అమరవీరునికి అరకొర పరిహారం
► సియాచిన్ ఘటనలో అసువులు బాసిన ముస్తాక్
► కుటుంబాన్ని పరామర్శించని నేతలు, అధికారులు
► ప్రభుత్వ నిర్లక్ష్యంపై పార్నపల్లె గ్రామస్తుల ధర్నా
► నేడు స్వగ్రామానికి మృతదేహం
కర్నూలు: సియాచిన్ ఘటనలో అమరుడైన వీర జవాను ముస్తాక్ అహ్మద్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పార్నపల్లె గ్రామస్తులు ఆదివారం ధర్నా నిర్వహించారు. పక్కనే ఉన్న కర్ణాటక ప్రభుత్వం ఆ ప్రాంత జవాను హనుమంతప్ప మృతికి పరిహారంగా రూ. 25లక్షలతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు మంజూరు చేసింది. అలాగే ఘన నివాళులు అర్పించింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 5లక్షలు, ఇల్లుతో సరిపెట్టడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు.
దేశ రక్షణలో భాగంగా ప్రాణ త్యాగం చేసిన ముస్తాక్‌కు ప్రభుత్వం అధికారికంగా ఇప్పటికీ నివాళులు అర్పించలేదని, సంతాప సభ కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ముఖ్య నాయకులు, జిల్లా అధికారులు ఎవరూ ఇప్పటి వరకు ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల పార్నపల్లె గ్రామస్తులతో పాటు ముస్లిం మైనారిటీలు నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై గ్రామస్తులు రెండు రోజుల కిందట నంద్యాల ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఆదివారం రోజున ఓ ఎమ్మెల్సీ కంటితుడుపు చర్యగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు.
వారం రోజులుగా జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. ముస్తాక్ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెండ్రోజుల కిందట ముస్తాక్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పరామర్శిస్తారని బండిఆత్మకూరు తహశీల్దార్‌కు సమాచారం అందింది. ఆ మేరకు టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీతో హడావుడి చేసినా ఆయన ఎలాంటి ప్రకటన చేయకుండానే గైర్హాజరయ్యారు. బండిఆత్మకూరు తహశీల్దార్ మినహాయిస్తే ఇప్పటి వరకు జిల్లా కేంద్రం నుంచి ఒక్క అధికారి కూడా ముస్తాక్ కుటుంబాన్ని ఓదార్చ లేదు. ఇదిలాఉంటే ముస్తాక్ పార్థివ దేహం సోమవారం జిల్లాకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.