కలెక్టర్ తీరుతో సమయం వృథా
ఆర్డీకి ఫిర్యాదుచేసిన మునిసిపల్ కమిషనర్లు
మచిలీపట్నం : కలెక్టర్ బాబు.ఎ వ్యవహార తీరుతో తమ సమయం వృథా అవుతోందని మునిసిపల్ రీజినల్ డెరైక్టర్ వి.రాజేంద్రప్రసాద్‌కు జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు బుధవారం ఫిర్యాదు చేశారు. వారంలో మూడు రోజులు సమీక్షలతోనే సమయం గడుస్తోందని, ఫలితంగా పురపాలక సంఘాల్లో పాలన కుంటుపడి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తోందని వివరించారు. బందరు మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్లతో ఆర్డీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్లు మాట్లాడుతూ కలెక్టర్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.
సోమవారం ‘మీ కోసం’, వీడియో కాన్ఫరెన్స్, గురువారం ‘స్మార్ట్ వార్డు’, మరో రోజు విజయవాడలో కలెక్టర్ సమావేశం నిర్వహించే సమావేశాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పాల్గొనడం వల్ల తమ మునిసిపాలిటీల్లో ఆస్తిపన్ను, తాగునీటి పన్ను వసూలుపై దృష్టి సారించలేకపోతున్నామని వివరించారు. సాధారణ, అత్యవసర ఫైళ్లతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు పెట్టేందుకు సమయం చాలని పరిస్థితి ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆర్డీ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ పురపాలకశాఖ పరంగా రాష్ట్రస్థాయి అధికారులు చెప్పే పనులను పక్కన పెట్టి కలెక్టర్ నిర్వహించే సమావేశాలకు వెళ్లి సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. తమకు పనులు ఉన్నాయని కలెక్టర్‌కు స్పష్టం చేయాలని ఆదేశించారు.