సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, ఎంపీ బండారు దత్తాత్రేయకు సరికొత్త బాధ్యతలు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బాధ్యతలను అప్పగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆయన తన కేంద్ర మంత్రి పదవిని త్యాగం చేసిన విషయం తెలిసిందే.
సుదీర్ఘ అనుభవం దృష్ట్యా దత్తాత్రేయకు స్టాడింగ్ కమిటీలో ఒకదానికి చైర్మన్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీలను సంప్రదించి లోక్ సభ లేదా రాజ్యసభ చైర్మన్‌లు ప్రతీ ఏడాది స్టాండింగ్ కమీటీలకు కొత్త చైర్మన్లను నియమిస్తారన్న విషయం తెలిసిందే. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ మూలంగా గతంలో కమిటీలకు చైర్మన్‌లుగా ఉన్న ఇద్దరికీ మంత్రి పదవులు దక్కాయి. నిబంధనల ప్రకారం మంత్రులు స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌లుగా వ్యవహరించటానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో దత్తాత్రేయతోపాటు, ఏపీ బీజేపీ ఎంపీ హరిబాబుకు ఆ స్థానాలు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
సత్యపాల్ సింగ్, వీరేంద్ర కుమార్‌లతోపాటు ఆదిత్యనాథ్(యూపీ సీఎం) స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. లా ప్యానెల్ చైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ స్థానంలో బీజేపీ భూపిందర్ యాదవ్ నియమితులయ్యే అవకాశం ఉంది. మాజీ న్యాయవాది అయిన యాదవ్ ప్రస్తుతం మరో మూడు పార్లమెంట్ కమిటీలకు ప్రస్తుతం సభ్యుడిగా ఉండటం విశేషం.