రాజోలు : మితిమీరుతున్న సైబర్ నేరాలను అదుపు చేసేందుకు, వాటిని త్వరితగతిన విచారణ చేసేందుకు అన్ని జిల్లా పోలీసు కేంద్రాల్లో సైబర్ నేరాల ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తామని డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. ఆదివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు. రాజోలులో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలను పరిశోధన చేసేందుకు కొన్ని జిల్లాల్లోనే ప్రత్యేక కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అన్ని జిల్లాల్లో సైబర్ నేరాల పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
దశలవారీగా సబ్ డివిజన్ స్థాయిలో డీఎస్పీ కార్యాలయంలో సైబర్ నేరాల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసే ఆలోచన ఉందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో నూతనంగా వచ్చిన మార్పుల మేరకు కేసులను వేగంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. చట్టంలో మార్పులను సామాన్య ప్రజలకు వివరిస్తూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ దొంగతనాలు, దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులను తగ్గించడంతో పాటు చోరీసొత్తు రికవరీపై పోలీసు శాఖ దృష్టి సారించిందని వివరించారు. పోలీసు భవన సముదాయాల నిర్మాణాలపై ప్రతిపాదనలు పంపించామని చెప్పారు.
పోలీసు స్టేషన్ నూతన భవనం ప్రారంభం
అంబాజీపేట : ఏజెన్సీతో పాటు జిల్లాలోని ఇతర మండలాల్లోనూ దశలవారీగా పోలీసు స్టేషన్ భవనాలు నిర్మించనున్నట్టు డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, డీజీపీ జేవీ రాముడు వెల్లడించారు. అంబాజీపేటలో పోలీసు శాఖ గృహ నిర్మాణ సంస్థ నిధులు రూ.68 లక్షలతో నిర్మించిన పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని హోం మంత్రి, డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసు క్వార్టర్ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.
రాష్ర్ట విభజన తర్వాత విలీన మండలాల కారణంగా సిబ్బందిని ఆయా ప్రాంతాలకు బదిలీ చేశామని, త్వరలో నోటిఫికేషన్ ద్వారా పోలీసు సిబ్బందిని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అమలాపురం గడియార స్థంభం సెంటర్‌లో ఉన్న దేవాదాయ, ధర్మాదాయ శాఖకు చెందిన భవనం శిథిలావస్థకు చేరిందని, అందులో ఉన్న సర్కిల్ ఆఫీసుకు నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు.
సైబర్ నేరాల విచారణకు ప్రత్యేక కేంద్రాలు
Published Mon, Feb 29 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:37 PM
Advertisement