అశ్వంపై పట్టాభిరాముడు
వాల్మీకిపురం, న్యూస్‌లైన్: వాల్మీకిపురం శ్రీపట్టాభిరాములవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అశ్వవాహన మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంలో తెల్లవారుజాము నుంచి సుప్రభాతసేవ, మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవతో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుచ్చి ఉత్సవం, భోగోత్సవమూర్తులైన శ్రీసీతారామలక్ష్మణులకు స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం విశేష అలంకరణలు చేశారు.
రాత్రి కైంకర్యాల అనంతరం ఊంజల్ సేవ క న్నులపండుగగా సాగింది. అనంతరం విశేషాలంకృతుడైన పట్టాభిరాముడు విల్లంబులు ధరించి అశ్వవాహనంపై పార్వేటకు బయలుదేరడం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సందర్భంగా అర్చకులు పార్వేట విశిష్టతను భక్తులకు తెలియజేశారు. బళ్లారివాయిద్యాలు, బాణసంచా పేలుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పురవీధుల్లో పట్టాభిరాముడి నగరోత్సవం వైభవంగా సాగింది.
ఎస్వీ మ్యూజిక్ కళాశాల విద్యార్థినుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాలు టీటీడీ డెప్యూటీ ఈవో శ్రీధర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, ప్రధాన అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, భాషికాచార్యులు, కృష్ణప్రసాద్ , రాజుభట్టర్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.