ఏఈఎస్ జనక్‌పురిలో ఘనంగా పేరెంట్స్‌డే వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర విద్యాసంఘం (ఏఈఎస్) ఎన్టీ రామారావు సీనియర్ సెకండరీ పాఠశాల ప్రాథమిక విద్యార్థుల పేరెంట్స్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. చిన్నారులు, వారి తల్లిదండ్రులేగాక వారి తల్లిదండ్రులూ ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలను సత్కరించడం ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అచ్చతెలుగు నుంచి హాలీవుడ్ వరకు విభిన్న భాషల పాటలకు పిల్లలు ఆడిపాడిన తీరు అందరినీ అలరించింది. తమ చిన్నారుల ఆటపాటలను చూపి పెద్దలు మురిసిపోగా, తమ పెద్దలకు జరుగుతున్న సత్కారాన్ని పిల్లలు ఆసక్తిగా తిలకించారు.
పిల్లలలో దాగిన ప్రతిభను వెలికితీసే ఉద్దేశం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ అనిత స్వాగతోపన్యాసంలో చె ప్పారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఈఎస్ కార్యదర్శి ఈశ్వరప్రసాద్ మాట్లాడుతూ పట్టుదల, దీక్షతో ప్రయత్నిస్తే సాధించలేనిది లేదని పిల్లలకు హితవు చెప్పారు. చిన్నారుల అభ్యున్నతిలో తల్లిదండ్రుల సహకారం కీలకమైనదని చెబుతూ, ఆయన ఈ మేరకు కృషి చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. పేరెం ట్స్డేను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం గ్రాం డ్ పేరెంట్స్‌ను సత్కరిస్తున్నట్లు పాఠశాల మేనేజర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రదర్శించిన ‘ఓం నమో గణేశా’ కూచి పూడి నృత్యం, లుంగీడ్యాన్స్ పాటకు చిన్నారులు ఉత్సాహంగా ప్రదర్శించిన నృత్యాలు, ‘రఘుపతి రాఘవ రాజారామ్’ గీతానికి దేశభక్తిని ప్రదర్శిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.