parody song
-
నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్
తమిళ హీరో ధనుష్, నాచ్యురల్ బ్యూటీ సాయిపల్లవి కలిసి స్టెప్పులేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఏ ఫంక్షన్లో చూసినా, ఎవరి ఫోన్ రింగ్ అయినా ఈ పాటనే వినబడేది. అంతలా ఆకర్షించింది ఈ ‘రౌడీ బేబీ’. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సాధించింది. ప్రస్తుతం ఇండియా సినిమాల్లో ఏ పాటకు రానన్ని వ్యూస్ ‘రౌడీ బేబీ’సొంతం చేసుకుంది. దానికి కారణం కేవలం సాయిపల్లవి క్రేజ్, యాక్టింగ్ అనే చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె వేసిన స్టెప్పులకి సీనీ అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడిప్పుడే ఈ పాటను కాస్త మర్చిపోతున్న తరుణంలో ఓ డాక్టర్ పుణ్యమా అని మళ్లీ అంతా ‘రౌడీ బేబీ’ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ సారి ఒరిజినల్ ‘రౌడీ బేబీ’ని కాకుండా.. పేరడీ పాటను విని తెగ నవ్వుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. దేశంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతన్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో భాస్కర్ అనే ఓ వైద్యుడు గుండె ఆరోగ్యం గురించి చెబుతూ.. ‘రౌడీ బేబీ’ పెరడీ పాడారు. మధ్యపానం, ధూమపానం చేయకూడదని, ఉప్పు, మసాల కూడా తక్కువగా తినాలని పాట రూపంలో చెప్పాడు. ప్రస్తుతం ఈ పేరడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
బాలీవుడ్ బంధుప్రీతిపై వైరల్ వీడియో
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కేవలం స్టార్ హీరోల వారసులు మాత్రమే ఎదుగుతున్నారనే వాదన ఎక్కువగా వినబడుతోంది. గాడ్‌ఫాదర్ లేనిదే గ్రాండ్ సక్సెస్‌తో ఎంట్రీ ఇచ్చిన ఒకటి రెండు ఫ్లాపులు పడితే సర్దుకొని ఇంటికెళ్లాల్సిందే. ప్రతిభ ఎంత ఉన్న సినీ పరిశ్రమ మళ్లీ వారివైపు కన్నెత్తైనా చూడదు. అదే స్టార్ కిడ్స్ అయితే ఆడిషన్స్ దగ్గర నుంచే అన్ని విషయాలలో రెడ్ కార్పెట్‌తో స్వాగతం చెబుతుంది. ఒక్క సినిమా కూడా చేయకముందే వారికి ఎంతో మంది అభిమానులు పుట్టుకొస్తారు. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయిన నిర్మాతలు వారి ఇంటి తలుపు కొడుతూనే ఉంటారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సినిమా పరిశ్రమలో ఉండే పక్షపాత ధోరణిపై చాలా మంది గళం విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో స్కూప్‌లు చేయడంలో ప్రముఖుడైన సలీల్ జమ్దార్ సినీ పరిశ్రమపై చేసిన జింగాత్ ధడక్ అనే పేరడీ సాంగ్ మళ్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. 2018లో ఈ పాట విడుదలైంది. కానీ ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య తరువాత మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆడిషన్స్ దగ్గర నుంచి సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని చూపించారు. ('సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు') స్టార్ కిడ్స్‌కు కష్టపడకుండానే ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి అనే విషయాన్ని చూపించారు. బాలీవుడ్ స్టార్ పిల్లలపై ‘జింగాత్ ధడక్’ పేరడీ పాటను రూపొంచారు. ఈ పాటను చూస్తే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పరిస్థితుల గురించి పునరాలోచన చేయకుండా ఉండరు. ఈ పేరడీ పాట ట్యూన్‌ను ధడక్ సినిమా పాట నుంచి తీసుకున్నారు. ధడక్ సినిమా సైరత్ అనే మరాఠీ సినిమా రీమేక్. ఈ సినిమాలో ఎలాంటి స్టార్లు లేకపోయిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ధడక్ సినిమాలో మాత్రం స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ నటించారు. ఈ పేరడీపాటలో స్టార్ కిడ్స్ అలియాభట్, వరుణ్‌ధావన్, రణబీర్ కపూర్ వీరితోపాటు మరికొంత మంది స్టార్ పిల్లల్ని చూపించారు. ప్రతిభతో సంబంధం లేకుండా ఏ కష్టం పడకుండా స్టార్ హీరోల వారసులు సులువుగా గుర్తింపు పొందుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ బంధుప్రీతిపై తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెపోటిజం కారణంగా ఇప్పటికే కరణ్ జోహార్, అలియాభట్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. (ముసుగులు తొలగించండి) -
మా తెలుగు తల్లిని మరచిపోయారా?
మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే పాట తెలుగువారు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుతల్లి పరిస్థితి దయనీయంగా మారిందంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సర్పవరం హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న వీరమణి అనే బాలిక అద్భుతంగా పాడింది. శంకరంబాడి సుందరాచార్య కలం నుంచి జాలువారిన అసలు పాటకు టంగుటూరి సూర్యకుమారి తన గళాన్ని ఇచ్చారు. ఆ పాటే ఇన్నాళ్లూ అందరికీ తెలుసు. కానీ.. తెలుగుతల్లిని మరిచారు, ఆ తల్లి మనసు విరిచారంటూ కాకినాడ బాలిక వీరమణి కళ్లు చెమర్చేలా పాడి అందరినీ ఆకట్టుకుంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ.. మా కన్న తల్లికి మంగళారతులు మన తెలుగు తల్లిని మరచిపోయారా.. మముగన్న తల్లికి మనసు విరిచారా (2) కడుపులో బంగారు.. కనుచూపులో కరుణ.. చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి కడుపులో భుగభుగలు.. కనుచూపులో దిగులు.. చిరునవ్వు కనుమరుగు.. సిరులు నిలువున తరుగు.. ఇలా ఆ పాట సాగుతుంది.