రోగి మానసిక స్థితి అర్థం చేసుకోవాలి
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: ఆధునిక వైద్యరంగంలో వైద్యులు,రోగుల మధ్య అవగాహన పెంపొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెంగళూరుకు చెందిన జయదేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ సెంటర్(జేఐసీఎస్ఆర్) డెరైక్టర్ డాక్టర్ సీఎన్ మంజునాథ్ అభిప్రాయపడ్డారు. స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆరో కార్డియాలజీ చైర్ గోల్డ్‌మెడల్ ఓరేషన్ సదస్సుకు డాక్టర్ మంజునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్యూట్ రుమాటిక్ ఫీవర్, మైట్రల్ స్టెనోసిస్ అండ్ బెలూన్ వాల్వ్ ప్లాస్టీ విధానంపై వైద్యులు మరింత అవగాహన పెంచుకోవాలని కోరారు. అదే క్రమంలో వైద్యులు రోగి జబ్బు గురించే కాకుండా వారి మానసిక స్థితిని కూడా అర్థం చేసుకుని వైద్యం అందించాలన్నారు. అనంతరం స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ మాట్లాడుతూ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదీ నిర్వహించే ఇలాంటి సదస్సులకు నిష్ణాతులైన నిపుణులను పిలిపించి, వారి అనుభవాలను వైద్యులకు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
కార్డియాలజీలో పలు అంశాలపై నిపుణులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం ద్వారా వైద్యుల్లో తలెత్తే అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. స్విమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ వనజ, రిజిస్ట్రార్ డాక్టర్ ఆంజనేయులు, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ యర్రమరెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతరం డాక్టర్ మంజునాథ్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహక దాత డాక్టర్ శ్యామలా శాస్త్రి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీ.సత్యనారాయణ, ఆర్ఎంవో డాక్టర్ వెంకట కోటిరెడ్డి, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శివకుమార్, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోబాకు భూపాల్ పాల్గొన్నారు.