PCB officials
-
అమర రాజా బ్యాటరీస్ మూసివేతకు ఆదేశం
సాక్షి, అమరావతి: కాలుష్య కాసారాలుగా మారుతున్న పరిశ్రమలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ (ఏపీ పీసీబీ) మండలి కొరడా ఝళిపిస్తోంది. వైఎస్సార్ జిల్లా యర్రగుంట్లపల్లి మండలంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న జువారి సిమెంట్ పరిశ్రమ మూసివేతకు గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసిన కాలుష్య నియంత్రణ మండలి.. తాజాగా అమర రాజా బ్యాటరీస్‌కు చెందిన రెండు పరిశ్రమల మూసివేతకు ఆదేశాలిచ్చింది. అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమల్లో లోపాలను సరిదిద్దుకోవాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసినా ఆ కంపెనీ యాజమాన్యం స్పందించలేదు. దాంతో ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న రెండు పరిశ్రమలనూ మూసివేయాలంటూ ఏపీ పీసీబీ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. తనిఖీల్లో వెల్లడైన లోపాలను సరిదిద్దుకుని కాలుష్య ఉద్గారాలకు యాజమాన్యాలు అడ్డుకట్ట వేయగలిగేలా చర్యలు తీసుకుంటే ఈ పరిశ్రమలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తారు. గాలి, నేల, నీరు కాలుష్యమే.. అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమల్లో ఫిబ్రవరి 25, 26, మార్చి 8, 9, 25, 26 తేదీల్లో ఏపీ పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతి జారీ చేసినప్పుడు పేర్కొన్న ప్రమాణాలతో పోలిస్తే వాయు కాలుష్యం అధికంగా ఉన్నట్టు తేలింది. క్యూబిక్ మీటర్ వాయువు(గాలి)కి నిబంధనల మేరకు లెడ్ (సీసం) 1 మైక్రో గ్రాము ఉండాలి. కానీ.. ట్యాబులర్ బ్యాటరీస్ ఉత్పత్తి చేసే విభాగంలో 1.151, ఆటోమొబైల్ బ్యాటరీస్ విభాగంలో 22.2 మైక్రో గ్రాములు ఉన్నట్టు తేలడంతో పర్యావరణ అనుమతిలో పేర్కొన్న నిబంధనలను అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ ఉల్లంఘించినట్టు ఏపీ పీసీబీ అధికారులు తేల్చారు. పరిశ్రమ అవసరాల కోసం రోజూ వినియోగించే నీటి ద్వారా వచ్చే 2,186 కిలో లీటర్ల వ్యర్థ జలాలను సక్రమంగా శుద్ధి చేయకుండానే గ్రీన్ బెల్ట్‌లో పెంచుతున్న మొక్కలకు సరఫరా చేస్తున్నట్టు తేలింది. గ్రీన్ బెల్ట్‌లోని పలుచోట్ల మార్చి 9న మట్టి నమానాలను సేకరించిన ఏపీ పీసీబీ అధికారులు నాణ్యత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఒక కిలో మట్టిలో కనిష్టంగా 49.2 నుంచి గరిష్టంగా 177.5 మిల్లీగ్రాముల సీసం ఉండాలి. కానీ 295.5 మిల్లీ గ్రాముల సీసీం ఉన్నట్టు తేలింది. ఉద్యోగులు, ప్రజల రక్తంలోనూ సీసం పరిశ్రమలో పనిచేసే 3,533 మంది ఉద్యోగుల రక్త నమూనాలను సేకరించిన తనిఖీ బృందం వాటిని పరీక్షించింది. రక్త నమూనాల్లో సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు వెల్లడైంది. పరిశ్రమ పరిసర గ్రామాల్లోని ప్రజల నుంచి సేకరించిన రక్త నమూనాల్లోనూ సీసం శాతం మోతాదుకు మించి ఉన్నట్టు రూఢీ అయింది. దీంతో ఏప్రిల్ 6న అమర రాజా బ్యాటరీస్ సంస్థకు ఏపీ పీసీబీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. ఏప్రిల్ 20న అమర రాజా సంస్థ సమాధానం ఇచ్చింది. దీనిపై ఏప్రిల్ 22న ఎక్సటర్నల్ అడ్వైజరీ కమిటీ (ఈఏసీ) సమావేశమై సమగ్రంగా చర్చించింది. పర్యావరణ అనుమతిని ఉల్లంఘించిన అమర రాజా బ్యాటరీస్ పరిశ్రమలను మూసివేయాలని ఏపీ పీసీబీకి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో నూనెగుండ్లపల్లి, కరకంబాడి వద్ద గల రెండు పరిశ్రమలనూ మూసివేయాలని పేర్కొంటూ కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం: అమరరాజా ‘ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్ని చర్యలూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సైన్యం, ఆస్పత్రులు, టెలికాం రంగాలకు బ్యాటరీల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కంపెనీ ముందు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం. కోవిడ్ విపత్తు వేళ సున్నిత రంగాలకు సరఫరా దెబ్బతినకుండా అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణకు అమర రాజా సుదీర్ఘకాలంగా అన్ని చర్యలు తీసుకుంటోంది. పలు అవార్డులను కూడా సాధించింది. మేం తీసుకుంటున్న అన్ని చర్యల్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు వివరించాం’ అని అమర రాజా సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
త్వరలో భారత్-పాక్ టీ20 సిరీస్.. !
న్యూఢిల్లీ: క్రికెట్ ప్రేమికులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న దాయాదుల క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచ క్రికెట్లో వివిధ దేశాల మధ్య నిత్యం ద్వైపాక్షిక సిరీస్‌లు జరుగుతున్నప్పటికీ.. భారత్-పాక్‌ల మధ్య జరిగే సిరీస్‌లో వచ్చే మజానే వేరన్నది క్రీడాభిమానుల అభిప్రాయం. కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్ జరగడానికి సాధ్యపడలేదు. అప్పుడప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఎదురుపడటమే తప్ప.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది లేదు. అయితే చాలాకాలం తర్వాత ఆ అవకాశం రానే వచ్చింది. భారత్-పాక్ మధ్య టీ20 సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది చివర్లో భారత్, పాక్‌ల మధ్య టీ20 సిరీస్ జరగనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ చారిత్రక సిరీస్ కోసం సిద్ధంగా ఉండాలని తమకు ఆదేశాలు అందినట్లు ఆయన ప్రకటించాడు. ఈ వార్తను పాక్ మీడియా సైతం దృవీకరించింది. అయితే ఈ అంశంపై ఇరు దేశాల క్రికెట్ బోర్డు మధ్య చర్చలు మాత్రం జరగలేదని తెలుస్తోంది. పాక్ ప్రకటించిన విధంగా ఈ సిరీస్ సాధ్యపడితే.. టీమిండియా పాక్‌లో పర్యటించాల్సి ఉంటుందని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే చివరిసారి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగినప్పుడు పాక్ జట్టు భారత్‌లో పర్యటించింది. కాగా, చివరిసారి భారత్-పాక్ మధ్య క్రికెట్ సిరీస్ 2012-13లో జరిగింది. ఈ సిరీస్‌లో 2 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌లు జరగ్గా.. పాక్ వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్లు చెరో టీ20 గెలవడంతో ఆ సిరీస్ డ్రాగా ముగిసింది. -
కంభంపాటి షోరూం మూతకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్ల వర్క్ షాప్ నిర్వహిస్తున్న మాజీ ఎంపీ కంభంపాటి రాంమోహన్‌రావుకు చెందిన జయలక్ష్మీ ఆటోమోటివ్స్(లక్ష్మీ హ్యుందాయ్) మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ కూడా కనెక్షన్ తొలగించినా ఆదివారం జనరేటర్ సహాయంతో పనులు చేస్తున్న సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాలనీ వాసులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14, భాగ్యనగర్ స్టూడియోస్ ఆవరణలోని ఇంటి నంబర్ 8–2–287/ హెచ్/ఏ లో టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటికి చెందిన జయలక్ష్మి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్(లక్ష్మీ హ్యుందాయ్) వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆ ఏరియా నివాస ప్రాంతమైనప్పటికీ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వైనంపై గతంలోనే స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థను మూసి వేయాల్సిందిగా ఈనెల 24న క్లోసర్ ఆర్డర్స్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆర్. రవీందర్‌రెడ్డి జారీ చేశారు. దీంతో విద్యుత్ శాఖ కనెక్షన్‌ను సైతం తొలగించింది. ఆదేశాలు ధిక్కరించి: కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను ధిక్కరిస్తూ లక్ష్మీ హ్యుందాయ్ ఆవరణలో యథేచ్ఛగా కార్ల వర్క్‌షాప్ కొనసాగుతున్నదని వారిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం భాగ్యనగర్ స్టూడియోస్ అధినేత బాదం బాల కృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ ఆదేశాలకు విరు ద్ధంగా వర్క్‌షాప్ కొనసాగుతున్నట్లు తెలుసుకొని పనులు నిలిపివేయాల్సిందిగా బంజారాహిల్స్ ఎస్ఐ రాంరెడ్డి శనివారం సూచించారు. పోలీసుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ జనరేటర్‌తో ఆదివారం తిరిగి వర్క్‌షాప్ నడుపుతుండటమే కాకుండా జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాలకృష్ణ ఆదివారం మరోసారి బంజారాహిల్స్ పీఎస్‌లో మరో ఫిర్యాదు అందజేశారు. మరోవైపు ఇదే ఆవరణలో డీఏవీ పబ్లిక్ స్కూల్ కొనసాగుతుండగా ఇక్కడి విద్యార్థులకు కూడా ఈ వర్క్‌షాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రిన్సిపాల్ పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో రోజూ 300 కార్లకు మరమ్మతులు జరుగుతుంటాయని 250 మంది సిబ్బంది పని చేస్తుం టారని వందలాదిగా ఆయిల్ డబ్బాలు ప్రమాదకరస్థితిలో నిల్వ చేస్తుంటారని ఫిర్యా దులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఆరు అక్రమ షెడ్లు నిర్మించిన విషయాన్ని కూడా తెలిపారు. ఇదే విషయమై కంభంపాటి రాంమోహన్‌రావుపై రెండు సార్లు కేసులు కూడా నమోదయ్యాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. -
‘బయో’ భయం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల నిర్వీర్యం ఘోరంగా ఉంది. ఈ వ్యర్థాల నిర్వీర్యం సరిగా లేకపోవడంతో హెపటైటిస్ బి లాంటి భయంకర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రుల్లో విడుదలయ్యే వ్యర్థాలను ఎక్కడికక్కడ వేరుచేసి, నిబంధనల మేరకు నిర్దేశించిన ఉష్ణోగ్రతల్లో నిర్వీర్యం చేయాల్సి ఉండగా అలా చేయకుండా వ్యర్థాలను పారపోస్తున్నారు. ప్లాస్టిక్‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలు అధికారుల దృష్టికి వచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విజయవాడ అరండల్‌పేటలో బయోవ్యర్థాల వాస్తవ స్థితిగతులు ‘సాక్షి’ పరిశీలనలో బయటపడ్డాయి. ఒక పడక వ్యర్థానికి రూ.4 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో పడక నుంచి విడుదలయ్యే వ్యర్థాలకు రోజుకు రూ.4 ఇస్తారు. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 250 గ్రాముల వరకు వ్యర్థాలు విడుదలవుతున్నాయి. రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో సగటున 8 వేల పడకలు ఉండగా, గుంటూరు, కృష్ణా, విశాఖలో మాత్రం ఒక్కో జిల్లాలోనే 20 వేల పడకలున్నాయి. రాష్ట్రం మొత్తం సుమారు 1.40 లక్షల పడకల నుంచి రోజుకు 35 వేల కిలోల బయో వ్యర్థాలు విడుదలవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే నిర్వీర్యం చేయాలి. కానీ అలా చేయడం లేదు. ఉదాహరణకు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకే కాంట్రాక్టర్ ఈ నిర్వహణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా యూనిట్‌ను గత కొన్ని నెలలుగా నిర్వహించకుండా ఈ వ్యర్థాలను గుంటూరుకు తరలిస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. అంతేకాకుండా వ్యర్థాల రవాణా, వాటి నిర్వీర్యం విషయంలో ఏ మాత్రం నిబంధనలు పాటించడం లేదు. బయో వ్యర్థాలను నిర్వీర్యం చేసే యూనిట్లలో పనిచేసే సిబ్బందికి కనీస రక్షణ ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యర్థాల నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా, వైరస్ల వల్ల తాము వ్యాధులబారిన పడుతున్నామని సిబ్బంది చెబుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు బయో వ్యర్థాల నిర్వీర్యంలో పీసీబీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కవుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏసీబీకి దొరికిన అధికారే దీనికి నిదర్శనం. ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లు ఎలా ఉన్నా, ప్లాస్టిక్ వ్యర్థాలను బయటే అమ్ముకుంటున్నా, వీటిని రవాణా చేసే విషయంలో ఎలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్ ఉంటున్నారు. కొత్త వారిని రానివ్వడం లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకుంటే 25 కేసులు పెట్టారు. చివరకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు గెలిచి కాంట్రాక్ట్ దక్కించుకోగలిగారు. పీసీబీ అధికారులే వెనకుండి కొత్త కాంట్రాక్టర్‌ను ఇబ్బందిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని ఓ పీసీబీ అధికారికి వివరణ కోసం ఫోన్ చేయగా.. వెంటనే సంబంధిత యూనిట్ల వారికి సమాచారం అందడం గమనార్హం. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఇవే.. ♦ బయో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు విధిగా జీపీఎస్ ఉండాలి. ♦ ఈ వాహనాలకు రూట్ చార్ట్ ఉండాలి. ♦ ఏ ఆస్పత్రిలో ఎంత బయోవ్యర్థాలు సేకరించారో కాంట్రాక్ట్ సంస్థ విధిగా తన వెబ్సైట్లో నమోదు చేయాలి. ♦ వ్యర్థాలను సేకరించే పనివారికి ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలి. ♦ వారికి గ్లౌజులు, ఎన్–95 మాస్కులు ఉండేలా చూడాలి. ♦ వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలి. ♦ సేకరించిన వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్యం చేయాలి బయో వ్యర్థాల నిర్వహణ ఎలా ఉంటుందంటే.. ♦ ప్రతి జిల్లాలో టెండర్ల ద్వారా పీసీబీ ఆధ్వర్యంలో సంస్థను నిర్ణయిస్తారు. ♦ జిల్లాకొక కాంట్రాక్టర్‌ను నిర్ణయిస్తారు. అదే జిల్లాలో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. ♦ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యర్థాలన్నీ ఏ రోజుకారోజు సేకరించాలి. ♦ ఆస్పత్రిలోనే వ్యర్థాలను వేర్వేరు బ్యాగుల్లో వేసి సంచిని సీల్ చేసి బార్కోడ్ వేస్తారు. ♦ ఆ వ్యర్థాల సంచులను నిర్వీర్యం చేసే ప్లాంట్ వరకూ తెరవకుండా తీసుకెళ్లాలి. వ్యర్థాల నిర్వహణ ఎలా ఉండాలి? ఆస్పత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాల్లో నాలుగు రకాలు ఉంటాయి. వీటిని వేర్వేరు బ్యాగుల్లో వేస్తారు. పసుపు పచ్చ బ్యాగులో టాక్సిన్ వేస్ట్ (విషపూరిత వ్యర్థాలు లేదా అవయవాలు), ఎర్రబ్యాగుల్లో సిరంజిలు, గ్లౌజ్ వంటి ప్లాస్టిక్‌వి, తెల్ల బ్యాగుల్లో నీడిల్స్, కత్తులు, నల్లబ్యాగుల్లో ఆహార వ్యర్థాలు తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఎర్రబ్యాగుల్లో వేసిన ప్లాస్టిక్‌ను వెయ్యి సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కరిగించి, ముక్కలు చేయాలి. దీనికి కేజీకి రూ.10 ఇస్తారు. ఆసుపత్రుల్లో ఏం జరుగుతోంది దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను బ్యాగుల్లో నుంచి తీసి నేరుగా చెత్త సేకరించేవారికి కేజీ రూ.60కు అమ్మేస్తున్నారు. వారు ఈ వ్యర్థాలను స్వల్ప ఉష్ణోగ్రతలో కరిగించి స్ట్రాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ఐస్‌క్రీమ్ కప్పులుగా తయారుచేస్తున్నారు. నష్టాలేంటి దీనివల్ల హెపటైటిస్ బి, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది. చర్యలు శూన్యం ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయో వ్యర్థాల వల్ల జబ్బులొస్తున్నాయని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులూ చర్యలు తీసుకోవడంలేదు. విజయవాడ అరండల్‌పేటలో ‘సాక్షి’ పరిశీలనకు వెళ్లగా బ్యాగులు తీసేసి అప్పటికప్పుడే ఇతర ప్రాంతానికి తరలించారు. మరమ్మతులున్నాయని అనుమతించాం కృష్ణా జిల్లాలో ఉన్న ప్లాంటు మరమ్మతుకు వచ్చిందంటే 15 రోజులు గుంటూరులోని ప్లాంటులో వ్యర్థాలను నిర్వీర్యం చేస్తామంటే అనుమతి ఇచ్చాం. – కె.వి.రావు, జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, పీసీబీ, విజయవాడ అక్కడ పరిస్థితులు దారుణం నిబంధనల ప్రకారం వ్యర్థాల నిర్వీర్యం జరగడం లేదు. కొన్ని రోజుల కిందటే ఈ ప్లాంట్‌ను చూసి కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చాం. బయో వ్యర్థాలు ఓపెన్ చేసి ఎక్కువ సేపు ఉంచడం వల్ల వాసనలు వస్తున్నాయి. – మహేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, పీసీబీ, గుంటూరు బయో వ్యర్థాల వల్ల పెను ప్రమాదం బయో వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయకపోతే పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే. హెచ్ఐవీ, హెపటైటిస్ బి, సి, ఎ వంటి వ్యాధులు వస్తాయి. ఆస్పత్రిలో వాడిన కత్తులు, నీడిల్స్, సర్జికల్ బ్లేడ్స్ కారణంగా టైఫాయిడ్, కలరా, ఇన్ఫెక్షన్లు, రుమటిక్ ఫీవర్, చర్మసంబంధిత వ్యాధులు వస్తాయి. రక్తం వంటివి ఉన్న బ్యాగులు లేదా, గ్లౌజులు సరిగా నిర్వీర్యం చేయకపోతే ఫైలేరియాసిస్, మలేరియా లాంటి వ్యాధులూ వస్తాయి. – డా.హరిచరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల. -
ఏపీపీసీబీ నిధులు మాయం!
♦ రూ. 6.9 కోట్ల ఎఫ్డీల్ని ఎస్బీహెచ్ ప్రైవేటు సంస్థలకు బదలాయించిందన్న పీసీబీ ♦ మెహిదీపట్నం బ్రాంచి అధికారులపై ఎస్బీహెచ్ డీజీఎంకు ఫిర్యాదు ♦ ఎస్బీహెచ్ అధికారులు ఫోర్జరీ సంతకాలతో ఈ మొత్తాల్ని బదిలీ చేశారన్న పీసీబీ ♦ ఏపీలోని రెండు పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు..డీజీపీ దృష్టికీ ఈ వ్యవహారం.. సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)కి చెందిన రూ.6.9 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాలు మాయమయ్యాయి. ఎస్బీహెచ్ అధికారులు ఫోర్జరీ చేసి ఈ మొత్తాల్ని ప్రైవేటు సంస్థలకు బదలాయించారని పేర్కొన్న పీసీబీ ఈ మేరకు హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ఎస్బీహెచ్ బ్రాంచి అధికారులపై ఎస్బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్(డీజీఎం)కు శనివారం ఫిర్యాదు చేసింది. ఫోర్జరీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తమ ఫిక్స్డ్ డిపాజిట్లను థర్డ్‌పార్టీలకు బదలాయించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని పలు పోలీస్స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేసినట్టు పీసీబీ అధికారులు తెలిపారు. అంతేగాక ఈ వ్యవహారాన్ని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. వివరాలివీ.. ఏపీపీసీబీ ముఖ్య గణాంక అధికారి(సీఏఓ) పేరుతో మెహిదీపట్నం ఎస్బీహెచ్లో రూ.6.9 కోట్ల విలువైన ఏడు ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీలు) చేసింది. ఏడాది కాలవ్యవధిగల ఈ ఎఫ్డీలను నెలకూడా గడవకముందే మెహిదీపట్నం ఎస్బీహెచ్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్ జిల్లాలోని రాజంపేట, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తమిళనాడు ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థలకు బదలాయించారని పీసీబీ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఎఫ్డీలను గడువు తీరాక యజమాని (పీసీబీ సీఏఓ)కే చెల్లిం చాలి. చెక్కుల్లాగా ఎఫ్డీలను వేరేవారికి బదిలీ చేయడానికి వీలులేదు. ఇందుకు భిన్నంగా ఈ మొత్తాలను ఫలానా సంస్థలకు బదలాయించాలంటూ ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలు పెట్టుకుని బ్యాంకు సిబ్బంది బదిలీ చేసేశారని పీసీబీ ఉన్నతాధికారులు చెప్పారు. ‘‘ఎవరు సంతకం చేసినా ఫిక్స్డ్ డిపాజిట్లను వేరేవారి పేరుతో బదిలీ చేయరాదు. ఈ నిబంధనను కాలరాసి ఎలా బదిలీ చేశారు?’’ అని ఎస్బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇతర అధికారుల్ని ప్రశ్నించగా.. నిజమే, తమ సిబ్బంది తప్పుచేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని డీజీఎం పేర్కొన్నట్లు పీసీబీ అధికారులు తెలిపారు. ఈ బ్యాంకు నుంచి నిధులు రాజంపేట, తిరుపతి, తమిళనాడు ప్రాంతాల్లోని సంస్థలకు వెళ్లినందున ఆయా ప్రాంతాల్లోని(రాజంపేట, తిరుపతి) పోలీస్స్టేషన్లలోనూ సంబంధిత సంస్థలపై ఫిర్యాదు చేసినట్లు పీసీబీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు పీసీబీ నుంచి బ్యాంకుకు ఎలా వెళ్లాయనేది తేలట్లేదు.