parliament committees
-
రేపటి నుంచి కొత్త పార్లమెంట్ కమిటీలు
న్యూఢిల్లీ: 2023–24 ఆర్థిక సంవత్సరంలో నూతన పార్లమెంట్ కమిటీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 30 దాకా ఇవి కొనసాగుతాయి. ఈ మేరకు లోక్‌సభ, రాజ్యసభ నోటిఫికేషన్ జారీ చేశాయి. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి మరోసారి అవకాశం దక్కింది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ సభ్యుడు సంతోష్‌కుమార్ గంగ్వార్ నియమితులయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీలో రాజ్యసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డిని సభ్యుడిగా నియమించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌గా కిరీట్ ప్రేమ్జీభాయి సోలంకీ నియమితులయ్యారు. -
దత్తాత్రేయకు కొత్త బాధ్యతలు?
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయకు సరికొత్త బాధ్యతలు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆయన తన కేంద్ర మంత్రి పదవిని త్యాగం చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ అనుభవం దృష్ట్యా దత్తాత్రేయకు స్టాడింగ్ కమిటీలో ఒకదానికి చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీలను సంప్రదించి లోక్ సభ లేదా రాజ్యసభ చైర్మన్లు ప్రతీ ఏడాది స్టాండింగ్ కమీటీలకు కొత్త చైర్మన్లను నియమిస్తారన్న విషయం తెలిసిందే. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మూలంగా గతంలో కమిటీలకు చైర్మన్లుగా ఉన్న ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయి. నిబంధనల ప్రకారం మంత్రులు స్టాండింగ్ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరించటానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయతోపాటు, ఏపీ బీజేపీ ఎంపీ హరిబాబుకు ఆ స్థానాలు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. సత్యపాల్ సింగ్, వీరేంద్ర కుమార్లతోపాటు ఆదిత్యనాథ్(యూపీ సీఎం) స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. లా ప్యానెల్ చైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ స్థానంలో బీజేపీ భూపిందర్ యాదవ్ నియమితులయ్యే అవకాశం ఉంది. మాజీ న్యాయవాది అయిన యాదవ్ ప్రస్తుతం మరో మూడు పార్లమెంట్ కమిటీలకు ప్రస్తుతం సభ్యుడిగా ఉండటం విశేషం. -
18 పార్లమెంటు కమిటీలు ఏకగ్రీవం!
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపిక వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వివాదం తెగకున్నా పార్లమెంటు కమిటీలకు సభ్యుల ఎన్నిక మాత్రం ఏకగ్రీవంగా సాగింది. మొత్తం 18 కమిటీలు, ప్రభుత్వ సంస్థలకు సభ్యులు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 30 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. సభ్యులు ఏకగ్రీంగా ఎన్నికైన కమిటీల్లో ఆర్థికంగా కీలకమైన ప్రజాపద్దులు, అంచనాల కమిటీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కమిటీలూ ఉన్నాయి. ‘సభలో చక్కటి నిర్వహణ, విపక్షాలతో తెరవెనక సమన్వయంతో నేతలు, పార్టీల మధ్య పరస్పర అంగీకారాన్ని సాధించడంతో 34 మంది ఎంపీలు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్షానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాతోపాటు ఇతర నేతలను ఒప్పించడంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య కీలక పాత్ర పోషించారన్నాయి. 18 కమిటీల్లో 148 స్థానాలుండగా 159 నామినేషన్లు వచ్చాయి. దాదాపు అన్ని కమిటీల్లో మెజారిటీ సభ్యులు బీజేపీ వారే ఎన్నికయ్యారు. అంచనాల కమిటీకి 18, ప్రజా పద్దుల కమిటీకి 15, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీకి 9 మంది ఆ పార్టీ వారు ఎన్నికయ్యారు. నామినేషన్లు ఉపసంహరించుకున్నవారిలో టీఆర్ఎస్ ఎంపీలు బి. వినోద్, జితేందర్, కె.శ్రీహరి ఉన్నారు. వినోద్, జితేందర్ ప్రభుత్వ రంగసంస్థల కమిటీ సభ్యులుగా, శ్రీహరి ఎస్సీ, ఎస్టీల సంక్షేమ కమిటీ సభ్యుడిగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఓబీసీ కమిటీలో 20 మందికి స్థానముండగా ఏడుగురు సభ్యులే నామినేషన్లు వేశారు. దీంతో వారు పోటీలేకుండా ఎన్నికయ్యారు. వీరిలో టీఆర్ఎస్, ఏఐఏడీఎంకే, శివసేన, బీజేడీల నుంచి ఒక్కొక్కరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంచనాల కమిటీలో, ఏపీ టీడీపీ ఎంపీ రాయపాటి, బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు ప్రభుత్వ రంగసంస్థల కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యారు.