Partnership Company
-
ఇక మేడిన్ ఇండియా హెలికాప్టర్లు!
ముంబై: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజ గ్రూప్ టాటాతో ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్ తయారీకి భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. టాటా గ్రూప్‌తో జత కట్టడం ద్వారా హెలికాప్టర్స్ తయారీలో తుది అసెంబ్లీ లైన్ (ఎఫ్ఏఎల్) యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు ఎయిర్‌బస్ హెలికాప్టర్ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ ప్లాంటు ద్వారా పౌర విమాన శ్రేణిలో దేశీయంగా ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. వీటిలో కొన్నింటిని పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా హెలికాప్టర్ తయారీకి ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్‌ఏఎల్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ కార్యక్రమానికి భారీస్థాయిలో ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించింది. డెలివరీలవరకూ.. భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్స్‌తో కలసి టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్) ఎఫ్‌ఏఎల్‌ను ఏర్పాటు చేయనుంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మేక్రన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఎయిర్‌బస్ హెలికాప్టర్ తాజా ప్రకటన జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలలో ప్రధాన అతిథిగా పాల్గొనేందుకు మేక్రన్ భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రధాన విడిభాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ నియంత్రణల ఇన్స్టలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, విమాన కంట్రోళ్లు, ఇంధన వ్యవస్థతోపాటు ఇంజిన్ కూర్పు తదితరాలను జేవీ నిర్వహించనున్నట్లు ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ వివరించింది. అంతేకాకుండా భారత్ తదితర ప్రాంతాలలో హెచ్125ల టెస్టింగ్, క్వాలిఫికేషన్‌తో సహా.. డెలివరీలను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. 24 నెలల్లోగా ఎఫ్ఏఎల్ ఏర్పాటవుతుందని, 2026లో దేశీయంగా తయారైన తొలి (మేడిన్ ఇండియా) హెచ్125ల డెలివరీ చేసే వీలున్నట్లు అంచనా వేసింది. తయారీ యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని సంయుక్తంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది. కీలక పాత్ర... జాతి నిర్మాణంలో హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిర్‌బస్ సీఈవో గిలామ్ ఫారీ పేర్కొన్నారు. నవ భారత సామర్థ్యాలపై గల నమ్మకానికి మేడిన్ ఇండియా పౌర హెలికాప్టర్ ప్రతీకగా ఉంటుందని అభివర్ణించారు. తద్వారా దేశీయంగా హెలికాప్టర్ మార్కెట్‌కున్న భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ప్రయివేట్ రంగంలో తొలి హెలికాప్టర్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటుకు సంతోషిస్తున్నట్లు టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. తుది అసెంబ్లీ లైన్ ద్వారా ప్రపంచంలోనే ఎయిర్ బస్‌కు చెందిన అత్యుత్తమ హెచ్125 సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను భారత్‌తోపాటు, ఇతర మార్కెట్లకు కూడా అందించనున్నట్లు తెలియజేశారు. -
జేఎస్‌డబ్ల్యూతో ఎస్ఏఐసీ జత
న్యూఢిల్లీ: చైనా ఆటో రంగ దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్.. దేశీ మెటల్ రంగ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో చేతులు కలిపింది. తద్వారా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనుంది. ఈ జేవీ దేశీయంగా ఎంజీ మోటార్ ట్రాన్స్‌ఫార్మేషన్‌తోపాటు.. వృద్ధికి సహకరించనుంది. లండన్‌లో జరిగిన వాటా కొనుగోలు ఒప్పందం ప్రకారం జేవీలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ 35 శాతం వాటాను పొందనున్నట్లు తెలుస్తోంది. దేశీ వినియోగదారునిపై దృష్టితో నవతరం టెక్నాలజీ, ప్రొడక్టుల ద్వారా మొబిలిటీ సొల్యూషన్స్ అందించేందుకు జేవీకి ఎస్ఏఐసీ మద్దతివ్వనుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేయనున్న జేవీలో జేఎస్‌డబ్ల్యూ 35 శాతం వాటా తీసుకోనుందా లేక ఎస్ఏఐసీ మోటార్ సొంత అనుబంధ సంస్థ ఎంజీ మోటార్ ఇండియాలో పొందనుందా అనే విషయంపై రెండు కంపెనీల నుంచీ స్పష్టతలేకపోవడం గమనార్హం. ఒకప్పటి బ్రిటిష్ బ్రాండ్ ఎంజీ మోటార్‌ను ప్రస్తుతం షాంఘై దిగ్గజం ఎస్ఏఐసీ మోటార్ సొంతం చేసుకుంది. కాగా.. రానున్న ఐదేళ్ల కాలపు ప్రణాళికలో భాగంగా దేశీ కంపెనీలకు 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను ఆఫర్ చేయనున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది. తదుపరి దశ వృద్ధికి వీలుగా ఎంజీ మోటార్ నిధుల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. -
అడిడాస్ సంచలన నిర్ణయం..! ఫేస్‌బుక్‌కు పెద్ద దెబ్బే..!
జపాన్ స్పోర్ట్స్ షూ మేకింగ్ దిగ్గజం అడిడాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌తో పోటాపోటీగా సొంతంగా మెటావర్స్ టెక్నాలజీని డెవలప్ చేసే పనిలో పడింది. దీంతో పాటు అమెరికాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్ఛేంజ్ సంస్థ కాయిన్ బేస్‌తో చేతులు కలిపింది. ఈ ఒప్పొందంపై అడిడాస్ ట్విట్ చేయగా... కాయిన్ బేస్ స్పందించింది. హ్యాండ్ షేక్ ఎమోజీని రీట్వీట్ చేస్తూ డీల్‌ను కాన్ఫాం చేసింది. ఇకపై ఈ రెండు సంస్థలు కలిపి క్రిప్టో కరెన్సీపై ట్రేడింగ్ నిర్వహించనున్నాయి. ఫేస్బుక్(మెటా) అధినేత మార్క్ జుకర్ బెర్గ్ మెటావర్స్ టెక్నాలజీపై వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే టెక్నాలజీని పలు దిగ్గజ కంపెనీలు సైతం డెవలప్ చేసే పనిలో పడ్డాయి. తాజాగా కు చెందిన అడిడాస్ 'అడివెర్స్' పేరుతో మొబైల్ గేమింగ్ సంస్థ 'శాండ్ బాక్స్'తో కలిసి మెటావర్స్‌పై పనిచేస్తున్నట్లు నవంబర్ 22న ట్వీట్ చేసింది. ఇక అడిడాస్ రాకతో మెటావర్స్‌పై వర్క్ చేస్తున్న ఫేస్‌బుక్‌కు పోటీ పెరగనుంది. ఇప్పటికే మైక్రోసాప్ట్, గూగుల్, ఆలిబాబా వంటి సంస్థలు మెటావర్స్‌పై పనిచేస్తుండగా..ఆ కంపెనీల బాటలో అడిడాస్ చేరినట్లైంది. శాండ్బాక్స్ శాండ్బాక్స్ ప్లే టు ఎర్న్ బ్లాక్‌చెయిన్ గేమ్. డిజిటల్ ఆస్తులను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అనుమతిస్తుంది. శాండ్ యుటిలిటీ టోకెన్ ప్లాట్‌ఫారమ్‌లో లావాదేవీలను సులభతరం చేస్తుంది. కాగా ఏడాది నుంచి ఇప్పటి వరకు శాండ్ బాక్స్ వ్యాల్యూ 15,000శాతానికి పైగా పుంజుకుంది. దీంతో మార్కెట్ క్యాపిటల్ వ్యాల్యూ $4.8 బిలియన్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
చోళ ఎంఎస్‌లో మరో 14% వాటా అమ్మకం
► జపాన్ భాగస్వామ్య సంస్థకు విక్రయించనున్న మురుగప్ప గ్రూప్ ► ఒప్పందం విలువ రూ.883 కోట్లు.. చెన్నై: చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో మరో 14 శాతం వాటాను భాగస్వామ్య సంస్థకు విక్రయించేందుకు మురుగప్ప గ్రూపునకు చెందిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ డెరైక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం విలువ రూ.882.68 కోట్లుగా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. జపాన్‌కు చెందిన మిత్సుయ్ సుమిటోమో ఇన్సూరెన్స్(ఎంఎస్ఐ) కంపెనీతో కలిపి చోళ ఎంఎస్ జాయింట్ వెంచర్(జేవీ)ను మురుగప్ప గ్రూప్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జేవీలో ఎంఎస్ఐకి 26 శాతం వాటా ఉంది. తాజా 14 శాతం కొనుగోలుతో ఇది 40 శాతానికి చేరనుంది. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) పరిమితిని కేంద్రం 26 శాతం నుంచి 49 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.