Parliamentary Association
-
ఎంపీల వేతనాలు 100% పెంపు!
పార్లమెంటరీ కమిటీ సిఫారసులు * రూ. 50 వేలుగా ఉన్న జీతం రెట్టింపు చేయాలి * రూ. 20 వేలుగా ఉన్న పెన్షన్ రూ. 35 వేలకు పెంచాలి * సమావేశాల సమయంలో రోజు వారీ భత్యాన్ని రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు పెంచాలి న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను వంద శాతం పెంచాలని ఈ అంశంపై ఏర్పాటైన పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది. అలాగే.. మాజీ ఎంపీల పెన్షన్‌ను 75 శాతం పెంచాలని సూచించింది. మాజీ ఎంపీల జీవిత భాగస్వాముల (భార్య లేదా భర్త) స్థానంలో సహచరులకు సదుపాయాలు కల్పించాలని చెప్పింది. పలువురు ఎంపీలు అవివాహితులు లేదా ఇతర కారణాల వల్ల జీవితభాగస్వామి లేకుండా ఒంటరిగా ఉన్నందున.. జీవితభాగస్వామి స్థానంలో సహచరులు అనే పదాన్ని చేర్చాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ. 50,000గా ఉన్న ఎంపీల నెల వారీ వేతనాన్ని రెట్టింపు చేయాలని, ప్రస్తుతం రూ. 20,000గా ఉన్న పెన్షన్‌ను రూ. 35,000కు పెంచాలని.. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘం సూచించింది. పార్లమెంటు సమావేశాల సమయంలో సభలకు హాజరయ్యే ఎంపీలకు ఇచ్చే రోజు వారీ భత్యాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 2,000 నుంచి రూ. 4,000కు పెంచాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ ఎదుట తమ అభిప్రాయాలు చెప్పిన పలువురు మాజీ ఎంపీలు.. తమకు రైలులో మొదటి తరగతి ప్రయాణానికి టికెట్ ఇచ్చినప్పటికీ.. తమ సహచరులు, తమ జీవిత భాగస్వాములైనా సరే రెండో తరగతిలో ప్రయాణించాల్సి ఉంటుందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీతో పాటు, ఆ ఎంపీ సహచరులు ఒకరికి కూడా మొదటి తరగతి ప్రయాణ టికెట్లు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. సిటింగ్ ఎంపీలు ఏడాదిలో దాదాపు 36 సార్లు ఎగ్జిక్యూటివ్ తరగతిలో విమాన ప్రయాణం చేసేందుకు అనుమతి ఉంది. ఎంపీలను కేబినెట్ కార్యదర్శి హోదా కన్నా అధికంగా పరిగణిస్తున్నందున.. వారి విశేషాధికారాలు, సౌకర్యాలు వారి హోదాకు తగ్గట్లుగా ఉండాలని కమిటీ అభిప్రాయపడ్డట్లు సమాచారం. ఎంపీల సంతానంలో వివాహితులకు కూడా ఆరోగ్య పరిరక్షణ ప్రయోజనాలు అందించాలని కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సమావేశాల మినిట్స్‌లో నమోదైన ఈ సిఫారసుల్లో కొన్నిటిని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. మిగతా వాటిని ఈ నెల 13వ తేదీన జరిగే తదుపరి సమావేశంలో ఖరారు చేయటం జరుగుతుంది. స్వతంత్ర వ్యవస్థ నిర్ణయించాలి: సీపీఎం, జేడీ-యూ ఎంపీల జీతభత్యాలను చివరిసారిగా 2010లో సవరించారు. ప్రస్తుత కమిటీ తన సిఫారసులను సమర్పించిన తర్వాత మళ్లీ ఐదేళ్లకు సమీక్షిస్తారు. అయితే.. ఎంపీలు తమంతట తామే తమ జీతభత్యాలను నిర్ణయించరాదని.. ఒక స్వతంత్ర వ్యవస్థ ద్వారా ఆ నిర్ణయాలు తీసుకోవాలని సీపీఎం సభ్యుడు కె.ఎన్.బాలగోపాల్ సూచించారు. జేడీ-యూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అయితే.. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్‌లో భారత్ కూడా సభ్యదేశం అయినందున.. ఆ కూటమి లోని మిగతా సభ్యదేశాల్లో ఎంపీలకు సమానంగా భారత ఎంపీల జీతభత్యాలు ఉండాలని మరికొందరు సభ్యులు వాదించారు. -
సమగ్ర వివరాలు సమర్పించండి
హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై అధికారులకు సభా సంఘం ఆదేశం హైదరాబాద్: హౌసింగ్ సొసైటీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సమగ్ర వివరాలను తమ ముందు ఉంచాలని శాసనసభా సంఘం అధికారులను ఆదేశించింది. వివిధ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నేతృత్వంలో ఏర్పాటైన సభా సంఘం శనివారం శాసనసభ కమిటీ హాల్లో సమావేశమై ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వర్ తదితర సొసైటీల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపింది. అసమగ్ర వివరాలతో సమావేశానికి వచ్చిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా పద్మాలయ, జయభేరీ స్టూడియోలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సభా సంఘం అధికారులను నిలదీసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమంగా నిర్వహిస్తున్న భారతీ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్ గుర్తింపు గడువు ముగుస్తున్న నేపథ్యంలో మళ్లీ పునరుద్ధరించవద్దని అధికారులకు సూచించింది. హౌసింగ్ సొసైటీల్లో నిబంధనల మేరకు సామాజిక అవసరాలకు కేటాయించిన 10 శాతం స్థలాల్లో సైతం వ్యాపార, వాణిజ్య భవనాలను నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడింది. ఈ సమావేశంలో సభా సంఘం సభ్యులు కర్నె ప్రభాకర్, కె.జనార్దన్‌రెడ్డి, భానుప్రసాదరావు, గువ్వల బాలరాజు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, అహమ్మద్ బలాల, చింతల రామచంద్రారెడ్డి, మాగంటి గోపినాథ్‌తో పాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్ఎంసీ ప్రత్యేకాధికారి సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.