పెళ్లి పేరుతో 'పెద్దాయన'ను దోచేశారు
అహ్మదాబాద్: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ 50 ఏళ్ల వ్యక్తిని దారుణంగా మోసం చేశారు ముగ్గురు మహిళలు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ఆ ముగ్గురు మహిళలని, మరో వ్యక్తిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన పర్సోత్తమ్ మార్వియా అనే వ్యక్తికి 50 ఏళ్లు. అతడికి ఐదుగురు సంతానం కూడా. వారిలో ఇద్దరు కొడుకులు.. ముగ్గురు కూతుర్లు. మూడేళ్ల క్రితం అతడికి భార్య చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా కలసి అతడికి ఓ తోడు కోసం మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా పెళ్లి ప్రకటన కూడా ఇచ్చారు.
ఇక మంజుల అలియాస్ మోనా వాఘెలా(37), డైసీ మక్వాన్ (45), షీలా క్రిస్టియాన్(54) అనే మహిళలు ఘరానా కిలాడీలు. వీరికి తోడు మైఖెల్ జోసెఫ్(25) అనే మరో మోసగాడు. వీరిలో పర్సోత్తమ్ పరిస్థితి తెలుసుకున్నఅతడికి ఎర వేశారు. గ్యాంగ్‌లోని షీలా... పర్సోత్తమ్కు మంచి సంబంధం చూసి పెడతానని అహ్మదాబాద్‌కు రావాలని ఆహ్వానించింది. అక్కడ తొలుత అతడికి ముగ్గురు మహిళలను చూపించింది. అయితే వారిలో ఏ ఒక్కరూ అతడికి నచ్చక వద్దని వెళ్లాడు. మరోసారి ఫోన్ చేసి పిలిపించి ఇద్దరు మహిళలని చూపించింది. ఆ ఇద్దరిలో మంజుల కూడా ఉంది. అయితే, ఆమెను వారిని కూడా అతడు రిజెక్ట్ చేశాడు.
ఈసారి మళ్లీ ఫోన్ చేసి ఏకంగా తానే పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేసింది షీలా. దీంతో అతడు ఫోన్ పెట్టేయగా మరోసారి ఫోన్ చేసి తాను ఎంతో ప్రేమిస్తున్నానని, తనను పెళ్లి చేసుకోకుంటే లేఖలో అతడి పేరు రాసి చనిపోతానని బెదిరించింది. బెదిరింపులకు భయపడిన అతడు రాజ్ కోట్ నుంచి తిరిగి అహ్మదాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా అతడికి ఓ గదిని ఏర్పాటుచేసి ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మంచినీళ్లలో మత్తుమందును కలిపి ఇచ్చింది. ఓ మహిళతో కలిసి అసభ్యకరంగా ఉన్నట్లుగా అతడిని ఫోటోలు తీశారు.
అనంతరం కిలాడీ మహిళలు... పర్సోత్తమ్ ...వేసుకున్న దుస్తులను కూడా వదిలిపెట్టకుండా దోచుకెళ్లారు. అప్పటి నుంచి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డారు. ఆ ఫోటోలు ఇచ్చేయాలంటే 25 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. చివరకు అయిదు లక్షలు ఇచ్చేందుకు పర్సోత్తమ్ అంగీకరించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని అతడు తన కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో వారు పోలీసులన్ని ఆశ్రయించడంతో చాకచక్యంగా ఆ ఘరానా ముఠాను అరెస్టు చేశారు.