ఏపీపీసీబీ నిధులు మాయం!
♦ రూ. 6.9 కోట్ల ఎఫ్‌డీల్ని ఎస్‌బీహెచ్ ప్రైవేటు సంస్థలకు బదలాయించిందన్న పీసీబీ
♦ మెహిదీపట్నం బ్రాంచి అధికారులపై ఎస్‌బీహెచ్ డీజీఎంకు ఫిర్యాదు
♦ ఎస్‌బీహెచ్ అధికారులు ఫోర్జరీ సంతకాలతో ఈ మొత్తాల్ని బదిలీ చేశారన్న పీసీబీ
♦ ఏపీలోని రెండు పోలీస్‌స్టేషన్లలో కేసుల నమోదు..డీజీపీ దృష్టికీ ఈ వ్యవహారం..
సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్)లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)కి చెందిన రూ.6.9 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తాలు మాయమయ్యాయి. ఎస్‌బీహెచ్ అధికారులు ఫోర్జరీ చేసి ఈ మొత్తాల్ని ప్రైవేటు సంస్థలకు బదలాయించారని పేర్కొన్న పీసీబీ ఈ మేరకు హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ఎస్‌బీహెచ్ బ్రాంచి అధికారులపై ఎస్‌బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్(డీజీఎం)కు శనివారం ఫిర్యాదు చేసింది. ఫోర్జరీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లను థర్డ్‌పార్టీలకు బదలాయించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని పలు పోలీస్‌స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేసినట్టు పీసీబీ అధికారులు తెలిపారు. అంతేగాక ఈ వ్యవహారాన్ని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.
వివరాలివీ..
ఏపీపీసీబీ ముఖ్య గణాంక అధికారి(సీఏఓ) పేరుతో మెహిదీపట్నం ఎస్‌బీహెచ్‌లో రూ.6.9 కోట్ల విలువైన ఏడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీలు) చేసింది. ఏడాది కాలవ్యవధిగల ఈ ఎఫ్‌డీలను నెలకూడా గడవకముందే మెహిదీపట్నం ఎస్‌బీహెచ్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్ జిల్లాలోని రాజంపేట, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తమిళనాడు ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థలకు బదలాయించారని పీసీబీ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఎఫ్‌డీలను గడువు తీరాక యజమాని (పీసీబీ సీఏఓ)కే చెల్లిం చాలి. చెక్కుల్లాగా ఎఫ్‌డీలను వేరేవారికి బదిలీ చేయడానికి వీలులేదు.
ఇందుకు భిన్నంగా ఈ మొత్తాలను ఫలానా సంస్థలకు బదలాయించాలంటూ ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలు పెట్టుకుని బ్యాంకు సిబ్బంది బదిలీ చేసేశారని పీసీబీ ఉన్నతాధికారులు చెప్పారు. ‘‘ఎవరు సంతకం చేసినా ఫిక్స్‌డ్ డిపాజిట్లను వేరేవారి పేరుతో బదిలీ చేయరాదు. ఈ నిబంధనను కాలరాసి ఎలా బదిలీ చేశారు?’’ అని ఎస్‌బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇతర అధికారుల్ని ప్రశ్నించగా.. నిజమే, తమ సిబ్బంది తప్పుచేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని డీజీఎం పేర్కొన్నట్లు పీసీబీ అధికారులు తెలిపారు. ఈ బ్యాంకు నుంచి నిధులు రాజంపేట, తిరుపతి, తమిళనాడు ప్రాంతాల్లోని సంస్థలకు వెళ్లినందున ఆయా ప్రాంతాల్లోని(రాజంపేట, తిరుపతి) పోలీస్‌స్టేషన్లలోనూ సంబంధిత సంస్థలపై ఫిర్యాదు చేసినట్లు పీసీబీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు పీసీబీ నుంచి బ్యాంకుకు ఎలా వెళ్లాయనేది తేలట్లేదు.