కంభంపాటి షోరూం మూతకు ఆదేశాలు  | Kumbhampatti showroom to the showroom lid | Sakshi
Sakshi News home page

కంభంపాటి షోరూం మూతకు ఆదేశాలు 

Oct 1 2018 2:59 AM | Updated on Oct 1 2018 2:59 AM

Kumbhampatti showroom to the showroom lid - Sakshi

భాగ్యనగర్‌ స్టూడియో ఆవరణలో కొనసాగుతున్న షోరూం

సాక్షి, హైదరాబాద్‌: నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్ల వర్క్‌ షాప్‌ నిర్వహిస్తున్న మాజీ ఎంపీ కంభంపాటి రాంమోహన్‌రావుకు చెందిన జయలక్ష్మీ ఆటోమోటివ్స్‌(లక్ష్మీ హ్యుందాయ్‌) మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్‌ శాఖ కూడా కనెక్షన్‌ తొలగించినా ఆదివారం జనరేటర్‌ సహాయంతో పనులు చేస్తున్న సంస్థపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ కాలనీ వాసులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 14, భాగ్యనగర్‌ స్టూడియోస్‌ ఆవరణలోని ఇంటి నంబర్‌ 8–2–287/ హెచ్‌/ఏ లో టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటికి చెందిన జయలక్ష్మి ఆటోమోటివ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(లక్ష్మీ హ్యుందాయ్‌) వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నారు.  ఆ ఏరియా నివాస ప్రాంతమైనప్పటికీ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వైనంపై గతంలోనే స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థను మూసి వేయాల్సిందిగా ఈనెల 24న క్లోసర్‌ ఆర్డర్స్‌ను  రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ ఆర్‌. రవీందర్‌రెడ్డి జారీ చేశారు. దీంతో విద్యుత్‌ శాఖ కనెక్షన్‌ను సైతం తొలగించింది.  

ఆదేశాలు ధిక్కరించి: కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను ధిక్కరిస్తూ లక్ష్మీ హ్యుందాయ్‌ ఆవరణలో యథేచ్ఛగా కార్ల వర్క్‌షాప్‌ కొనసాగుతున్నదని వారిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం భాగ్యనగర్‌ స్టూడియోస్‌ అధినేత బాదం బాల కృష్ణ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ ఆదేశాలకు విరు ద్ధంగా వర్క్‌షాప్‌ కొనసాగుతున్నట్లు తెలుసుకొని పనులు నిలిపివేయాల్సిందిగా బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రాంరెడ్డి శనివారం సూచించారు. పోలీసుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ జనరేటర్‌తో ఆదివారం తిరిగి వర్క్‌షాప్‌ నడుపుతుండటమే కాకుండా జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాలకృష్ణ ఆదివారం మరోసారి బంజారాహిల్స్‌ పీఎస్‌లో మరో ఫిర్యాదు అందజేశారు.

మరోవైపు ఇదే ఆవరణలో డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ కొనసాగుతుండగా ఇక్కడి విద్యార్థులకు కూడా ఈ వర్క్‌షాప్‌ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రిన్సిపాల్‌ పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో రోజూ 300 కార్లకు మరమ్మతులు జరుగుతుంటాయని 250 మంది సిబ్బంది పని చేస్తుం టారని వందలాదిగా ఆయిల్‌ డబ్బాలు ప్రమాదకరస్థితిలో నిల్వ చేస్తుంటారని ఫిర్యా దులో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండా ఆరు అక్రమ షెడ్లు నిర్మించిన విషయాన్ని కూడా తెలిపారు. ఇదే విషయమై కంభంపాటి రాంమోహన్‌రావుపై రెండు సార్లు కేసులు కూడా నమోదయ్యాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement