అవరోధాలు ఆమెకు అడ్డుకాలేదు
బ్రహ్మ తనకు తోచినట్టుగా అందరి తలరాత రాస్తాడు. ఆ రాతను మనకు నచ్చినట్టుగా రాసుకోవడమే అసలైన సంకల్పం. ఎదురైన అవరోధాలను సంకల్ప బలంతో అధిగమిస్తూ.. ముందుకుసాగిన వారినే విజయం వరిస్తుంది. అయితే విధిని ధిక్కరించి నిలబడితే గెలుపు తప్పక వరిస్తుందని మరో సారి రుజువు చేసింది మధ్యప్రదేశ్‌కు చెందిన ‘పరిధి వర్మ’. ఐదేళ్ల వయసులోనే కంటి చూపును కోల్పోయినా ఎంతో సాహసంగా ముందుకు సాగింది. గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో సీటు సంపాదించి రికార్డు సృష్టించింది. తాజాగా మైక్రో ఫైనాన్స్ బ్యాంకులో ఉద్యోగం సాధించి టాప్ బిజినెస్ స్కూల్ నుంచి అత్యంత పిన్న వయసులో ఉద్యోగం పొందిన ఘనతను సొంతం చేసుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన పరిధి వర్మ గురించి మరిన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం!
అది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ప్రాంతంలో ఓ చిన్న గ్రామం. ఊళ్లో చుట్టు పక్కలవాళ్లు అంతా కలిసి రంగులు చల్లుకుంటున్నారు. వీధంతా కోలాహలంగా ఉంది. అందరూ హోలీ సంబరాల్లో మునిగిపోయారు. ఆ సందడి చూస్తున్న ఐదేళ్ల పరిధి వర్మ ఇంట్లో ఉండలేకపోయింది. రంగు నీళ్లతో బయటకు పరుగెత్తింది. వీధిలో ఆడుకుంటుండగా.. పరిధిపై రంగులు చల్లారు. రంగులు కాస్త ఆమె కళ్లలో పడటంతో ఆమెకు తీవ్రమైన మంట రావడంతో ఏడ్చేసింది. వెంటనే పరిధి అమ్మనాన్నలు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కళ్లద్దాలు వాడమన్నారు. కానీ లాభం లేకపోయింది.
అది అరుదైన వ్యాధి..
ప్రతి రోజు కంటిలో మంట రావడంతోపాటు ఆమె చూపు కూడా రానురాను మందగిస్తూ వచ్చింది. వైద్యులు ఎన్నో పరీక్షలు చేశారు. అయితే చివరికి అది మాక్యులర్ డిజనరేషన్ (మచ్చల క్షీణత) అనే అరుదైన వ్యాధి అని వైద్యులు నిర్ధారించారు. క్రమంగా చూపుకోల్పోవటమే ఈ వ్యాధి లక్షణం. కొద్ది కాలానికి పరిధి వర్మ 90 శాతం చూపు కోల్పోయింది. ఈ వ్యాధి చాలా అరుదుగా వచ్చే వ్యాధి అని...ఇది ప్రతి ఏడులక్షల మందిలో ఒకరికి వస్తుందని వైద్యులు చెప్పడంతో అమ్మానాన్నల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక్కగానొక్క కూతురికి ఇలా అయిందేంటని నిద్రలేని రాత్రులు గడిపారు. ఇక ఆమె భవిష్యత్ అంధకారమేనా అని ఆవేదన చెందారు. కానీ పరిధి వర్మ తల్లిదండ్రులకే ధైర్యం చెప్పింది. ఆమె మనోసంకల్పం ముందు విధిరాత చిన్నబోయింది. చూపు రాదని తెలిసినా.. పరిధి వర్మ ఏ రోజు అధైర్యపడలేదు. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ప్రతి అవరోధాన్ని దాటుతూ ఈరోజు విజేతగా నిలిచింది.
అందరి ప్రోత్సాహంతో..
కంటి చూపు లేకపోవడంతో ఇతరులపై ఆధారపడటం పరిధికి మొదట్లో ఎంతో ఇబ్బందిగా అనిపించినా స్నేహితుల ప్రోత్సాహం ఆమెకు లభించడంతో ముందడుగు వేసింది. స్నేహితుల సహాయంతో ప్రతి రోజు చదవడం, రాయడం చిన్ననాటి నుంచే పరిధికి అలవాటుగా మారింది. ఎంతో కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అయినా..ఆమె స్వయంగా రాయలేకపోయేది. దీంతో ఆమెకు సహాయంగా వేరేవాళ్లు రాసేవారు. కాని ఆమె అనుకున్నది వారు చెప్పినా రాయలేకపోవడంతో అనేక మార్లు పరిధి మార్కులు తగ్గిపోయాయి. ప్రతి పనిలో స్నేహితులు, సీనియర్లు ఆమెకు తోడుగా నిలిచారు.
అతి పిన్న వయసులోనే..!
అడ్డంకుల్ని దాటుతూ.. ఐసీజీ జైపూర్ నుంచి బీబీఏ చేసింది. మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా పూర్తి చేసింది. సివిల్స్‌కు సన్నద్ధం కావాలని భావించింది. కానీ స్నేహితులు, శ్రేయోభిలాషుల సలహాతో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (క్యాట్)కు ప్రిపేర్ అయ్యింది. క్యాట్‌లో ర్యాంక్ సాధించడంతో ఐఐఎమ్–లఖ్నవులో ప్రవేశం లభించింది. తర్వాత ఐఐఎం లక్నోలో సీటు సంపాదించింది. ఫైనల్ ఇయర్లో ఉండగానే క్యాంపస్ సెలెక్షన్ జరిగింది. ఒక పేరున్న మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ పరిధి వర్మను సెలెక్ట్ చేసింది. కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్‌గా ఆమెకు ఆఫర్ ఇచ్చింది. టాప్ బిజినెస్ స్కూల్ నుంచి అత్యంత పిన్న వయసులో పేరున్న సంస్థలో ఉద్యోగ అవకాశం సంపాదించిన ఘనత సొంతం చేసుకుంది.
ఆటపాటల్లోనూ..
చదువు ఒక్కటే కాదు. చూపు లేకపోయినా ఆటపాటల్లోనూ పరిధి వర్మ ముందుంది. ఇటీవల అండర్ 18 ఫుట్ బాల్ జట్టులో ఆడుతూ చాంపియన్‌గా నిలిచింది. కాలేజీలో చదువుతున్న సమయంలో గిటార్ వాయించడం కూడా నేర్చుకుంది. ఇటీవల డాటర్స్ డే రోజున నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్ధి చేతుల మీదుగా ఆమె ప్రత్యేక అభినందన అవార్డు అందుకుంది. 2015లో రాజస్థాన్ ప్రభుత్వం ఆమెకు ‘విమెన్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు’ అందజేసింది.
- సాక్షి, స్కూల్ ఎడిషన్