పరిశుభ్రతకు పంచ సూత్రాలు
కాకినాడ సిటీ :
పరిశుభ్రమైన పరిసరాలను, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు జిల్లాలో అన్ని గ్రామాల్లో పంచసూత్ర కార్యాచరణ అమలు పర్చాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ఎంపీడీఓలను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి మండలస్థాయి వీడియో కాన్ఫరెనుస నిర్వహించి స్వచ్ఛభారత్, ఉపాధి హామీ కార్యక్రమాల కింద గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధన, ఉపాధి హామీ పథకం కింద కూలీ లకు పనుల కల్పన, పనుల తనిఖీ, పంట కుంటల తవ్వకం తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ముమ్మరం చేస్తూ అన్ని గ్రామాల్లో పరిశుభ్రత పంచ సూత్ర కార్యాచరణ పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో ప్రతి గ్రామాన్ని సత్వరం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దడాన్ని తొలి అంశంగా చేపట్టాలన్నారు. రెండో అంశంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డ్ ఏర్పాటు చేసి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టాలన్నారు. మూడో అంశంగా గ్రామాల్లో మురుగునీరు నిలిచి ఉండే పల్లపు ప్రదేశాలను మెరక చేయడం, సీసీ డ్రెయినులు లేని చోట్ల కచ్చా డ్రెయినులను తవ్వి కమ్యూనిటీ సోక్పిట్లకు మురుగును తరలించడం చేయాలని సూచించారు. నాలుగో అంశంగా గ్రామాల్లో కొబ్బరి బొండాలు, మొక్కజొన్న పొత్తులు, ఇతర తినుబండారాలు విక్రయించే చిరు వ్యాపారులు, టీ బడ్డీలు, కాఫీ హోటళ్ళ వర్తకులు తమ వ్యాపార వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వదలకుండా క్రమశిక్షణతో మెలిగేలా అవగాహన కల్పించి తప్పనిసరిగా పాటించేట్టు నియంత్రించాలన్నారు. ఐదో అంశంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, డ్వాక్రా మహిళలు, యువజన సంఘాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత పట్ల ప్రజలందరిలో చైతన్యం, ఆచరణలను జాగృతం చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.