patriot missiles
-
ఉక్రెయిన్ చేతికి ‘పేట్రియాట్’
కీవ్: అమెరికా అత్యాధునిక పేట్రియాట్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ చేతికొచ్చింది. దీంతో రష్యా యుద్ధమూకలను మరింత దీటుగా ఎదుర్కొంటామని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ బుధవారం ట్వీట్‌చేశారు. ‘ భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ రాకతో మా గగనతలానికి మరింత రక్షణ చేకూరింది’ అని ఆయన అన్నారు. శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను ఈ వ్యవస్థతో కూల్చేయొచ్చు. క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప శ్రేణి మిస్సైళ్లతోనే ఉక్రెయిన్ పౌర మౌలిక వసతులు ముఖ్యంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలను రష్యా ధ్వంసం చేస్తున్న విషయం విదితమే. అందుకే జనావాసాలు, మౌలిక వసతుల రక్షణ కోసం కొంతకాలంగా పేట్రియాట్ సిస్టమ్స్ సరఫరా చేయాలని అమెరికాను ఉక్రెయిన్ కోరుతోంది. ఇన్నాళ్లకు అవి ఉక్రెయిన్ చేతికొచ్చాయి. -
Ukraine-Russia War: యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం
మాస్కో/కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా పర్యటనపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఘాటుగా స్పందించారు. ‘‘ఉక్రెయిన్‌కు పేట్రియాట్ క్షిపణులు ఇస్తామని అమెరికా చెబుతోంది. మంచిదే. అలాగే కానివ్వండి. ఆ క్షిపణులను సైతం మేము కచ్చితంగా కూల్చేస్తాం’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని మరింత ప్రజ్వరిల్లజేయడానికే అమెరికా ఆయుధాలు ఇస్తోందని ఆరోపించారు. సంఘర్షణను ఇంకా పొడిగించాలన్నదే అమెరికా ఆలోచన అని దుయ్యబట్టారు. పుతిన్ తాజాగా మాస్కోలో మీడియాతో మాట్లాడారు. త్వరగా, మెరుగ్గా యుద్ధాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌తో చర్చలకు తాము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని పునరుద్ఘాటించారు. గతంలో సైనిక చర్యలన్నీ సంప్రదింపులతోనే ముగిశాయని గుర్తుచేశారు. ఉక్రెయిన్‌లోని ఘర్షణను ప్రస్తావిస్తూ ‘యుద్ధం’ అనే మాటను పుతిన్ ఉపయోగించారు. ఉక్రెయిన్‌లో ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్’ జరుగుతోంది అని ఇన్నాళ్లూ ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. తొలిసారి బహిరంగంగా ‘యుద్ధం’ అని పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగాలని జెలెన్స్కీ, అమెరికా అధికారులు కోరుకుంటున్నారని అమెరికాలో రష్యా రాయబారి అనతొలీ అంటోనోవ్ విమర్శించారు. స్వదేశంలో జెలెన్స్కీపై ప్రశంసలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేపట్టిన అమెరికా పర్యటనపై స్వదేశంలో ప్రశంసల వర్షం కురుస్తుండగా, శత్రుదేశం రష్యాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జెలెన్స్కీ పర్యటన పూర్తిస్థాయిలో విజయవంతమైందని, అమెరికా నుంచి సాయం రాబట్టడంలో ఆయన ప్రతిభ చాటుకున్నారని ఉక్రెయిన్ పౌరులు చెబుతున్నారు. కానీ, ఘర్షణను మరింత రాజేయడానికే జెలెన్స్కీ అమెరికా వెళ్లారని రష్యా అధికారులు మండిపడుతున్నారు. చక్కటి ఫలితాలతో తాను అమెరికా నుంచి తిరిగి వెళ్తున్నానని సంతోషం వ్యక్తం చేస్తూ జెలెన్స్కీ గురువారం రాత్రి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. అమెరికా సాయం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రష్యాపై పోరాటం సాగిస్తున్న తమకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు, అమెరికా పార్లమెంట్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే, జెలెన్స్కీ ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చారా? లేదా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై ఉక్రెయిన్ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన అమెరికా నుంచి పోలాండ్‌కు చేరుకున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి ఉక్రెయిన్‌కు వస్తారని సమాచారం. తాను, పోలాండ్ అధ్యక్షుడు అండ్రెజ్ డుడా ఆలింగనం చేసుకుంటున్న ఫొటోను జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు
వాషింగ్టన్: అమెరికా–ఇరాన్‌ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన అమెరికా, తాజాగా విమానవాహక యుద్ధనౌక యూఎస్ఎస్ ఆర్లింగ్టన్ను పశ్చిమాసియా సముద్రజలాల్లో మోహరిస్తున్నట్లు ప్రకటించింది. ‘పేట్రియాట్’ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలు, బలగాలపై దాడికి ఇరాన్ పూర్తి సన్నద్ధతతో ఉందన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే మోహరించిన యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ యుద్ధనౌక, బీ–52 బాంబర్ విమానాలకు ఇవి జతకలవనున్నాయి. ఇరాన్‌తో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదనీ, కానీ తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా రక్షణశాఖ స్పష్టం చేసింది. ఉ.కొరియాది విశ్వాసఘాతుకం కాదు: ట్రంప్ ‘ఉ.కొరియా స్వల్పశ్రేణి క్షిపణులనే పరీక్షించింది. అవి సాధారణమైన పరీక్షలు. క్షిపణి పరీక్షలు విశ్వాసఘాతుకమని నేను అనుకోవట్లేను. ఉ.కొరియా అధినేత కిమ్‌తో నాకు సత్సంబంధాలు ఉన్నాƇు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. గతేడాది జూన్‌లో ట్రంప్‌తో భేటీ నేపథ్యంలో అన్నిరకాల అణు, ఖండాంతర క్షిపణి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు కిమ్ ప్రకటించారు. ఫిబ్రవరిలో ట్రంప్‌తో రెండో విడత చర్చలు విఫలం కావడంతో ఈ ఏడాది చివర్లోగా పద్ధతిని మార్చుకోవాలని అమెరికాను కిమ్ హెచ్చరించారు. -
మళ్లీ తెరపైకి అమెరికా పేట్రియాట్ క్షిపణులు
గల్ఫ్ వార్ సమయంలో రష్యన్ స్కడ్ మిసైళ్లను ఛేదించడానికి తాను ప్రయోగించిన పేట్రియాట్ మిసైళ్లను ఇప్పుడు ఆమెరికా మళ్లీ తెరమీదకు తీసుకొచ్చింది. ఉత్తరకొరియా ఇటీవలే అణు పరీక్ష, లాంగ్ రేంజి రాకెట్ ప్రయోగాలు చేయడంతో.. దానికి చెక్ పెట్టేందుకు దక్షిణ కొరియాలో అదనంగా ఒక పేట్రియాట్ మిసైల్ బ్యాటరీ మోహరించింది. వచ్చే వారం దక్షిణ కొరియాలో మరిన్ని అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లను అమెరికా మోహరించనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పేట్రియాట్ మిసైళ్లను అక్కడకు తరలించింది. ఉత్తర కొరియా నుంచి వచ్చే ఎలాంటి దానినైనా ఎదుర్కొనేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఇలాంటి ఎక్సర్సైజులు ఉపయోగపడతాయని ఎయిత్ ఆర్మీకి చెందిన కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ థామస్ వండాల్ చెప్పారు.