Parliament position
-
చేవెళ్ల సెగ్మెంట్లో ‘దేశం’ గల్లంతు
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల నియోజకవర్గంలో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న చేవెళ్లలో ఈ సారి ఆ పార్టీ నేడు మూడో స్థానానికి దిగజారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరుతో నియోజకవర్గ స్థాయినుంచి మండల, గ్రామస్థాయి వరకు నేతలు ఎక్కువమంది వీడటంతో పార్టీ జవసత్వాలు కోల్పోయింది. దీంతో సార్వత్రికంలోనూ, ప్రాదేశికంలోనూ చతికిలపడింది. నాడు వైభోగం.. నేడు ఆగమ్యగోచరం తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు చేవెళ్ల నియోజకవర్గంలో అత్యధికసార్లు గెలిచిన పార్టీగా టీడీపీకి రికార్డు ఉంది. దివంగత సీఎం ఎన్టీ రామారావు తెలుగు విజయ ప్రాంగణం (గండిపేట కుటీరం) కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను చాలా వరకు ఇక్కడినుంచే సమీక్షించేవారు. ఆయన జన్మదినం సందర్భంగా మహానాడు కూడా ప్రతియేటా ఇక్కడే నిర్వహించేవారు. దీంతో పార్టీకి నియోజకవర్గం కంచుకోటగా మారింది. 1985, 1989, 1994లో ఇంద్రారెడ్డి టీడీపీనుంచి వరుసగా మూడుసార్లు గెలుపొంది ఇక్కడ హ్యాట్రిక్ సాధించారు. ఎన్టీఆర్ మరణించడం, చంద్రబాబు సీఎం కావడంతో ఆయనతో పొసగక ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2009లో టీడీపీ అభ్యర్థిగా కేఎస్.రత్నం విజయం సాధించి పార్టీకి పునర్వైభవం సాధించి పెట్టారు. అయితే తెలంగాణ ఏర్పాటుతో మారిన సమీకరణాలతో కేఎస్ రత్నం టీఆర్ఎస్లో చేరడంతో టీడీపీ మళ్లీ ఇక్కడ చతికిలపడింది. గతనెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్యకు 64,182 ఓట్లురాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి కేఎస్.రత్నంకు 63,401 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకల వెంకటేశ్‌కు కేవలం 15,117 ఓట్లు మాత్రమే లభించడంతో మూడవస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరాభవంతో తెలుగు తమ్ముళ్లు ఇతర పార్టీలవైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రాదేశికంలోనూ ఘోర పరాజయం గత నెలలో జరిగిన ప్రాదేశికంలోనూ టీడీపీ పరాజయం పాలైంది. నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, నవాబుపేట మండలాలుండగా ఒక్క మండలంలో కూడా టీడీపీ జెడ్పీటీసీ స్థానం నెగ్గలేదు. 79 ఎంపీటీసీ స్థానాలకుగాను కేవలం 4 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. కనీస పోటీ కూడా ఇవ్వలేక టీడీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. -
ప్రచారంలో రమ్య కన్నీటిపర్యంతం
మండ్య, న్యూస్‌లైన్ : మండ్య పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ర మ్య సోమవారం తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 3న నామినేషన్ దాఖలు సమయంలో తన పెంపుడు తండ్రి ఆర్టీ నారాయణ గుండెపోటుతో మరణించిన విషయం తెల్సిందే. ఈ హఠాత్ పరిణామానికి తీవ్రంగా కుంగిపోయిన రమ్య ఒక దశలో ప్రచారం చేయనని భీష్మించుకు కూర్చున్నారు. పార్టీ నేతల ఓదార్పులతో సోమవారం ఉదయం రమ్య, మంత్రి అంబరీశ్‌తో కలిసి స్థానిక కాళికాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయం నుంచి బయటకు వస్తూనే ప్రచారం వాహనంలోనే తన తండ్రిని తలచుకుని రమ్య కన్నీంటి పర్యంత మయ్యారు. కొద్దిసేపు అనంతరం రమ్య ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేటవీధి, హోళలు సర్కిల్, శంకరమఠం, కల్లహళ్లి, ఏపీఎంసీ మార్కెట్, కాత్యుంగెరె వినాయకుని దేవాలయం, చాముండేశ్వరి దేవాలయం వీది, నోరడి రోడ్డు, కర్ణాటక బార్ సర్కిల్, హొసహళ్లి మారమ్మ దేవాలయం సర్కిల్, పట్టణంలోని ప్రముఖ వీధుల్లో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో రాష్ట్ర కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు మంజుల నాయుడు, మంత్రి డాక్టర్ హెచ్‌సీ మహాదేవప్ప, నాయకులు రవి, చిదంబర్, నాగమని, రవికుమార్ మాహేష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం రమ్యను గెలిపించండి : అంబరీశ్ మండ్య జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తు న్న బహుభాష నటి రమ్యను గెలిపించాలని నటుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీశ్ మండ్య వాసులకు విజ్ఞప్తి చేశాడు. మండ్యకు పట్టిన శని వదలాలంటే రమ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని, ఈ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా అభివృద్ధి సాధ్యమని అంబరీశ్ గుర్తు చేశారు.