ఫిబ్రవరిలో మోటారు వాహనాల సవరణ బిల్లు!
న్యూఢిల్లీ: రహదారి భద్రతలో ప్రపంచస్థాయి ప్రమాణాలను తీసుకొచ్చేలా మోటారు వాహనాల చట్టానికి సవరణపై కేబినెట్ నోట్‌ను ఇప్పటికే పంపామని, ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ మంగళవారం ఢిల్లీలో తెలిపారు. సవరణ ప్రతిపాదనపై ప్రధాని మోదీ పలు సూచనలు చేశారన్నారు. బిల్లులో వీటినీ పొందుపరిచి చేరుస్తామని ... కేబినెట్ ఆమోదం తర్వాత తదుపరి పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామన్నారు.
కాగా, రామసేతును ధ్వంసం చేయకుండానే సేతుసముద్రం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ మార్గంపై అధ్యయనం చేసి అఫిడవిట్ రూపొందించామని, ప్రధాని ఆమోదించాక దాన్ని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని గడ్కారీ తెలిపారు. పండ్లు, కూరగాయలను రైతులు స్వేచ్ఛగా విక్రయించుకునేలా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ చట్టం పరిధి నుంచి వాటిని తప్పించడంపై రాష్ట్రాలను సంప్రదిస్తామని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మంగళవారం తిరువనంతపురంలో తెలిపారు. మరోవైపు జీఎస్టీ అమలుపై రాష్ట్రాలకు ఏడాది సమయాన్ని అదనంగా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.