పార్టీ మారినా ఫలితం దక్కేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ దిగ్గజం కృష్ణతీరథ్ ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెకు బీజేపీ పటేల్‌నగర్ రిజర్వ్డ్ టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్ లిలోటియా, ఆప్ అభ్యర్థి హజారీలాల్ చౌహాన్‌ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొటున్నారు. 2013 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి ఆప్ అభ్యర్థి వీణాఆనంద్ గెలిచారు. కాంగ్రెస్ నేతగా కృష్ణతీరథ్కు ఈ నియోజకవర్గంలో బలమైన పునాదులు ఉన్నాయి. ఆమె మామ సోహన్‌లాల్ స్థానిక కాంగ్రెస్ దిగ్గజాల్లో ఒకరు. లాల్ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు. ఆదాయపన్ను శాఖలో అధికారిణిగా బాధ్యతలు నిర్వహించే తీరథ్ మామ రాజకీయ వారసత్వాన్ని అందుకుని కాంగ్రెస్ దళిత నేతగా ఎదిగారు.
మున్సిపల్ కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికయ్యారు. షీలాదీక్షిత్ సర్కారులో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పరాజయంతో తీరథ్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవితవ్యాన్ని పదిలం చేసుకోవడానికి బీజేపీలో చేరారు. అదేరోజు ఆ పార్టీ ఆమెను పటేల్ నగర్ అభ్యర్థిగా ప్రకటించింది. తీరథ్కున్న దళిత నేత ముద్ర తమకు లాభిస్తుందని బీజేపీ ఆశిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీ పేరుబలం తన విజయానికి తోడ్పడుతుందని తీరథ్ భావిస్తున్నారు. అయితే స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆమె నాయకత్వాన్ని అంగీకరించడానికి సుముఖంగా లేకపోవడంతో ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.