పరి 'వార్'
మోదీ, షా నాయకత్వంపై అద్వానీ సహా సీనియర్ల తిరుగుబాటు బావుటా
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికార బీజేపీలో అంతర్గతంగా కల్లోలం రేపుతున్నాయి. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాల నాయకత్వంపై.. పార్టీ కురువృద్ధులైన ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్జోషి, సీనియర్ నేతలు శాంతకుమార్, యశ్వంత్‌సిన్హాలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
ఏడాది కాలంగా పార్టీని నిర్వీర్యం చేసిన తీరే బిహార్‌లో ఓటమికి ప్రధాన కారణమని ధ్వజమెత్తారు. ఈ ఓటమికి కారణాలపైనా.. పిడికెడు మంది ముందు పార్టీ సాగిలపడేలా నిర్బంధ పరిస్థితి పైనా.. ఏకాభిప్రాయ స్వభావాన్ని ఎలా ధ్వంసం చేశారన్న దానిపైనా.. సమగ్రమైన సమీక్ష జరిగి తీరాలని ఉద్ఘాటించారు.ఢిల్లీలో ఘోరపరాజయం నుంచి ఏ పాఠమూ నేర్చుకోలేదని బిహార్ ఎన్నికల ఫలితాలు చూపుతున్నాయని విమర్శించారు. మోదీ గత ఏడాది మే నెలలో పార్టీకి, ప్రభుత్వానికి ఎదురులేని నేతగా అవతరించిన తర్వాత తొలిసారి ఆయన నాయకత్వాన్ని సవాల్ చేస్తూ అద్వానీ తదితరులు మంగళవారం సాయంత్రం కటువైన పదజాలంతో ప్రకటన విడుదల చేశారు. మాజీ కేంద్రమంత్రి అరుణ్‌శౌరి, ఆర్ఎస్ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్.గోవిందాచార్యులు జోషితో భేటీ అయిన తర్వాత.. జోషి నివాసం నుంచి ఈ ప్రకటన విడుదలయింది.
వారు బాధ్యతను దులిపేసుకుంటున్నారు...
బిహార్‌లో ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యులని చెప్పటం.. ఏ ఒక్కరినీ బాధ్యులను చేయకుండా చూడటానికేనని సీనియర్ నేతలు తప్పుపట్టారు. ‘‘ఒకవేళ పార్టీ గెలిచినట్లయితే అందుకు కారకులుగా ఎవరైతే కీర్తిని పొందేవారో.. వారు బిహార్‌లో ఘోర ఫలితాలకు బాధ్యతను దులిపివేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు స్పష్టం చేస్తోంది’’ అంటూ మండిపడ్డారు. సోమవారం పార్టీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో పరాజయానికి బాధ్యతకు సంబంధించినంత వరకూ పార్టీ ఉమ్మడిగా గెలుస్తుంది.. ఉమ్మడిగా ఓడిపోతుందని చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుట్టారు.
అలాగే.. బిహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షించిన, ప్రచారానికి బాధ్యులైన వారితో సమగ్ర సమీక్ష నిర్వహించరాదని స్పష్టంచేశారు. గత ఏడాది నరేంద్రమోదీ ప్రధానమంత్రి, అమిత్‌షా పార్టీ అధ్యక్షుడు అయ్యాక.. పార్టీకి అత్యంత ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన అద్వానీతో పాటు, పార్టీ మాజీ అధ్యక్షుడైన జోషిని కూడా ‘మార్గదర్శక మండలి’ సభ్యులుగా చేశారు. ఈ మండలిలో.. అనారోగ్యంతో ఉన్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి, పార్టీ ఇంకో మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రధాని మోదీలు కూడా సభ్యులుగా ఉన్నారు.
గళం కలిపిన బిహార్ సీనియర్ నేతలు...
బీజేపీలో కురువృద్ధుల తిరుగుబాటు గళంతో బిహార్‌కు చెందిన పార్టీ నేతలు కూడా స్వరం కలిపారు. సి.పి.ఠాకూర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కేంద్ర నాయకత్వానికి - క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు మధ్య సంబంధం.. యజమానికి - సేవకుడికి మధ్య సంబంధం లాగా మారిపోయిందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌భగవత్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలే ఈ ఎన్నికల్లో తమను ఓడించాయని ధ్వజమెత్తారు. బిహార్‌లోని బేగుసరాయ్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన భోలాసింగ్ సైతం.. మోదీ, అమిత్‌షాలు ప్రచారంలో మతతత్వాన్ని చొప్పించారంటూ మండిపడ్డారు.
యుద్ధ క్షేత్రంలో నితీశ్‌కుమార్ మర్యాద తప్పుకుండా మాట్లాడుతుంటే.. మోదీ అమర్యాదకరమైన భాషను ఉపయోగించారని తప్పుపట్టారు. సాయంత్రం అద్వానీ తదితర సీనియర్ నేతల ప్రకటన వెలువడటంతో.. దానిని తాను స్వాగతిస్తున్నట్లు భోలాసింగ్ పేర్కొన్నారు. ‘‘పార్టీకి జన్మనిచ్చిన వారే.. అది అంతమై పోకుండా కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఆత్మలో దీపం వెలిగించేందుకు వారి ప్రకటన దోహదం చేస్తుంది’’ అని హర్షం వ్యక్తంచేశారు. వీరికన్నా ముందుగా.. బిహార్‌కు చెందిన బీజేపీ ఎంపీలు శత్రుఘ్నసిన్హా, హుకుందేవ్నారాయణ్యాదవ్, ఆర్.కె.సింగ్‌లు కూడా రాష్ట్ర ఎన్నికల్లో పార్టీ వైఖరి, ప్రచారం తీరే ఓటమికి దారితీశాయంటూ తీవ్ర విమర్శలు సంధించిన విషయం తెలిసిందే.
తొలి టపాసులు పేలాయి: చిదంబరం
ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు షాల నాయకత్వంపై బీజేపీ కురువృద్ధులు తిరుగుబాటు జెండా ఎగురవేయటంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందిస్తూ.. ‘‘దేశ ప్రజలు దీపావళి సందర్భంగా తొలి టపాసులు పేలటాన్ని చూస్తున్నారు.. ఆశ్చర్యమేమీ లేదు’’ అని వ్యాఖ్యనించారు. అద్వానీ, జోషీ తదితరుల ప్రకటన వెలువడిన వెంటనే ఆయన ట్విటర్లో పై విధంగా వ్యాఖ్యలు చేశారు.