పరిటాల అనుచరుడి వీరంగం
అనంతపురం సెంట్రల్ : పరిటాల అనుచరులు వీరంగం చేశారు. బైక్‌పై వెళుతున్న యువకుడిని మరో బైక్‌తో ఢీకొట్టి... బురదగంటలో అరగంటపాటు ఏకధాటిగా చితకబాదారు. వివరాలిలా ఉన్నాయి. యల్లనూరు మండల కేంద్రానికి చెందిన చిన్న ఓబిలేసు అనే యువకుడు రాప్తాడు మండలం బండమీదపల్లిలో శుక్రవారం మొహర్రం వేడుకలు ముగించుకుని బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరాడు. పండమేరు వంక వద్దకు రాగానే అక్కడ కాపుకాచిన మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసే నగేష్‌చౌదరి కొంతమంది అనుచరులతో అటకాయించారు. వేగంగా ఒక బైక్‌తో ఢీకొట్టించడంతో ఓబులేసు పది అడుగుల గుంతలోకి బైక్‌తో సహా కిందపడ్డాడు.
అప్పటికీ వదలకుండా బురదగుంటలో పడేసికొట్టారు. అడ్డొచ్చిన వ్యక్తులపై ‘తాను పరిటాల శ్రీరామ్ వ్యక్తిని.. వెల్లిపోండి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అరగంటపాటు అటువైపు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. నగేష్‌చౌదరికి చెన్నేకొత్తపల్లిలో వివాహం నిశ్చయమైంది. ఈ విషయంలో ఓబులేసుతో మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. ఇది మనసులో పెట్టుకునే ఇలా చేశాడని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాడిలో గాయపడిన ఓబులేసును అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. నిందితుడిని తొలుత ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు రాప్తాడు పోలీసులు ధ్రువీకరించలేదు.