కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడులు
10,400 లీటర్ల నూనె స్వాధీనం
హైదరాబాద్: పాతనగరం అడ్డాగా కల్తీ నూనెల తయారీపై సెప్టెంబరు 18న ‘సాక్షి’ దినపత్రికలో ‘కల్తీ రాజ్యం!’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఎట్టకేలకు ఎస్ఓటీ పోలీసులు స్పందించారు. సోమవారం జల్పల్లి గ్రామ శివారులో పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న ఓ కేంద్రంపై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. దుర్గంధపూరిత జంతుకళేబరాల నుంచి ఇక్కడ నూనె తీసి... నగరంలోని కొన్ని పాస్ట్ఫుడ్ సెంటర్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు శంషాబాద్ ఎస్వోటీ ఎస్ఐ లాల్ మజ్హర్ తెలిపారు.
ప్రహారీ ఉన్న ఓ ప్రైవేట్ స్థలాన్ని అద్దెకు తీసుకున్న సలీం, అఫ్రోజ్లు... ఈ దందా సాగిస్తున్నారు. పశు వధశాలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సేకరించిన కొవ్వును వీరు భారీ కడారుులలో ఉడికించి నూనె తయారు చేస్తున్నారు. దీన్ని 200 లీటర్ల సామర్థ్యంగల డ్రమ్ముల్లో నింపి నగరంలోని పలు ఫాస్ట్ఫుడ్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. తయారీ కేంద్రంలో పనిచేస్తున్న ఎనిమిది మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు రాయల్ కాలనీలో ఉండే బర్మా శరణార్థులు.
52 డ్రమ్ముల్లోని 10,400 లీటర్ల నూనె, 8 టన్నుల కొవ్వు, డీసీఎం వ్యాన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. కల్తీ నూనె తయారీలో ఇప్పటికే రెండు సార్లు అరెస్టయిన నిర్వాహకులు ఎప్పటికప్పుడు తమ అడ్డా మార్చుకుంటూ దందా కొనసాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.