'ఆస్పత్రుల్లో గోమూత్రాన్ని వాడండి..'
ముంబై: ఆవు పాలే కాదు గోమూత్రం కూడా మానవాళికి ఎంతో మేలు చేస్తుందని ముంబై కొర్పొరేటర్ పర్మీందర్ భమ్రా చెబుతున్నారు. గోమూత్రం క్రిములను చంపుతుందని, దీంతోనే తన ఇంటిని శుభ్రం చేస్తామని చెప్పారు. ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను గోమూత్రంతో శుభ్రం చేయాలని సూచించారు.
'గోమూత్రంతో ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేస్తాం. ఇది క్రిములను చంపుతుంది. గోమూత్రం సులభంగా లభిస్తుంది. మా ఇంటి సమీపంలోని గోశాల నుంచి తీసుకువస్తా. ఆస్పత్రులు కూడా శుభ్రత కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు' అని భమ్రా అన్నారు. మలాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా ఎన్నికైన భమ్రా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో శుభ్రం చేయడానికి గోమూత్రం వాడాలని కోరుతూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతిపాదన చేశారు.
అయితే వైద్య నిపుణులు భిన్నంగా స్పందించారు. శాస్త్రీయంగా చూస్తే శుభ్రం చేయడానికి గోమూత్రం ఎప్పటికీ ఆమోదం పొందదని నాగపూర్ వెటర్నరీ కాలేజీ మాజీ డైరక్టర్, బాంబే వెటర్నరీ కాలేజ్ అసోసియేట్ డీన్ డాక్టర్ వీఎల్ దేవ్పుర్కార్ అభిప్రాయపడ్డారు. గోమూత్రాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగిస్తారని, శుభత్ర కోసం వాడరని చెప్పారు. గో విజ్ఞాన్ అనుసాంధాన్ కేంద్ర నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.