వివరాలు చెప్తే ఖర్చు భరించాల్సిందే!
=పటక్పూర్ గ్యాంగ్స్ విచిత్ర కట్టుబాటు
=చిక్కిన వారు చెప్పేవి తప్పుడు వివరాలే
=పింటు అసలు పేరు టింకు
=ముఠా సభ్యులంతా ఇతడి బంధువులే
సాక్షి, సిటీబ్యూరో: అది పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్గురి జిల్లా ఫతేపుకార్ గ్రామం... నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న ఆ గ్రామంలో పటక్పూర్ గ్యాంగ్స్‌గా పిలిచే నేరగాళ్లు నివసించే ‘ఖరీదైన ’ బస్తీ ఉంది. ఆ ప్రాంతానికి పోలీసులు వెళ్తే సీన్ మారిపోతుంది... మహిళలు కారం పొడి, పురుషులు మారణాయుధాలతో చుట్టుముడతారు... పోనీ బయటకు వచ్చాక పట్టుకున్నా ఫలితం శూన్యం... చిక్కిన నిందితుడు తన పేరుతో సహా అన్నీ తప్పుడు వివరాలే చె ప్తాడు... నిజాలు చెప్పి వేరే నిందితుల అరెస్టుకు కారకుడైతే వారికి సంబంధిం చిన ‘ఖర్చు’ అంతా అతడే భరించాలి... ఈ విచిత్ర కట్టుబాటు పటక్పూర్ గ్యాంగ్స్‌లో ఉంది. ఈ ప్రాంతంలోనే నగర పోలీసు బృందం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. పింటుగా చె ప్పుకున్న నేరగాడి ముఠా సభ్యులు దొరకకున్నా.. వీరికి సహకరిస్తున్న వ్యక్తిని పట్టుకోవడంతో పాటు కీలక సమాచారం సేకరించి నగరానికి తిరిగి వచ్చింది.
నేతలు అంగీకరిస్తేనే నిందితుల అరెస్టు...
బ్యాంకుల నుంచి డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వారినే టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్న పటక్పూర్ ముఠా సూత్రధారి పింటును ఈనెల 3న పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు నగరంలో 2011 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 31 నేరాలు చేసి రూ.రెండు కోట్లకు పైగా తస్కరించారు. ముఠా సభ్యులంతా పరారీలో ఉండటంతో వారిని పట్టుకోవడానికి ఈనెల 8న సీసీఎస్, పంజగుట్ట పోలీసులతో కూడిన ప్రత్యేక బృందం వెళ్లింది. నలుగురు ఇన్స్పెక్టర్లతో సహా 20 మంది ఉన్న ఈ టీమ్ తొలుత స్థానిక పోలీసుల్ని కలిసి సహాయం కోరింది.
నిందితుల్ని పట్టించాలంటే అక్కడి రాజకీయ నాయకుల అనుమతి తప్పనిసరని వారు చెప్పడంతో అవాక్కైంది. అదనపు కమిషనర్ (నేరాలు) సందీప్ శాండిల్య, సీసీఎస్ డీసీపీ జి.పాలరాజు పశ్చిమ బెంగాల్‌కు చెందిన పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపడంతో స్థానిక పోలీసులు మన బృందానికి సహకరించేందుకు అంగీకరించారు. పోలీసులను చూసిన వెంటనే నిందితులు పారిపోతారని లేదా దాడి చేస్తారని చెప్పారు. అన్నింటికీ సిద్ధమైన సిటీ టీమ్ రైడ్‌కు ప్రణాళికలు సిద్ధం చేసింది. చోరీలు ద్వారా డబ్బు సంపాదించే ముఠాలున్న ఆ బస్తీలో అన్నీ ఖరీదైన ఇళ్లు, వాటిలో విలాసవంతమైన వస్తువులే.
వాహనాలపై ‘సర్వే’... ఐదు గంటల దాడి..
ఆ ప్రాంతం కొత్త కావడంతో నగర పోలీసులు మొదట ఆ బస్తీ మొత్తం సర్వే చేయాలని నిర్ణయించుకున్నారు. బైక్‌లపై హెల్మెట్లు పెట్టుకొని తిరుగుతూ బస్తీ మొత్తం పరిశీలించారు. అక్కడున్న నేరగాళ్ల ఇళ్లు, దొంగలు పా రిపోయేందుకు అవకాశం ఉన్న మార్గాలను గుర్తించి మ్యాప్స్ తయారు చేశారు. వాటిని విశ్లేషించాక స్థానిక పోలీసులతో కలిసి మెరుపుదాడి చేశారు. ఐదు గంటల పాటు ఏకదాటిగా సోదాలు చేసి ముఖేష్ అలియాస్ మిలావత్ ను పట్టుకున్నారు. ముఠాకు చెందిన మిగిలిన వారు అప్పటికే నేపాల్, బంగ్లాదేశ్ పారిపోవడంతో కీలక సమాచారం, కొన్ని సాక్ష్యాధారాలు మాత్రమే లభించాయి. 11 రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్‌ల్లోనూ సిటీ బృందం గాలించింది.
అసోం నుంచి ప్రీ యాక్టివేటెడ్ సిమ్స్...
ముందుగానే వేరొక వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయి, యాక్టివేషన్‌తో సిద్ధంగా ఉన్న సిమ్ కార్డుల్ని ప్రీ యాక్టివేటెడ్ కార్డులంటారు. ఇలాంటివి సేకరించి ముఠాకు అందించడమే మిలావత్ విధి. అసోంలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇలాంటి సిమ్ కార్డులు ఒక్కొక్కటి రూ.500 చొప్పున కొనుగోలు చేసి ఒక్కో ముఠాకు 40 నుంచి 50 వరకు అందిస్తుంటాడు. వీటిని కేవలం నేరం చేసే చోట మాత్రమే వాడటంతో నిందితులు చిక్కడం కష్టంగా మారుతుంది. పింటు గ్యాంగ్ కూడా వీటినే వాడింది. మిలావత్ విచారణతో పాటు రైడ్‌లో సేకరించిన ఆధారాలు పింటుకు సంబంధించిన అంశాల్ని వెల్లడించాయి. ఇతడి అసలు పేరు టింకుగా తేలింది. అరెస్టు సందర్భంలో పోలీసులకు చెప్పిన ప్రతి అంశం పోలీసుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి.
ముఠా సభ్యులు సైతం అదే బస్తీకి చెందిన ఇతడి సోదరులు, బంధువులుగా తేలింది. పటక్పూర్ గ్యాంగ్స్‌లో ఓ కట్టుబాటు ఉన్న కారణంగానే అలా తప్పుడు వివరాలు చెప్పానని పింటు అలియాస్ టింకు బయటపెట్టాడు. పోలీసులకు చిక్కిన నిందితుడు ఏమాత్రం నిజాలు చెప్పి వేరే వారు అరెస్టుకు కారణమైతే ఆ వ్యక్తి భారీ ఖర్చు భరించాలి. ఇతడిచ్చిన సమాచారంతో అరెస్టయిన నిందితుడి నుంచి రికవరీ చేసిన సొత్తు మొదలు బెయిల్, కేసు విచారణ తదితర ఖర్చులన్నీ భరించాల్సి ఉంటుంది. అందుకే తాను అబద్ధం చెప్పానని టింకు అంగీకరించాడు. ప్రస్తుతం మిలావత్ను విచారిస్తున్న సీసీఎస్ పోలీసులు పరారీలో ఉన్న ముఠా సభ్యుల వివరాలు ఆరా తీస్తున్నారు.