
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఎప్పటిలాగే దసరా పండుగ సందర్భంగా 'అలయ్ బలయ్' సాంస్కృతిక సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, జేఏసీ చైర్మన్ కోదండరాం, ఎంపీ జితేందర్ రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి, వీ హనుమంతరావు, సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేవిధంగా రుచికరమైన తెలంగాణ వంటకాలతో దసరా పండుగ సందర్భంగా దత్తాన్న అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని స్నేహపూర్వక సంస్కృతిని చాటేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నేతలు పాల్గొని.. 'అలయ్-బలయ్' అంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని విజయదశమిని విశిష్టతను చాటుతారు.
ఈ కార్యక్రమానికి పిలిచినా హాజరుకాలేకపోతున్నానని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక లేఖలో తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా 'అలయ్ బలయ్' విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా 'అలయ్ బలయ్' కార్యక్రమ విశిష్టతను ప్రశంసిస్తూ.. ఒక లేఖలో తన సందేశాన్ని పంపించారు. 13 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం సంతోషం కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతి వారసత్వాన్ని ఈ కార్యక్రమం కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ.. దత్తాత్రేయకు శుభాభినందనలు తెలిపారు.