DGP J. V. Ramudu
-
పుష్కర ఘాట్లను పరిశీలించిన డీజీపీ రాముడు
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్లను రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. విజయవాడ నుంచి నేరుగా సీతానగరం ఘాట్ల వద్దకు వచ్చిన ఆయనకు స్థానిక పోలీసు అధికారులు ఘాట్ల అభివృద్ధి ప్రణాళికపై వివరించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లను 360 మీటర్ల మేరకు మహానాడు రైల్వే వంతెన వరకూ విస్తురిస్తున్నట్లు తెలిపారు. రైల్వే వంతెన దాటాక మరో 100 మీటర్ల ఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు డీఎస్పీ రామాంజనేయులు డీజీపీతో చెప్పారు. డీజీపీ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఘాట్లకు వచ్చే రహదారుల ప్రాంతమంతా ఇరుకుగా ఉందని, బ్యారేజీ వద్ద నుంచి ప్రస్తుతం ఉన్న ఘాట్ల వరకూ ర్యాంపు ఏర్పాటు చేసి అదనపు ఘాట్లు నిర్మిస్తే బాగుంటుందన్నారు. ఆయన వెంట ఆర్టీసీ ఎండీ సాంబశివరావు, అదనపు డీజీలు ఆర్పీ ఠాకూర్, సురేంద్రబాబు, గుప్తా, గుంటూరు రేంజీ ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ త్రిపాఠి, ఏసీపీ నాగరాజు, మునిసిపల్ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అమరావతి పుష్కరఘాట్ల పరిశీలన అమరావతి : అమరావతి పుష్కరఘాట్లను రాష్ట్ర డెరైక్టర్ జనరల్ అఫ్ పోలీస్ జేవీ రాముడు శక్రవారం పరిశీలించారు. ముందుగా ఆయన స్థానిక ధ్యానబుద్ధ వద్ద ఉన్న స్నానఘాట్‌ను, తర్వాత అమరేశ్వరాస్నానఘాట్ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పార్కింగ్, ప్రత్యామ్నాయ రోడ్లు, పుష్కరాలకు రోజుకు ఎంతమంది భక్తులు వస్తారు, వారికి కల్పించే సౌకర్యాలు వంటి విషయాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట గుంటూరు రేంజి ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టత్రిపాఠి, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్, సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు, సీఐ మురళికృష్ణ పాల్గొనగా స్థానిక ఎస్ఐ వెంకటప్రసాద్ ఉన్నారు. -
‘తుని’ ఘటనపై విచారణ కొనసాగుతోంది..
తూర్పుగోదావరి జిల్లా ‘తుని’ ఘటనపై సీఐడీ విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తయి నిందితులను గుర్తిస్తే అరెస్టులు చేస్తామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో నూతనంగా నిర్మించనున్న కల్యాణ మండపం, సమావేశ మందిరాలకు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండేతో కలసి శంకుస్థాపన చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బెటాలియన్ ఆవరణలోని మినీ గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... నూతనంగా ప్రతిపాదించిన అమరావతి పోలీసు కమిషనరేట్ ఉమ్మడి రాష్ట్రంలోని సైబరాబాద్ కమిషనరేట్ కంటే పెద్దదని చెప్పారు. అమరావతి కమిషనరేట్‌కు సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ కమిషనర్‌గా వస్తారనే ప్రచారంపై విలేకరులు ప్రశ్నించగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర క్యాడర్ అధికారిని ఎలా నియమిస్తామని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ పరిపాలనంతా ప్రధాన బెటాలియన్ అయిన మంగళగిరి బెటాలియన్ నుంచే జరుగుతుందన్నారు. అందువల్ల ఇక్కడి ఆరో బెటాలియన్‌లోనే ఆయుధాల నిల్వ కేంద్రంతోపాటు వాహనాల మరమ్మతులు, కమ్యూనికేషన్ల వ్యవస్థ ఇప్పటికే పనిచేస్తున్నాయన్నారు. రాజధాని అమరావతిలో నక్సలైట్లు అనేది మీడియా ప్రచారమేనని కొట్టిపారేశారు. కార్యక్రమంలో బెటాలియన్స్ ఐజీ ఆర్కె మీనా, డీఐజీ జె.ప్రసాద్‌బాబు, పోలీసు అధికారులు కోటేశ్వరరావు, ద్వారకా తిరుమలరావు, బెటాలియన్ కమాండెంట్ బి.రాజకుమారి, గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, డీఎస్పీ జి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్ యాప్‌తో ట్రాఫిక్ నియంత్రణ
- ఏపీ డీజీపీ జేవీ రాముడు పుట్టపర్తి టౌన్ (అనంతపురం) హైదరాబాద్ తరహాలో స్మార్ట్ యాప్ ద్వారా రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర డిజిపి జెవి.రాముడు పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో పాటు.. జిల్లాలో పర్యటించిన ఆయన తన స్వగ్రామం అయిన నార్సింపల్లి లో చేపట్టనున్న అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ట్రాఫిక్ నియంత్రణకు స్మార్ట్ యాప్‌ను ప్రవేశ పెట్ట నున్నట్లు వివరించారు. పైలట్ ప్రాజెక్ట్ క్రింద అనంతపురంను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వీ రాముడు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ కుమార్ సిన్హా కూడా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. -
సైబర్ నేరాల విచారణకు ప్రత్యేక కేంద్రాలు
రాజోలు : మితిమీరుతున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు, వాటిని త్వరితగతిన విచారణ చేసేందుకు అన్ని జిల్లా పోలీసు కేంద్రాల్లో సైబర్ నేరాల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు. రాజోలులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలను పరిశోధన చేసేందుకు కొన్ని జిల్లాల్లోనే ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అన్ని జిల్లాల్లో సైబర్ నేరాల పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దశలవారీగా సబ్ డివిజన్ స్థాయిలో డీఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో నూతనంగా వచ్చిన మార్పుల మేరకు కేసులను వేగంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. చట్టంలో మార్పులను సామాన్య ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ దొంగతనాలు, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులను తగ్గించడంతో పాటు చోరీసొత్తు రికవరీపై పోలీసు శాఖ దృష్టి సారించిందని వివరించారు. పోలీసు భవన సముదాయాల నిర్మాణాలపై ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. పోలీసు స్టేషన్ నూతన భవనం ప్రారంభం అంబాజీపేట : ఏజెన్సీతో పాటు జిల్లాలోని ఇతర మండలాల్లోనూ దశలవారీగా పోలీసు స్టేషన్ భవనాలు నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. అంబాజీపేటలో పోలీసు శాఖ గృహ నిర్మాణ సంస్థ నిధులు రూ.68 లక్షలతో నిర్మించిన పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని హోం మంత్రి, డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసు క్వార్టర్ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ర్ట విభజన తర్వాత విలీన మండలాల కారణంగా సిబ్బందిని ఆయా ప్రాంతాలకు బదిలీ చేశామని, త్వరలో నోటిఫికేషన్ ద్వారా పోలీసు సిబ్బందిని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అమలాపురం గడియార స్థంభం సెంటర్లో ఉన్న దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన భవనం శిథిలావస్థకు చేరిందని, అందులో ఉన్న సర్కిల్ ఆఫీసుకు నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. -
ఏపీపీసీబీ నిధులు మాయం!
♦ రూ. 6.9 కోట్ల ఎఫ్డీల్ని ఎస్బీహెచ్ ప్రైవేటు సంస్థలకు బదలాయించిందన్న పీసీబీ ♦ మెహిదీపట్నం బ్రాంచి అధికారులపై ఎస్బీహెచ్ డీజీఎంకు ఫిర్యాదు ♦ ఎస్బీహెచ్ అధికారులు ఫోర్జరీ సంతకాలతో ఈ మొత్తాల్ని బదిలీ చేశారన్న పీసీబీ ♦ ఏపీలోని రెండు పోలీస్స్టేషన్లలో కేసుల నమోదు..డీజీపీ దృష్టికీ ఈ వ్యవహారం.. సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్)లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ)కి చెందిన రూ.6.9 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాలు మాయమయ్యాయి. ఎస్బీహెచ్ అధికారులు ఫోర్జరీ చేసి ఈ మొత్తాల్ని ప్రైవేటు సంస్థలకు బదలాయించారని పేర్కొన్న పీసీబీ ఈ మేరకు హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ఎస్బీహెచ్ బ్రాంచి అధికారులపై ఎస్బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్(డీజీఎం)కు శనివారం ఫిర్యాదు చేసింది. ఫోర్జరీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తమ ఫిక్స్డ్ డిపాజిట్లను థర్డ్‌పార్టీలకు బదలాయించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని పలు పోలీస్స్టేషన్లలో కూడా కేసులు నమోదు చేసినట్టు పీసీబీ అధికారులు తెలిపారు. అంతేగాక ఈ వ్యవహారాన్ని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు. వివరాలివీ.. ఏపీపీసీబీ ముఖ్య గణాంక అధికారి(సీఏఓ) పేరుతో మెహిదీపట్నం ఎస్బీహెచ్లో రూ.6.9 కోట్ల విలువైన ఏడు ఫిక్స్డ్ డిపాజిట్లు(ఎఫ్డీలు) చేసింది. ఏడాది కాలవ్యవధిగల ఈ ఎఫ్డీలను నెలకూడా గడవకముందే మెహిదీపట్నం ఎస్బీహెచ్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వైఎస్సార్ జిల్లాలోని రాజంపేట, చిత్తూరు జిల్లాలోని తిరుపతి, తమిళనాడు ప్రాంతాల్లోని ప్రైవేటు సంస్థలకు బదలాయించారని పీసీబీ ఆరోపించింది. నిబంధనల ప్రకారం ఎఫ్డీలను గడువు తీరాక యజమాని (పీసీబీ సీఏఓ)కే చెల్లిం చాలి. చెక్కుల్లాగా ఎఫ్డీలను వేరేవారికి బదిలీ చేయడానికి వీలులేదు. ఇందుకు భిన్నంగా ఈ మొత్తాలను ఫలానా సంస్థలకు బదలాయించాలంటూ ఫోర్జరీ సంతకాలతో కూడిన పత్రాలు పెట్టుకుని బ్యాంకు సిబ్బంది బదిలీ చేసేశారని పీసీబీ ఉన్నతాధికారులు చెప్పారు. ‘‘ఎవరు సంతకం చేసినా ఫిక్స్డ్ డిపాజిట్లను వేరేవారి పేరుతో బదిలీ చేయరాదు. ఈ నిబంధనను కాలరాసి ఎలా బదిలీ చేశారు?’’ అని ఎస్బీహెచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఇతర అధికారుల్ని ప్రశ్నించగా.. నిజమే, తమ సిబ్బంది తప్పుచేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని డీజీఎం పేర్కొన్నట్లు పీసీబీ అధికారులు తెలిపారు. ఈ బ్యాంకు నుంచి నిధులు రాజంపేట, తిరుపతి, తమిళనాడు ప్రాంతాల్లోని సంస్థలకు వెళ్లినందున ఆయా ప్రాంతాల్లోని(రాజంపేట, తిరుపతి) పోలీస్స్టేషన్లలోనూ సంబంధిత సంస్థలపై ఫిర్యాదు చేసినట్లు పీసీబీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు పీసీబీ నుంచి బ్యాంకుకు ఎలా వెళ్లాయనేది తేలట్లేదు. -
పరుగెత్తాల్సింది ఒక మైలే!
పోలీసు ఎంపిక పరీక్షలో కీలక మార్పులు సాక్షి, హైదరాబాద్: పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు రానున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కిలోమీటర్ల పరుగును తొలగిం చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని స్థానంలో ఒక మైలు(1.6 కి.మీ.) పరుగును చేర్చనున్నారు. డీజీపీ జేవీ రాముడు మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎంపిక ప్రక్రియలో మార్పుచేర్పులను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. పోలీసు ఎంపిక రాత పరీక్ష లోనూ మార్పులు చేయనున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఇకపై జరిగే అన్ని రిక్రూట్మెంట్లలో ఇదే విధానాన్ని అమలు చేస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించి, తర్వాత దేశదారుఢ్య పరీక్షలతోపాటు ఈవెంట్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది. రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, ఎంపిక విధానంలోనూ మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని అధికారులు సూచించారు. పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న హోంగార్డు పోస్టుల భర్తీతోపాటు వీరికిస్తున్న రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచాలంటూ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని డీజీపీ నిర్ణయించారు.