ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రమాదకరం
బండారు దత్తాత్రేయ
పరకాల: ఓటు బ్యాంక్ రాజకీయాలు దేశానికి చాలా ప్రమాదకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం అదే దారిలో పయనిస్తున్నాడని బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేపట్టిన తెలంగాణ విమోచన యాత్ర శనివారం వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలకిచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పి, మడమ తిప్పారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చే సెప్టెంబర్ 17న గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేయాలని, లేనిపక్షంలో కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు.
సర్కారు అధికారికంగా నిర్వహించకపోయినా సెప్టెంబర్ 17న ప్రతి గ్రామంలో, కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపేలా చూస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17న నిజామాబాద్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోందని, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మజ్లీస్ పార్టీకి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోవాలని అన్నారు.