స్మృతి వ్యాఖ్యలపై పార్లమెంట్లో దుమారం
న్యూఢిల్లీ : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభల్లో మంగళవారం దుమారం రేగింది. దీంతో ఉభయ సభలు విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనలతో హోరెత్తాయి. సభా కార్యాక్రమాలకు అంతరాయం కలగడంతో ఇరు సభలు వాయిదా పడ్డాయి. తొలిసారి లోక్ సభ 15 నిమిషాలు, రాజ్యసభ 10 నిమిషాల పాటు వాయిదా పడింది. తిరిగి ఉభయ సభలు ప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో మరోసారి మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడ్డాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై ఆమె పార్లమెంట్లో చేసిన ప్రకటనను విపక్షాలతో పాటు రోహిత్ కుటుంబం తప్పుబట్టిన విషయం తెలిసిందే. స్మృతి ఇరానీ ఈ అంశంపై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారంటూ ఇద్దరు కాంగ్రెస్ నేతలు సోమవారం ఉదయం లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. మరోవైపు రాజ్యసభలోను బీఎస్పీ కూడా ఆమెపై హక్కుల నోటీసు ఇవ్వనుంది.