సెమీస్‌లో హంటర్స్ ప్రీమియర్
బ్యాడ్మింటన్ లీగ్
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్–2) రెండో సీజన్లో హైదరాబాద్ హంటర్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంప్ ఢిల్లీ ఏసర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. గురువారం ఇక్కడ జరిగిన టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో హంటర్స్ 5–2తో ఏసర్స్‌ను కంగుతినిపించింది. తద్వారా 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. పురుషుల సింగిల్స్ తొలి పోరులో సమీర్ వర్మ (హంటర్స్) 8–11, 11–3, 11–2తో సిరిల్ వర్మ (ఏసర్స్)పై గెలుపొందాడు. తర్వాత మిక్స్డ్ డబుల్స్‌లోనూ హైదరాబాద్ జోడి సాత్విక్ సాయిరాజ్– చౌ హో వా 11–3, 11–4తో వ్లాదిమిర్ ఇవనోవ్– గుత్తాజ్వాల (ఏసర్స్) జంటను ఓడించడంతో 2–0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఢిల్లీ ట్రంప్ మ్యాచ్ పురుషుల సింగిల్స్‌లో జాన్ ఓ జోర్గెన్సన్ 11–5, 11–7తో రాజీవ్ ఉసెఫ్ (హంటర్స్)పై గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. అనంతరం జరిగిన హైదరాబాద్ ట్రంప్ మ్యాచ్ మహిళల సింగిల్స్‌లో కరోలినా మారిన్ 15–14, 11–4తో నిట్చోన్ జిందపొన్ (ఏసర్స్)ను ఓడించి హంటర్స్‌కు విజయాన్ని ఖాయం చేసింది. పురుషుల డబుల్స్‌లో తన్ బూన్ హియోంగ్– తన్ వీ కియోంగ్ (హంటర్స్) 11–9, 13–11తో వ్లాదిమిర్ ఇవనోవ్–ఇవాన్ సొజోనొవ్ (ఏసర్స్) జంటపై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో అవధ్ వారియర్స్‌తో చెన్నై స్మాషర్స్, ముంబై రాకెట్స్‌తో హైదరాబాద్ హంటర్స్ తలపడతాయి.