parry
-
కాకినాడ ప్యారీ షుగర్స్ పరిశ్రమలో పేలుడు.. ఇద్దరు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా వాకలపూడిలోని ప్యారీ షుగర్స్ (ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెట్) పరిశ్రమలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు రాయుడు వీరవెంకట సత్యనారాయణ (35), వీరమళ్ళ రాజేశ్వరరావు(45) మృతిచెందారు. మరో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విదేశాల నుంచి ఓడలు ద్వారా కాకినాడ సీ పోర్టుకు ముడి సరుకును దిగుమతి చేసుకుని ఇక్కడ శుద్ధిచేసి బస్తాల్లో ప్యాకింగ్ చేసి తిరిగి విదేశాలకు పంపుతుంటారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం లోడింగ్ కోసం వచ్చిన జట్టు ఉ.9గంటల సమయంలో ఒక లారీని లోడుచేశారు. మరో లారీలోకి సరుకు లోడు చేసేందుకు కన్వెయర్ బెల్ట్ పవర్ సప్లై కోసం ఎంసీబీ (మెయిన్ సర్క్యూట్ బ్రేకర్) వద్ద సాకెట్లో వైర్లు కలిపి ఎంసీబీ ఆన్‌చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇలా పేలుడు రావడం.. మంటలు వ్యాపించడంతో సత్యనారాయణ శరీర భాగాలు ఛిద్రమై అక్కడికక్కడే మరణించాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా రాజేశ్వరరావు మృతిచెందాడు. మరోవైపు.. గాయపడిన వీరబాబు, గర్లంవల సూర్య సుబ్రహ్మణ్యం, మోరుకుర్తి జగన్నాథం, గండి వీరబాబులను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో వీరబాబు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇతరుల వివరాలు తెలియాల్సి ఉంది. ఓవర్ లోడు విద్యుత్ సరఫరాతోనే ప్రమాదం? ఎంసీబీ నుంచి ఒక్కసారిగా అధిక విద్యుత్ రావడంవల్లే మోటారు పేలిపోయి ఉంటుందని దీంతో కార్మికులు తీవ్రగాయాలపాలై ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికితోడు కాలే స్వభావం గల పంచదార కూడా మంటలకు ఆజ్యంపోసి ఉండవచ్చునంటున్నారు. కానీ, ప్రమాద కారణాలను విద్యుత్, అగ్ని మాపక సిబ్బంది చెప్పలేకపోవడం మిస్టరీగా మారింది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రమాద స్థలిని పరిశీలించి కార్మికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సంస్థ మేనేజరు ఎం.బాలాజీతోనూ చర్చించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సంఘటనపై అగ్నిమాపక, విద్యుత్ అధికారులతో విచారణ జరిపిస్తామని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు చెప్పారు. బాధ్యులుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. సర్పవరం పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే సానుభూతి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలన్నారు. సీఎం వైస్ జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, దీనిపై యాజమాన్యంతో మాట్లాడతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. రూ.40లక్షల చొప్పున పరిహారం ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ వంగా గీత చర్చలు జరపడంతో మృతుల కుటుంబాలకు రూ.40లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు సంస్థ యాజమాన్యం అంగీకారం తెలిపింది. అలాగే, మృతుల కుటుంబాల్లో చదువుకున్న వారుంటే వారికి ఉద్యోగాలు.. కార్మికుల చట్టం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు.. గాయపడ్డ వారికి వైద్య ఖర్చులు, చికిత్స కాలానికి వేతనం కూడా ఇవ్వనున్నారు. ఇదీ చదవండి: షాకింగ్: ప్రియుడితో భార్య పరార్.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య -
అవిశ్వాసంపై ప్రభుత్వం దాటవేత
హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ ప్రకటించారు. అవిశ్వాస తీర్మానంపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని, దానిపై ఓటింగ్ జరగాలని ప్రతిపక్షం పట్టుబట్టినప్పటికీ స్పీకర్ అవకాశం ఇవ్వలేదు. సభలో వాయిస్ ను కోరుతూ తీర్మానాన్ని చదివిన స్పీకర్ ఆ తర్వాత మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయినట్టు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చకు చేపట్టగా, రాత్రి 9.30 గంటల వరకు తీవ్ర గందరగోళం మధ్య అసెంబ్లీ సుదీర్ఘంగా సాగింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార టీడీపీ ప్రతి సందర్భంలోనూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ అధికార పక్షం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర సభ్యులు ఎవరో ఒకరు జోక్యం చేసుకుంటూ అడ్డుపడ్డారు. జగన్ వ్యవస్థలపై చేసిన వ్యాఖ్యలను సాకుగా చేసుకుని ఎదురుదాడికి దిగారు. తాను చెప్పిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, న్యాయవ్యవస్థలపై తనకు అపారమైన నమ్మకం ఉందని జగన్ పదే పదే చెప్పినప్పటికీ అదే విషయంలో క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. తన వ్యాఖ్యలపై పలు సార్లు జగన్ వివరణ ఇచ్చినప్పటికీ అధికార పక్షం పట్టించుకోలేదు. జగన్ కు మాట్లాడే అవకాశం రాకుండా చేయాలన్న లక్ష్యంతో అవిశ్వాస తీర్మానంపై చర్చను ముగించి ఓటింగ్ నకు వెళ్లాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కోరగా ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తీర్మానంపై ఓటింగ్ జరగాలని పట్టుబట్టింది. పోడియం వద్ద తమ నిరసన తెలియజేస్తుండగానే స్పీకర్ తీర్మానానికి అనుకూలంగా ప్రతికూలంగా ఎవరున్నారంటూ వాయిస్ ఓటు తీసుకుని వీగిపోయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత బడ్జెట్ పై సాధారణ చర్చ చేపడుతున్నట్టు ప్రకటించారు. అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తుండగా సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు జగన్ తన మాటలకు వివరణ ఇస్తూ, తనను ఉద్దేశించి ఖబడ్డార్, నువ్వు మగాడివేనా, కొవ్వెక్కిందా అంటూ తీవ్రమైన మాటలు మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ మీద తనకు విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ఎలాంటి తప్పు మాటలను మాట్లాడలేదన్నారు. వైఎస్ జగన్ చేసినా వ్యాఖ్యలను స్వయంగా ఆయనే రెండు సార్లు సభలో చదివి వినిపించినా టీడీపీ ఎమ్మెల్యేలు సభను ముందుకు సాగనివ్వలేదు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి అధికార దుర్వినియోగంతో తనపై కేసులు పెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు. 20 నెలల కాలంలో ప్రభుత్వ అవినీతిని ఆయన సభలో ప్రస్తావించారు. ఆడియో, వీడియో రికార్డులతో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన ఉదంతాన్ని జగన్ ప్రస్తావించారు. దీంతో అధికార పక్షం పూర్తిగా డైలమాలో పడిపోడింది. ఈ ప్రస్తావనలను తప్పు దారి పట్టించడానికి మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు. ఈ దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల ఈ చర్చను ఇంతటితో ముగించాలని కోరగా.. అవిశ్వాస తీర్మానంపై సభలో డివిజన్ జరగాలని ప్రతిపక్షం పట్టుపట్టింది. ఆ తర్వాత స్పీకర్ మూజివాణి ఓటుతో తీర్మానం వీగిపోయిందని ప్రకటించడం క్షణాల్లో జరిగిపోయింది. దానిపై ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేస్తున్న దశలోనే సభను స్పీకర్ మరుసటి రోజుకు వాయిదా వేశారు.