చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల నియోజకవర్గంలో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న చేవెళ్లలో ఈ సారి ఆ పార్టీ నేడు మూడో స్థానానికి దిగజారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరుతో నియోజకవర్గ స్థాయినుంచి మండల, గ్రామస్థాయి వరకు నేతలు ఎక్కువమంది వీడటంతో పార్టీ జవసత్వాలు కోల్పోయింది. దీంతో సార్వత్రికంలోనూ, ప్రాదేశికంలోనూ చతికిలపడింది.
నాడు వైభోగం.. నేడు ఆగమ్యగోచరం
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు చేవెళ్ల నియోజకవర్గంలో అత్యధికసార్లు గెలిచిన పార్టీగా టీడీపీకి రికార్డు ఉంది. దివంగత సీఎం ఎన్‌టీ రామారావు తెలుగు విజయ ప్రాంగణం (గండిపేట కుటీరం) కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను చాలా వరకు ఇక్కడినుంచే సమీక్షించేవారు. ఆయన జన్మదినం సందర్భంగా మహానాడు కూడా ప్రతియేటా ఇక్కడే నిర్వహించేవారు. దీంతో పార్టీకి నియోజకవర్గం కంచుకోటగా మారింది.
1985, 1989, 1994లో ఇంద్రారెడ్డి టీడీపీనుంచి వరుసగా మూడుసార్లు గెలుపొంది ఇక్కడ హ్యాట్రిక్ సాధించారు. ఎన్‌టీఆర్ మరణించడం, చంద్రబాబు సీఎం కావడంతో ఆయనతో పొసగక ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2009లో టీడీపీ అభ్యర్థిగా కేఎస్.రత్నం విజయం సాధించి పార్టీకి పునర్‌వైభవం సాధించి పెట్టారు. అయితే తెలంగాణ ఏర్పాటుతో మారిన సమీకరణాలతో కేఎస్ రత్నం టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ మళ్లీ ఇక్కడ చతికిలపడింది. గతనెల 30న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్యకు 64,182 ఓట్లురాగా, సిట్టింగ్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి కేఎస్.రత్నంకు 63,401 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకల వెంకటేశ్‌కు కేవలం 15,117 ఓట్లు మాత్రమే లభించడంతో మూడవస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరాభవంతో తెలుగు తమ్ముళ్లు ఇతర పార్టీలవైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది.
ప్రాదేశికంలోనూ ఘోర పరాజయం
గత నెలలో జరిగిన ప్రాదేశికంలోనూ టీడీపీ పరాజయం పాలైంది. నియోజకవర్గంలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి, నవాబుపేట మండలాలుండగా ఒక్క మండలంలో కూడా టీడీపీ జెడ్పీటీసీ స్థానం నెగ్గలేదు. 79 ఎంపీటీసీ స్థానాలకుగాను కేవలం 4 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. కనీస పోటీ కూడా ఇవ్వలేక టీడీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
చేవెళ్ల సెగ్మెంట్‌లో ‘దేశం’ గల్లంతు
Published Mon, May 19 2014 12:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement