రొటీన్‌కు భిన్నంగా ఆలోచించండి.. ఇంకెన్నాళ్లు ఇలా?
న్యూఢిల్లీ: హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ విషయంలో కేంద్రం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కాల పరిమితికి కట్టుబడకపోవడం దురదృష్టకరమని న్యాయ, సిబ్బందిపై ఏర్పాటైన పార్లమెంటు కమిటీ ఆవేదన వెలిబుచ్చింది. ‘‘ఇదో నిరంతర సమస్యగా కొనసాగుతోంది. దీని పరిష్కారానికి కేంద్రం, న్యాయ వ్యవస్థ రొటీన్‌కు భిన్నంగా ఆలోచించాలి’’ అని గురువారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సూచించింది.
కొలీజియం ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య వివాదం నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ నేతృత్వంలోని కమిటీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి నిర్దిష్ట కాలావధిని సూచించలేమన్న కేంద్ర న్యాయ శాఖ వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. ‘‘ఈ విషయంలో స్పష్టమైన కాలావధిని న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)లోనూ, రెండో జడ్జిల కేసులోనూ పేర్కొన్నారు. కానీ వాటికి న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు రెండూ కట్టుబడకపోవడం శోచనీయం’’ అంటూ సునిశిత విమర్శలు చేసింది. ‘‘పైగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఈ ఎంఓపీని సవరించే అంశం కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య దాదాపు ఏడేళ్లుగా పరిశీలనలో ఉంది. ఇంతకాలమైనా దానిపై ఏకాభిప్రాయానికి రావడంలో అవి విఫలమవడం నిజంగా ఆశ్చర్యకరం’’ అంటూ ఆక్షేపించింది.
ఇప్పటికైనా పరస్పరామోదంతో ఎంఓపీని సవరించి మరింత సమర్థంగా, పారదర్శకంగా తీర్చిదిద్దాలని సూచించింది. ‘‘2021 డిసెంబర్ 31 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం తెలంగాణ, పటా్న, ఢిల్లీ హైకోర్టుల్లో సగానికి పైగా, మరో 10 హైకోర్టుల్లో 40 శాతానికి పైగా న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనాభాతో పోలిస్తే న్యాయమూర్తుల నిష్పత్తి అసలే చాలా తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఇలా పలు పెద్ద రాష్ట్రాల హైకోర్టుల్లో ఇన్నేసి ఖాళీలుండటం చాలా ఆందోళనకరం’’ అని అభిప్రాయపడింది.
హైకోర్టుల్లో ఖాళీలెన్నో...
దేశవ్యాప్తంగా 25 హైకోర్టులున్నాయి. గత డిసెంబర్ 5 నాటికి వాటిలో 1,108 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా 778 మందే ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను పునఃపరిశీలించాలంటూ కేంద్రం నవంబర్ 25న తిప్పి పంపడం తెలిసిందే.