Kambampati Rammohan Rao
-
కంభంపాటి రామ్మోహన్రావు రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు శనివారం తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో గత ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ మేరకు గత నెల 30న తన రాజీనామా లేఖను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి పంపారు. 2014లో కంభంపాటిని అప్పటి టీడీపీ సర్కార్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయడం ఆనవాయితీ. అయితే పలువురు టీడీపీ నాయకులు మాత్రం ఇంకా పదవులు పట్టుకొని వేలాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
కంభంపాటి షోరూం మూతకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా కార్ల వర్క్ షాప్ నిర్వహిస్తున్న మాజీ ఎంపీ కంభంపాటి రాంమోహన్‌రావుకు చెందిన జయలక్ష్మీ ఆటోమోటివ్స్(లక్ష్మీ హ్యుందాయ్) మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ శాఖ కూడా కనెక్షన్ తొలగించినా ఆదివారం జనరేటర్ సహాయంతో పనులు చేస్తున్న సంస్థపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కాలనీ వాసులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 14, భాగ్యనగర్ స్టూడియోస్ ఆవరణలోని ఇంటి నంబర్ 8–2–287/ హెచ్/ఏ లో టీడీపీ మాజీ ఎంపీ కంభంపాటికి చెందిన జయలక్ష్మి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్(లక్ష్మీ హ్యుందాయ్) వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఆ ఏరియా నివాస ప్రాంతమైనప్పటికీ వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వైనంపై గతంలోనే స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థను మూసి వేయాల్సిందిగా ఈనెల 24న క్లోసర్ ఆర్డర్స్‌ను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆర్. రవీందర్‌రెడ్డి జారీ చేశారు. దీంతో విద్యుత్ శాఖ కనెక్షన్‌ను సైతం తొలగించింది. ఆదేశాలు ధిక్కరించి: కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను ధిక్కరిస్తూ లక్ష్మీ హ్యుందాయ్ ఆవరణలో యథేచ్ఛగా కార్ల వర్క్‌షాప్ కొనసాగుతున్నదని వారిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం భాగ్యనగర్ స్టూడియోస్ అధినేత బాదం బాల కృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ ఆదేశాలకు విరు ద్ధంగా వర్క్‌షాప్ కొనసాగుతున్నట్లు తెలుసుకొని పనులు నిలిపివేయాల్సిందిగా బంజారాహిల్స్ ఎస్ఐ రాంరెడ్డి శనివారం సూచించారు. పోలీసుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ జనరేటర్‌తో ఆదివారం తిరిగి వర్క్‌షాప్ నడుపుతుండటమే కాకుండా జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాలకృష్ణ ఆదివారం మరోసారి బంజారాహిల్స్ పీఎస్‌లో మరో ఫిర్యాదు అందజేశారు. మరోవైపు ఇదే ఆవరణలో డీఏవీ పబ్లిక్ స్కూల్ కొనసాగుతుండగా ఇక్కడి విద్యార్థులకు కూడా ఈ వర్క్‌షాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రిన్సిపాల్ పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వర్క్‌షాప్‌లో రోజూ 300 కార్లకు మరమ్మతులు జరుగుతుంటాయని 250 మంది సిబ్బంది పని చేస్తుం టారని వందలాదిగా ఆయిల్ డబ్బాలు ప్రమాదకరస్థితిలో నిల్వ చేస్తుంటారని ఫిర్యా దులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఆరు అక్రమ షెడ్లు నిర్మించిన విషయాన్ని కూడా తెలిపారు. ఇదే విషయమై కంభంపాటి రాంమోహన్‌రావుపై రెండు సార్లు కేసులు కూడా నమోదయ్యాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. -
జపాన్ బృందంతో కంభంపాటి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో జపాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు గురువారం ఆ దేశానికి చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత్‌లో జపాన్ రాయబారి టకేషీయోగీ నిర్వహించిన జపాన్ ఇండియా బిజినెస్ కోఆర్డినేషన్ కమిటీ(జేఐబీసీసీ) సమావేశంలో కంభంపాటితోపాటు ఏపీ పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, పట్టణాభివృద్ధిశాఖ ప్ర ధాన కార్యదర్శి సాంబశివరావు, పరిశ్రమలశాఖకార్యదర్శి అజయ్‌జైన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం హర్షణీయం: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెడుతూ పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేయటంపై కంభంపాటి హర్షం వ్యక్తం చేశారు. -
'తక్షణ సహాయాన్ని వెంటనే విడుదల చేయండి'
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు భేటి అయ్యారు. హుదూద్ తుఫాన్ తాకిడి గురైన ప్రాంతాలు, బాధితులకు కోసం ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన వెయి కోట్ల సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని రాజ్ నాథ్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. హుదూద్ తుఫాన్ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని త్వరగా పంపాలని కేంద్రానికి కంభంపాటి రామ్మోహన్ రావు సూచించారు.