాఠీలతో మొదలై విద్యార్థుల చేతులు విరిగే స్థాయికి చేరుకుంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివారం వెలుగు చూసింది. తల్లిదండ్రులు, విద్యార్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
చింతకొమ్మదిన్నె మండలం కడప–పులివెందుల రహదారిలో కృష్ణాపురంలోని కేఎస్ఆర్ఎం కళాశాల ఎదురుగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి విడివిడిగా బాలురు, బాలికల హాస్టళ్లు ఉన్నాయి. అక్కడే విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రగుంట్లకు చెందిన కృష్ణారెడ్డి కుమారుడు త్రినేత్రకుమార్రెడ్డితోపాటు సుమంత్ కుమార్రెడ్డి, మల్లికార్జునరెడ్డిలు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో చదువుతున్నారు. గత శుక్రవారం అనవసరంగా మాట్లాడుతున్నారని వీరిపై జూనియర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారనే నెపంతో ఓ అధ్యాపకుడు, డీజీఎం రామ్మోహన్రెడ్డిలు వీరిని కార్యాలయంలోకి పిలిచి ఒకసారి, మరోసారి విద్యార్థులందరి ముందు తమ దగ్గరున్న ఫైబర్ లాఠీలతో చితకబాదారు. ఈ సంఘటనలో త్రినేత్రకుమార్రెడ్డి ఎడమ చేయి కాస్త విరిగింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో త్రినేత్రకుమార్రెడ్డి చికిత్స చేయించి కట్టు కట్టించారు. అంతేగాకుండా సుమంత్కుమార్రెడ్డి, మల్లికార్జునరెడ్డిల చేతులు, కాళ్లకు తీవ్ర స్థాయిలో వాతలు పడ్డాయి.
ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం రోజు వారి పిల్లలను చూసేందుకు వచ్చిన సమయంలో బయటపడింది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో అధ్యాపకులను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే సంబంధిత అధ్యాపకులు కనీసం సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించేందుకు కూడా ముందుకు రాలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను పోలీసుల మాదిరిగా ఫైబర్ లాఠీలతో కొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సంబంధిత అధ్యాపకులపై, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల ఆవరణంలో ఆందోళన చేశారు. ఆందోళన సమయంలో హుటాహుటిన అక్కడికి వచ్చిన ఎస్ఐ హేమకుమార్, తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. బాధ్యులపై ఫిర్యాదు చేయాలని కేసు నమోదు చేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కనుమరుగైన మనీష, నందినిల అనుమానాస్పద మృతి కేసు
చింతకొమ్మదిన్నె పోలీసు స్టేషన్ పరిధిలోనే ఇదే క్యాంపస్లో 2015 ఆగస్టు 16వ తేదీన జూనియర్ ఇంటర్ విద్యార్థులు నందిని, మనీషాలు తమ హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీబీసీఐడీతోపాటు మానవ హక్కుల కమిషన్, ఇతర అధికారులు హడావుడి చేసి అప్పట్లో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఆ కేసు వ్యవహారం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. మొత్తానికి నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరుగుతున్న దాష్టీకంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.