అవయవ దానంతో ఆదర్శం
విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ బ్రెయిన్ డెడ్ రోగి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఏప్రిల్ 25న శ్రీకాకుళంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన పట్నాన సత్యనారాయణ (53) తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయనను అదే రోజు సాయంత్రం విశాఖలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి అత్యవసర చికిత్స కోసం తరలించారు. ఆయన కోలుకోకపోవడంతో సోమవారం సాయంత్రం ఆస్పత్రి వైద్యులు సత్యనారాయణను బ్రెయిన్‌డెడ్ గా నిర్ధారించారు.
ఈ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు తెలియజేసి అతని కుటుంబ సభ్యులను ఆసుపత్రి వైద్యులు అవయవ దానానికి ఒప్పించారు. దానికి వారు కూడా సంసిద్దత వ్యక్త పరిచినట్లు సెవెన్ హిల్స్ ఆసుపత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ దినకర్ తెలిపారు. ఇది కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు బ్రెయిన్‌డెడ్ రోగి పట్నాన సత్యనారాయణ శరీరం నుంచి అవయవ దానానికి అర్హత ఉన్న రెండు కిడ్నీలను, కాలేయాన్ని డాక్టర్లు సేకరించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జీవన్ దాన్ సంస్థకు సమాచారాన్ని అందించారు.
జీవన్‌దాన్ సంస్థ ఆదేశం మేరకు రోగి శరీరం నుంచి పలు అవయవాలను సేకరించేందుకు మంగళవారం తెల్లవారు జామున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రోగి శరీరం నుంచి సేకరించిన రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని సెవెన్‌హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిడ్నీ ఫెయిల్ అయిన రోగికి, రెండో కిడ్నీని కేర్ ఆసుపత్రిలో మరో రోగికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. కాలేయాన్ని హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి అమర్చేందుకు మంగళవారం తెల్లవారుజామున విమానంలో పంపించనున్నారు.