అమ్మో ‘హా’సుపత్రి..!
పరిగి, న్యూస్‌లైన్: పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు కరువయ్యాయి. 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో కనీసం పగలు కూడా ప్రజలకు చికిత్స అందడం లేదు. శనివారం ఉదయం 11 గంటలు దాటినా వైద్యులు ఆస్పత్రికి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం నలుగురు అసిస్టెంట్ సివిల్ సర్జన్లు, ఇద్దరు సాధారణ వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు కాంట్రాక్టు వైద్యులు, ఒక డెంటల్ వైద్యుడు ఉన్నారు. అయితే వారు కూడా వెసులుబాటుని బట్టి రెండు రోజుల చొప్పున డ్యూటీలు చేస్తున్నారు. ఇలా మొత్తం నెలలో ఒక్కొక్కరు 10 రోజులు విధులకు హాజరవుతారు. కాగా శనివారం డ్యూటీ తనది కాదంటే తనది కాదంటూ ఎవరూ విధులకు హాజరుకాలేదు.
రోజంతా విధులకు హాజరుకాని వైద్యులు
పరిగి ఆస్పత్రికి ఉదయం 6-00 గంటల నుంచే రోగుల రాక ప్రారంభమైంది. అందులో ఆత్మహత్యాయత్నం, వడదెబ్బ, డెలవరీ వంటి సీరియస్ కేసులు కూడా ఉన్నాయి. ఉదయం 11 గంటల వరకు ఓపీ హాల్లో మొత్తం 200 మందికిపైగా రోగులు వైద్యుల గురించి వేచి చూస్తున్నారు. గంటల తరబడి వేచిచూసినా వైద్యులు రాకపోవడంతో రోగులు ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది వైద్యులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చినా తమ డ్యూటీ కాదంటూ వైద్యుడు విధులకు రాలేదు.
అందులో ఓ వైద్యుడు పరిగిలోనే తన ప్రైవేటు క్లీనిక్‌లోనే ఉన్నప్పటికీ విధులకు రానంటూ ఖరాకండిగా చెప్పేశాడు. శనివారం సంత కావడంతో ప్రైవుటు క్లీనిక్‌కు రోగులు అధిక సంఖ్యలో తరలివస్తారనే ఇలా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో రోగులు పరిగి సీహెచ్ఎన్సీ ఎస్పీహెచ్ఓ డాక్టర్ దశరథ్కు ఫిర్యాదు చేశారు. చివరకు ఆయనే వచ్చి ఫోన్ చేసినా వైద్యులెవరు స్పందించలేదు. దీంతో తనకున్న ఫీల్డ్ విజిట్లు రద్దు చేసుకుని స్వయంగా ఎస్పీహెచ్ఓ ఓపీలో కూర్చొని రోగులకు వైద్యం చేశాడు.