శ్మశాన స్థలం చూపండి
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: ఎన్నోరోజులుగా తాము శ్మశానం కోసం వాడుకుంటున్న స్థలంలో అంత్యక్రియలు చేయనివ్వక పోవడాన్ని నిరసిస్తూ మండలంలోని పాతూరు గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఏకంగా మృతదేహం తీసుకువచ్చి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించారు. స్థానికంగా చర్చనీయాంశమైన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని పాతూరు గ్రామానికి చెందిన కుమ్మరి కిష్టయ్య(80) గురువారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఎప్పటి నుంచో శ్మశానంగా ఉన్న గ్రామశివారులోని 255/256 సర్వేనంబర్లలో ఉన్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు కిష్టయ్య కుటుంబీకులు సిద్ధమయ్యారు. అయితే అందరూ శ్మశానంగా భావిస్తున్న స్థలం తమదనీ, తమ వద్ద పట్టా కూడా ఉందని గ్రామానికే చెందిన పుష్పలత ఆ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించ కూడదని వెల్లడించారు.
ఈ స్థలం తమదేనంటూ కోర్టులో కేసు కూడా వేశానని తెలిపారు. అంతేకాకుండా విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపారు. స్పందించిన రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని సర్వే నంబర్ 255/256 స్థలంపై వివాదం కోర్టులో ఉన్నందున అందులో ఎవరినీ ఖననం చేయకూడదని గ్రామస్తులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మృతుని కుటుంబీకులు...ఇదేం అన్యాయమని అధికారులను ప్రశ్నించారు. అయినా వారు సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న గ్రామస్తులంతా కిష్టయ్య మృతదేహాన్ని తీసుకుని మెదక్ ఆర్డీఓ కార్యాలయం వద్దకు వచ్చి బైఠాయించారు. సుమారు మూడు గంటల పాటు తమ ఆందోళన కొనసాగించారు. గ్రామంలోని శ్మశానవాటికలకు పట్టాలిస్తే మృతదేహాలను ఎక్కడ పూడ్చి పెట్టాలో చెప్పాలంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ విజయలక్ష్మి అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు.
ప్రస్తుతం అందరూ శ్మశానంగా భావిస్తున్న సదరు భూమికి సంబంధించిన పట్టా గ్రామానికే చెందిన ఆకుల పుష్పలత వద్ద ఉందనీ, ఆ భూమి తమదేనంటూ ఆమె కోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు 2014 జనవరి 24 వరకూ స్టే విధించిందన్నారు. అందువల్ల ఆ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. కోర్టు స్టే తీరిన తర్వాత సదరు భూమిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని అంతవరకూ మరోస్థలంలో అంత్యక్రియలు నిర్వహించుకోవాలని తహశీల్దార్ పాతూరు వాసులకు చెప్పారు. అయితే ఇందుకు వారు అంగీకరించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ సమయంలోనే అక్కడకు చేరుకున్న రూరల్ సీఐ కిషన్‌కుమార్, ఎస్ఐ వేణుకుమార్‌లు పాతూరు గ్రామస్తులను శాంతింపజేశారు. అనంతరం గ్రామ శివారులోనే మరోచోట 9 గుంటల ప్రభుత్వ భూమిని శ్మశానానికి వాడుకోవాలని తహశీల్దార్ సూచించటంతో వారంతా అక్కడినుంచి వెళ్లిపోయారు.