నగరంలో ఈ-వైద్యం
రాష్ట్రంలోనే తొలిసారిగా 12వ డివిజన్లో ఏర్పాటు
నేడు ప్రారంభించనున్న మంత్రి కామినేని శ్రీనివాస్
30 రోగాలకు ఆన్లైన్లోనే చికిత్స
మందులు కూడా ఉచితంగా పంపిణీ
విజయవాడ సెంట్రల్ : అక్కడ డాక్టర్లు ఉండరు. కానీ, రోగులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్లైన్లోనే రోగాన్ని గుర్తించి మందులు పంపిణీ చేస్తారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా... జాతీయ పట్టణ ఆరోగ్య పథకం ద్వారా ఈ-వైద్య విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పటమట ఎన్ఎస్ఎం స్కూల్ ఏరియాలోని 12వ డివిజన్ అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఏర్పాటుచేసిన ఈ-వైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించనున్నారు. నగరపాలక సంస్థలో దీన్ని పెలైట్ ప్రాజెక్ట్‌గా ఎంపికచేశారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
ఈ-వైద్య కేంద్రం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇక్బాల్ ‘సాక్షి’కి తెలిపారు. పెలైట్ ప్రాజెక్ట్‌గా విజయవాడలో ఈ కేంద్రాన్ని ప్రభుత్వం ఎంపిక చేసిందని చెప్పారు. పనితీరును బేరీజు వేసి మరిన్ని ఈ-వైద్యం కేంద్రాలను ఏర్పాటుచేసే అవకాశం ఉందని వివరించారు. ఇక్కడకు వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు నిష్ణాతులైన వైద్యులు ఆన్లైన్లో అందుబాటులో ఉంటారని ఆయన చెప్పారు.
ఇలా పనిచేస్తుంది...
ఈ-కేంద్రంలో ఆన్లైన్ విధానంలోనే రోగులకు వైద్యసేవలు అందిస్తారు. ఇక్కడ క్వాలిఫైడ్ ఏఎన్ఎం ఉంటారు. ఆన్లైన్లో జనరల్ ఫిజీషియన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు.ఈ కేంద్రానికి వచ్చే రోగుల పేరు, చిరునామా, ఆధార్ కార్డు నంబర్ అంతా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో ఉన్న వైద్యులకు పంపిస్తారు.కంప్యూటర్ స్క్రీన్ ద్వారా తన వ్యాధిని వైద్యుడుకి రోగి వివరించే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఇక్కడ 30 రకాల వైద్యపరీక్షలు నిర్వహించేందుకు వీలుగా అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. రోగులను సిబ్బంది, ఏఎన్ఎంలు పరీక్ష చేసి బీపీ, పల్స్, ఈసీజీ రిపోర్టలను ఆన్లైన్లో పెడతారు. ఏఎన్ఎంల నివేదిక ఆధారంగా ఆన్లైన్లో ఉన్న వైద్యులు రోగి వ్యాధిని నిర్ధారిస్తారు. రోగికి వచ్చిన వ్యాధి లక్షణాల ఆధారంగా స్పెషలిస్ట్‌లు పరిశీలిస్తారు. వ్యాధి నివారణకు ఏ మందులు వాడాలో ఆన్లైన్లోనే సూచిస్తారు. వైద్యుల సూచన మేరకు రోగులకు ఏఎన్ఎం ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు.