రెండు తరాలకు రక్షణ..!
ఒట్టి మనిషికి ఇన్ఫెక్షన్ వస్తే ఒక్కరికే జబ్బు. కానీ గర్భవతికి ఇన్ఫెక్షన్ వస్తే అది ఇద్దరు వ్యక్తులకు వచ్చిన రుగ్మతతో సమానం. అందుకే కాబోయే అమ్మకు ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకుంటున్నామంటే రెండు తరాలను రక్షిస్తున్నామని అర్థం. కాబట్టే గర్భవతికి వచ్చే ఇన్ఫెక్షన్లు... వాటి నుంచి రక్షించుకునే మార్గాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. అలా తెలుసుకోవడానికి ఉపయోగపడేదే ఈ ప్రత్యేక కథనం.
గర్భవతికి ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయి?
మిగతావారిలాగే గర్భణికీ ఇన్ఫెక్షన్లు పలు మార్గాల నుంచి సోకే అవకాశం ఉంది. ఒక వ్యక్తి నుంచి మరొకరికి, జంతువుల నుంచి, దోమల వంటి కీటకాలు, కలుషితమైన కొన్ని రకాల ఆహారాల వంటి వాటి నుంచి కూడా గర్భిణికి ఇన్ఫెక్షన్లు రావచ్చు.
గర్భవతిని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవడం ఎందుకు?
ఒకవేళ గర్భవతికి ఇన్ఫెక్షన్లు వస్తే సమస్య రెట్టింపు అయినట్లే భావించాలి. ఎందుకంటే అది వారిలో
సాధారణ మహిళలతో పోలిస్తే సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. అది కాబోయే తల్లికి ప్రమాదం మాత్రమే కాదు... వారికి చికిత్స చేయడమూ కష్టమే.
కేవలం తల్లికి మాత్రమే పరిమితం కాకుండా బిడ్డకూ సంక్రమించవచ్చు.
పుట్టిన తర్వాత చిన్నారికీ ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తీసుకురావచ్చు.
అందుకే సాధారణ మహిళతో పోలిస్తే ఇన్ఫెక్షన్ల విషయంలో గర్భవతికి రెండింతలు జాగ్రత్త అవసరం.
ఏయే ఇన్ఫెక్షన్లు తల్లికీ,బిడ్డకూ సమస్యగా పరిణమిస్తాయి?
చాలా రకాల ఇన్ఫెక్షన్లు అటు తల్లికీ, ఇటు బిడ్డకూ... ఇలా ఇరువురికీ సమస్యగా పరిణమించవచ్చు. సాధారణ ఇన్ఫెక్షన్లతో పోలిస్తే ఇద్దరికీ ప్రమాదకరంగా మారే కొన్ని ఇన్ఫెక్షన్ల జాబితా ఇది.
సైటోమెగాలోవైరస్ అనే ఇన్ఫెక్షన్ను సంక్షిప్తంగా ‘సీఎమ్‌వీ’ అని పిలుస్తారు. ఇది సెక్స్, లాలాజలం, మూత్రం, ఇతర శరీర ద్రవపదార్థాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సీఎమ్‌వీ సోకినవారిలో జ్వరం, గొంతు బొంగురుపోవడం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఇతర ఇన్ఫెక్షన్ పచ్చిమాంసాన్ని తిన్నప్పుడు లేదా ఇంట్లో పెంపుడు పిల్లులు ఉండి, వాటి తాలూకు వ్యర్థాలను తీసివేసినప్పుడు రావచ్చు.
పర్వోవైరస్ అనే ఇన్ఫెక్షన్ను ఫిఫ్త్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇది వచ్చిన వారిలో ముఖంపైనా, ఛాతీమీద, వీపు, భుజాలు, కాళ్లపై ర్యాష్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో కీళ్లనొప్పులు, ఒంటినొప్పులు కనిపిస్తాయి. పర్వోవైరస్ ఉన్నవారి దగ్గరకు వెళ్లివచ్చిన తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే మీ డాక్టర్ సంప్రదించాలి.
లిస్టేరియా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం, చలి, వెన్నునొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది చెడిపోయిన ఆహారం తీసుకోవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఒక్కోసారి మనకు ఆహారం చెడిపోయిందన్న విషయమే తెలియక తీసుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. అందుకే డాక్టర్లు గర్భవతిని పచ్చిపాలు, సాఫ్ట్చీజ్, శాండ్విచ్ వంటి వాటి కోసం పొరలుపొరలుగా కోసిన మాంసం (డెలీ మీట్) వంటివి తీసుకోవద్దని చెబుతారు.
గర్భిణి తీసుకోవలసిన / తెలుసుకోవలసిన వ్యాక్సిన్లు ఇవి...
ఒక మహిళ తాను గర్భవతినని తెలియగానే తనకు వచ్చే అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్ల గురించి, తాను తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఈ వ్యాక్సిన్ల వల్ల గర్భివతికి చాలా తీవ్రంగా పరిణమించగల కొన్ని ఇన్ఫెక్షన్లను ముందుగానే ప్రభావపూర్వకంగా నివారించడం సాధ్యమవుతుంది. పైగా ఆ సమయంలో వీటిని తీసుకోవడం గర్భవతికి పూర్తిగా సురక్షితం కూడా. గర్భిణి తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవి...
ఇన్ఫ్లుయెంజా (ఫ్లూ) వ్యాక్సిన్ : ఫ్లూ వల్ల గర్భవతిలో జ్వరం, చలిగా ఉండటం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతుబొంగురుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భవతి విధిగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. సాధారణ ప్రజలు కూడా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదే.
టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్ : టెటనస్ వచ్చిన రోగిలో కండరాలు చాలా అసాధారణంగా ప్రవర్తిస్తాయి. డిఫ్తీరియా వస్తే గొంతులోపల వెనక భాగంలో ఒక మందపాటి పొరగా ఏర్పడవచ్చు. ఇలా జరిగినప్పుడు అది శ్వాస సమస్యలకు కారణమవుతుంది. ఇక పెర్టుసిస్ను ‘కోరింత దగ్గు’ అని కూడా పిలుస్తాయి. ఈ మూడు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోడానికి గర్భవతి విధిగా డీపీటీ వ్యాక్సిన్ తీసుకోవాలి.
ప్రతిసారీ గర్భధారణలో మహిళలందరూ తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు...
ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాక్సిన్ : గర్భవతులకు ఫ్లూ వ్యాధి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అందుకే ప్రతి సీజన్లో మహిళలందరూ దీన్ని తీసుకోవడంతో పాటు, గర్భవతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక గర్భధారణ సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల పిండంపై పడే దుష్ర్పభావం గురించి అధ్యయనాలు లేనప్పటికీ గర్భం ధరించి ఉన్నప్పుడు తీసుకుంటే బిడ్డ పుట్టాక మొదటి ఆర్నెల్లపాటూ చిన్నారికీ అది రక్షణ ఇస్తుందని ఒక ఊహ. ఇక ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను ముక్కుతో పీల్చడం ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ ఈ తరహా ముక్కుతో పీల్చే వ్యాక్సిన్‌ను లైవ్వైరస్తో తయారు చేస్తారు కాబట్టి గర్భవతులు మాత్రం ఈ తరహా పీల్చే వ్యాక్సిన్‌ను వాడకూడదు.
టెటనస్, డిఫ్తీరియా, పెర్టుసిస్ (డీపీటీ) వ్యాక్సిన్ : టీ డాప్ అంటూ సంక్షిప్తంగా పిలిచే ఈ వ్యాక్సిన్‌ను గర్భధారణ జరిగిన ప్రతిసారీ తీసుకోవాలి. దీన్ని గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు తీసుకోవాలి. ఇక 27వ వారం నుంచి 36వ వారం మధ్యలో తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల పుట్టిన చిన్నారికి కూడా ఆయా వ్యాధుల నుంచి కొంతకాలం పాటు రక్షణ లభిస్తుంది.
ఇన్ఫెక్షన్లను తప్పించు కోవడానికి ఏ జాగ్రత్తలు పాటించాలి?
ఇన్ఫెక్షన్లు వచ్చే పలు మార్గాల గురించి అవగాహన పెంచుకుంటే వాటిని రాకుండానే నివారించుకునే అవకాశం ఎక్కువ. గర్భవతి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి... తరచూ చేతులు కడుక్కుంటూ ఉండాలి. ముఖ్యంగా వంట చేసే ముందు, బాత్రూమ్ నుంచి బయటికి వచ్చాక, డయాపర్స్ మార్చాక, తోటపని చేశాక, చెత్త లేదా జంతువుల వ్యర్థాలను తాకిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి.
బట్టలను ఉతికిన తర్వాత, పెంపుడు జంతువులను తాకాక, చిన్నపిల్లల ఆటవస్తువులను స్పర్శించాక తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి.
స్నేహితులతో ఆహారాలను కలిసి తీసుకునే సమయంలో ఎంగిలి పదార్థాలను తీసుకోకూడదు. గర్భవతి తన ప్లేట్లు, పాత్రలు, స్పూన్ల వంటి ఉపకరణాలను వేరుగా ఉంచుకోవడమే మేలు.
ఆహారం కలుషితం కాకుండా చూసుకుంటూ పరిశుభ్రమైన వాటినే తీసుకోవాలి.
దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ఒళ్లంతా కప్పేలా దుస్తులు ధరించడం మేలు. బగ్ స్ప్రేలను ఉపయోగించవచ్చు. అయితే వాటి ఘాటైన వాసన పోయే వరకు ఆ గది నుంచి దూరంగా ఉండాలి. వాసన ఘాటు తగ్గాకే గదిలోకి వెళ్లాలి.
సెక్స్ సమయంలో తప్పనిసరిగా జీవిత భాగస్వామి కండోమ్ వాడేలా చూసుకోవాలి. ఎందుకంటే అతడినుంచి గర్భవతికి ఇన్ఫెక్షన్లు సోకవచ్చు.
దూరప్రాంతాలకు, ఇతర దేశాలకు ప్రయాణం చేసే సమయంలో ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు వ్యాపించి లేవని నమ్మకంగా తెలిశాకే ప్రయాణం పెట్టుకోవాలి.
ఎలుకల నుంచి ఎంత దూరం ఉంటే అంత మేలు.
వృత్తిపరంగానూ / పిల్లలతోనూ జాగ్రత్త
వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) : గర్భం ధరించాక మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తి నుంచి వ్యక్తికి సాంక్రమిక ఇన్ఫెక్షన్లు వ్యాపించవచ్చు కాబట్టి... ముద్దుపెట్టడం, సెక్స్‌లో పాల్గొనడం వంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తిపరంగా వైద్యులు లేదా వ్యక్తుల రక్తం లేదా శరీర ద్రవపదార్థాలతో (లాలాజలం, మూత్రం వంటివి) డీల్ చేసే నర్సుల వంటి వృత్తుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆ ద్రవపదార్థాలను కళ్లకు, ముక్కుకు, నోటికి సోకకుండా జాగరూకత వహించాలి. ఇలాంటి సందర్భాల్లో గ్లౌవ్స్ ధరించడం, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఆహారం, పానీయాలను షేర్ చేసుకోకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక తమకు మరో చిన్న బిడ్డగానీ లేదా స్కూల్‌కు వెళ్లే వయసు పిల్లలు గానీ ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తమ ఒక్కరికే కాకుండా పిల్లలనూ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడినవారవుతారు. ఇక ఈ పిల్లలు స్కూల్ నుంచి/బయటి నుంచి రాగానే తమను తాకకుండా చూసుకోవాలి. వాళ్లు కాళ్లూ చేతులు కడుక్కుని వచ్చాకే దగ్గరికి రానివ్వాలి. ఎందుకంటే స్కూల్/డేకేర్ సెంటర్స్/ఆటస్థలాలనుంచి రాగానే వాళ్ల చేతుల్లో హానికరమైన ఇన్ఫెక్షన్ను కలిగించే కారకాలు (ఉదా: సైటోమెగాలోవైరస్ వంటివి) ఉండవచ్చు. ఇవి చిన్నపిల్లల్లో దగ్గరే ఎక్కువ కాబట్టే ఈ జాగ్రత్త. ఇంట్లో పెంపుడు పిల్లులు ఉంటే వాటి వ్యర్థాలను తాకకూడదు. ఒకవేళ తాకాల్సి వస్తే తప్పనిసరిగా గ్లౌవ్స్ ధరించాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
గర్భవతికి ఇతర ఇన్ఫెక్షన్లు ఉంటే...
గ్రూప్-బి స్ట్రెప్టోకాకస్ : చాలామంది మహిళలకు ఈ గ్రూప్-బి స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా అవి పుట్టిన చిన్నారికి సోకే అవకాశం ఉంది. దాంతో నవజాతశిశువుకు అది ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అందుకే ప్రసవం అయ్యే కొద్దివారాల ముందు డాక్టర్లు గర్భవతికి ఈ బ్యాక్టీరియా ఉందా, లేదా అని పరీక్ష చేస్తారు. ఇకవేళ ఉంటే ప్రసవానికి ముందరే తగిన యాంటీబయాటిక్స్ వాడతారు.
జెటెనల్ హెర్పిస్: కొంతమంది మహిళలకు తమ మర్మావయవాల వద్ద హెర్పిస్ ఉంటే బిడ్డ పుట్టే సమయంలో అది పాపాయికీ సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి మర్మావయవాల వద్ద చీరుకుపోయినట్లుగా (హెర్పిస్ ఉన్నట్లు) అనుమానిస్తే డాక్టర్ ఈ విషయాన్ని చెప్పాలి. అప్పుడు డాక్టర్ ప్రసవానికి ముందే కొన్ని మందులు ఇచ్చి ప్రసవ సమయంలో గర్భవతికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూస్తారు.
హెచ్ఐవీ: ఒకవేళ కాబోయే తల్లికి హెచ్ఐవీ ఉంటే అది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి హెచ్ఐవీ ఉన్నట్లు తెలిస్తే తప్పనిసరిగా డాక్టర్ ఆధ్వర్యంలో మందులు వాడాల్సి ఉంటుంది. దీంతో తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ సోకే అవకాశాన్ని గణనీయంగా తగ్గించే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యగమనిక: ఇంట్లో గర్భవతి మాత్రమే గాక... మిగతా కుటుంబ సభ్యులంతా ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలో అవన్నీ తగిన సమయానికి తీసుకోవాలి. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటే గర్భవతికీ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు చాలా తక్కువ.
చేతులు కడుక్కోవడం ఎలా?
ఆరోగ్యకరమైన రీతిలో చేతులు కడుక్కోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి...
సబ్బు రాసుకున్న తర్వాత మీ చేతులు రెండింటినీ ఒకదానికొకటి కనీసం 15 నుంచి 30 సెకన్ల పాటు రుద్దుకుంటూ ఉండాలి.
చేతుల్ని సబ్బుతో శుభ్రపరచుకునే సమయంలో మీ మణికట్టు వరకూ శుభ్రపడేలా చూసుకోవాలి. దాంతోపాటు మీ గోళ్లు, వేళ్ల మధ్యన ఎలాంటి మురికీ లేకుండా శుభ్రమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి.
రెండు అరచేతులనూ నురగ వచ్చేలా సబ్బుతో రుద్దుకోవాలి.
చేతులు కడుక్కున్న తర్వాత విధిగా టవల్‌తో చేతుల్ని పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి.
చేతులు కడుక్కోవడానికి ఆల్కహాల్ ఉండే జెల్ అయితే మంచిది. ఇది సూక్ష్మజీవులన్నింటినీ తొలగించేలా చేతుల్ని శుభ్రపరుస్తుంది. ఇప్పుడు ఈ తరహా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్‌వాష్‌లు మీ హ్యాండ్‌బ్యాగ్‌లో పట్టేంత సైజుల్లోనూ లభ్యమవుతున్నాయి. వీటిని ఎప్పుడూ దగ్గరుంచుకోవాలి. ఒకవేళ చేతులు దుమ్ముతో మురికిపట్టినప్పుడు మాత్రం మురికిపోయేలా సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవాలి.
చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు అవి ఆనే చోట్లు... డోర్నాబ్స్, కాలింగ్బెల్స్ వంటి ప్రదేశాలూ శుభ్రంగా ఉంచుకోవాలి.
కీటకాలతో జాగ్రత్త
చాలారకాలైన ఇన్ఫెక్షన్లు... ఉదాహరణకు డెంగ్యూ, మలేరియా వంటివి దోమల నుంచి వ్యాప్తిచెందుతాయి. అందుకే గర్భవతులు దోమకాటు నుంచి తమను తాము రక్షించుకుంటూ ఉండాలి. దీనికోసం ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు వాడటం మేలు. ఇక ఇంట్లో ఉన్నప్పుడు దోమతెరలు వాడాలి. బయటికి వెళ్తున్నప్పుడు ‘డీట్’ ఆధారిత కీటక నాశనుల(ఇన్సెక్ట్ రిపెల్లెంట్స్)ను వాడాలి. ఇటీవల ఈ ‘డీట్’ ఆధారిత కీటక నాశనులు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ ‘డీట్’ ఆధారిత ఉత్పాదనలలో 10 నుంచి 35 శాతం ‘డీట్’ ఉన్న కీటక నాశనులు లభ్యమవుతున్నాయి. డాక్టర్ సిఫార్సు మేరకు వాటిని తీసుకుని వాడితే వాటి వల్ల గర్భవతులకు గాని / పాలిచ్చే తల్లులకు గాని ఎలాంటి ప్రమాదం ఉండదు (డీట్ అంటే... ఎన్ ఎన్ డై ఇథైల్ మెటా టాల్వమైడ్ అనే రసాయనానికి సంక్షిప్త రూపం. పసుపురంగులో చిక్కటి ద్రవంలా ఉండే దీన్ని రాసుకుంటే ఇది వ్యక్తులకు హాని కలిగించకుండా కీటకాలను దూరం చేస్తుంది).
వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?
వాస్తవానికి వ్యాక్సిన్‌లో నిర్వీర్యం చేసిన రోగ కారక క్రిమి గానీ లేదా చనిపోయిన రోగ కారక క్రిమి ఉంటుంది. దీన్ని ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో ప్రవేశపెట్టడం వల్ల రోగ కారక క్రిమిని ఎదుర్కోడానికి తగిన వ్యాధినిరోధకత శరీరంలో పుడుతుంది. మన శరీరంలోకి ప్రవేశపెట్టిన నిర్వీర్యమైన/చనిపోయిన క్రిమి ఎలాగూ జబ్బును కలగజేయదు. పైగా దీన్ని ప్రవేశపెట్టగానే దాంతో పోరాడే యాంటీబాడీలు మన శరీరంలో పుడతాయి. ఒకసారి ఆవిర్భవించిన ఆ యాంటీబాడీలు వ్యాధి కారకాన్ని గుర్తుంచుకుని, మళ్లీ అవి ఎప్పుడు శరీరంలో ప్రవేశించినా, దాన్ని ఎదుర్కొంటాయి. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తిని తాను తీసుకున్న వ్యాధి వ్యాక్సిన్ కారణంగా సదరు జబ్బు నుంచి రక్షణ కలుగుతుందన్నమాట.
ఇవ్వకూడని వ్యాక్సిన్
జోస్టర్ వ్యాక్సిన్‌ను గర్భవతికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది జీవించి ఉండే వైరస్‌తో తయారు చేసే వ్యాక్సిన్ కాబట్టి. సాధారణంగా దీన్ని 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి సిఫార్సు చేస్తుంటారు. ఆ సమయానికి గర్భధారణ వయసు ఎలాగూ మించిపోతుంది కాబట్టి దీని ప్రభావం గర్భధారణపై ఉండటానికి సాధారణంగా ఆస్కారం ఉండదు.
గర్భం దాల్చడానికి ముందుగానే ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలి?
గర్భం ధరించడానికి సిద్ధమవుతున్న మహిళలు తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోగానే కొన్ని వ్యాక్సిన్లను విధిగా తీసుకోవాలి. అవి... మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్‌పాక్స్ వ్యాక్సిన్లు. గర్భం దాల్చిన తర్వాత ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం గర్భవతికి ప్రమాదం. ఒకవేళ వ్యాధి నిరోధకత అంతగా లేని గర్భవతికి ఈ ఇన్ఫెక్షన్లు సోకితే అది చాలా ప్రమాదకరంగా పరిణమించేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీటిని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకన్నప్పుడు ఇంకా గర్భం దాల్చకముందరే తీసుకోవడం మేలు.
ఒకవేళ మీజిల్స్, మంప్స్, రుబెల్లా (ఎమ్ఎమ్ఆర్): ఈ వ్యాక్సిన్ చిన్నప్పుడే రొటిన్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్నారా లేదా అనే సందేహం ఉంటే మీ డాక్టర్‌తో చెప్పాలి. అప్పుడు వారు ఒక రక్తపరీక్ష ద్వారా మీరు ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారా, లేదా అన్నది నిర్ధారణ చేస్తారు. దాన్ని బట్టి అవసరమైతే ఆ వ్యాక్సిన్ ఇస్తారు. ఎమ్ఎమ్ఆర్ వ్యాక్సిన్ తీసుకోని మహిళలకు గర్భం దాల్చాక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో గనక ఆ వ్యాధులు సోకితే గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇక రుబెల్లా వైరస్ గనక అర్లీ ప్రెగ్నెన్సీ సమయంలో సోకితే అది బిడ్డలో పుట్టుకతోనే వచ్చే తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. రుబెల్లా వైరస్ సోకవడం వల్ల పుట్టిన బిడ్డలకు వినికిడి సమస్యలు, కళ్లు, గుండె, మెదడు సమస్యల వంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ.
వారిసెల్లా (చికెన్‌పాక్స్) వైరస్: ఈ గర్భవతికి సోకడం వల్ల (ముఖ్యంగా అర్లీ ప్రెగ్నెన్సీలో) బిడ్డలో పుట్టుకతోనే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న రక్తపరీక్ష ద్వారా గర్భిణి గతంలోనే చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి గర్భం ధరించాలనుకునే వారు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందరే ఈ పరీక్ష చేయించుకుని, ఒకవేళ చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ తీసుకుని ఉండకపోతే గర్భం దాల్చడానికి నెల రోజుల ముందే దాన్ని తీసుకోవడం మేలు.
హ్యూమన్ పాపిలోమా వైరస్: హెచ్‌పీవీ అని సంక్షిప్తంగా పిలిచే ఈ వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను అమ్మాయిలు తమ తొమ్మిదో ఏటి నుంచి 26 ఏళ్ల వయసు మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే గర్భం దాల్చకముందే దీన్ని తీసుకోవాలి.
కొందరు గర్భవతులు నిర్దిష్టంగా వాడాల్సిన వ్యాక్సిన్లు
కొంతమంది గర్భవతులకు కొన్ని అంశాల నుంచి ఎక్కువ ప్రమాదం (హైరిస్క్) ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరంగా దూరప్రయాణాలు చేయాల్సిన వారు ఈ గ్రూపునకు చెందుతారు. ఇలాంటి వారు వారి పరిస్థితికి అనుగుణంగా మరికొన్ని అదనపు వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన ఉంటుంది. అవి...
హెపటైటిస్ బి వ్యాక్సిన్ : హెపటైటిస్ బి వైరస్ చాలా తీవ్రమైనది. ఇది కాలేయానికి ఇన్ఫ్లమేషన్ కలగజేస్తుంది. అందుకే దీన్ని నివారించడానికి ఇప్పుడు బిడ్డ చిన్నతనంలోనే వరసగా మూడు మోతాదుల వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ వ్యాక్సిన్ తీసుకోని వారు చాలామందే ఉన్నారు. ఇలా వ్యాక్సిన్ తీసుకోని గర్భవతులు తప్పనిసరిగా దీన్ని తీసుకోవాలి.
న్యూమోకాకస్ వ్యాక్సిన్ : న్యూమోకాక్సీ అనేది ఒక రకం బ్యాక్టీరియా. దీని వల్ల నిమోనియాతో పాటు మరెన్నో ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఉదాహరణకు ఒటైటిస్ (చెవి ఇన్ఫెక్షన్స్), మెనింజైటిస్ (మెదడువాపు) వంటివి. కొందరు హైరిస్క్ మహిళలకు న్యూమోకాకల్ ఇన్ఫెక్షన్స్ సోకకుండా ఈ వ్యాక్సిన్ వాడాలి.
ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ : ఇది దోమల ద్వారా వ్యాపించే ఒక రకం వైరల్ జ్వరం. మన దేశంలో లేకపోయినా ఈ వ్యాధి దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని సహారా ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉంది. గర్భధారణ సమయంలో వృత్తిపరంగా ఆయా దేశాలకు వెళ్లాల్సి వస్తే, వీలైతే ఆ ప్రయాణాలను మానుకోవడం మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా దేశాలకు వెళ్లాల్సిన మహిళలు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇందుకోసం సాంక్రమిక వ్యాధుల (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)కు చికిత్స చేసే నిపుణుల ఆధ్వర్యంలో తీసుకోవడం మంచిది.
ఇతర ఇమ్యూనైజేషన్ ప్రక్రియలు : పైన పేర్కొన్న వ్యాక్సిన్లతో పాటు పరిస్థితులను బట్టి, వారి వారి వ్యక్తిగత వృత్తి వ్యవహారాలను బట్టి మరికొన్ని ఇతర వ్యాక్సిన్లను తీసుకోవడం కూడా అవసరం కావచ్చు. ఉదాహరణకు కలరా, మెనింగోకోకస్, రేబీస్, జపనీస్ ఎన్కెఫలైటిస్, టైఫాయిడ్, హీమోఫీలస్ ఇన్ఫ్లుయెంజా బీ వంటి వ్యాక్సిన్లు. మీ గురించి పూర్తిగా తెలిసిన మీ డాక్టర్ మీ వ్యక్తిగత, వృత్తిగత అవసరాలను బట్టి ఆయా వ్యాక్సిన్లు మీకు అవసరమో, కాదో నిర్ణయించి, అవి మీకు ఇస్తారు.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి