మలిదశ పరిషత్తుపోరు నేడే
గుంటూరు, గురజాల డివిజన్లలో పోలింగ్
ఓటర్ల సంఖ్య 11,30,634, పోలిగ్ స్టేషన్లు 1,470
పతాక స్థాయికి చేరిన టీడీపీ ప్రలోభాల పర్వం
‘సంగం’ ఉద్యోగులతో ఓటుకు నోటు పంపకాలు
సాక్షి, గుంటూరు : జిల్లాలో మలిదశ పరిషత్తు పోరు శుక్రవారం జరగనుంది. ఈ దశలో గుంటూరు, గురజాల డివిజన్ల పరిధిలోని 28 మండలాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళగిరి, తాడికొండ, పొన్నూరు, ప్రత్తిపాడు, సత్తెనపల్లి, మాచర్ల, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లోని 28 జడ్పీటీసీ స్థానాలకు 105 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
443 ఎంపీటీసీ స్థానాలుండగా, 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 432స్థానాలకు 1,182 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎన్నికల జరిగే రెండు డివిజన్లలో మొత్తం 696 చోట్ల 1,470 పోలింగ్ స్టేషన్లున్నాయి.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 71 చోట్ల 136 పోలింగ్ స్టేషన్లు, 715 అత్యంత సమస్యాత్మక, 417 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్ని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. 202 సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు డివిజన్‌కు 2,041, గురజాల డివిజన్‌కు 983 బ్యాలెట్ బాక్సులు కేటాయించారు. 119 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, 175 కేంద్రాలకు వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేశారు. 304 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు.
మలిదశలోనూ మహిళలే కీలకం..
రెండు డివిజన్లలో జరిగే ఎన్నికల్లో 11,30,634 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓట్లు 5,58,979 మంది కాగా, మహిళా ఓట్లు 5,71,657 ఉన్నాయి. రెండు డివిజన్లలోనూ మహిళా ఓట్లే కీలకం కానున్నాయి. గుంటూరు డివిజన్లో పురుష ఓటర్లు 3,76,457 మంది కాగా, మహిళా ఓటర్లు 3,86,098 మంది ఉన్నారు. గురజాల డివిజన్‌లోనూ పురుష ఓటర్లు 1,82,522 మంది కాగా, మహిళా ఓటర్లు 1,85,559 మంది ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాజకీయ పార్టీలు మహిళా ఓట్ల కోసం ప్రచారంలో నానా పాట్లు పడ్డాయి.
అధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ పోటీ
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల్ని పోటీలో నిలపలేదు. 16 జడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంది. ఈ స్థానాల్లో టీడీపీకి బహిరంగంగానే మద్దతు పలికింది. 28 జడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 27 స్థానాల్లోనూ, తాడేపల్లిలో సీపీఎంకు మద్దతిచ్చి బరిలో నిలిపింది. తాడేపల్లిలో కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మద్దతిచ్చినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కమల ప్రకటించడం గమనార్హం.
సైకిల్ గుర్తుతో నోట్ల పంపిణీ..
మరికొద్ది గంటల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతుండటంతో టీడీపీ పతాక స్థాయిలో ప్రలోభాలు కొనసాగించింది. గురువారం వేకువజామున పెదకాకానిలో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సంగం డెయిరీ ఉద్యోగులతో డబ్బు పంపిణీ చేయించారు. ఏకంగా రూ.500 నోట్లపై సైకిల్ బొమ్మ ముద్రించి మరీ ఓటర్లకు పంపిణీ చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సంగం ఉద్యోగులనుపోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేంద్ర సంగం డెయిరీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
మంగళగిరి నియోజకవర్గంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసి టీడీపీ శ్రేణులు పట్టుబడ్డాయి. పోలింగ్ రోజున వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలిదశలోనూ టీడీపీ నేతలకు పోలీసులు సహకారం అందించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. రొంపిచర్ల, నకరికల్లు మండలాల్లో మహిళలపై కూడా దాడులకు దిగడం తెలిసిందే.